పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా?

25 Sep, 2025 11:55 IST

అమరావతి:  ర‌ద్దు చేసిన పీఆర్సీ కమిషన్‌ను మ‌ళ్లీ వేస్తారా..ఫిట్‌మెంట్ ఇస్తారా అని మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.  ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి, వైయ‌స్ఆర్‌సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) గట్టి కౌంటర్‌ ఇచ్చారు. `పీఆర్సీ కమిషన్‌ రద్దు చేశారు. వీళ్లు ఒత్తిడి చేశారో.. వాళ్లు రిజైన్‌ చేశారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారై అయితే ఇప్పటికే కమిషన్‌ వేసేవారు. ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పారు. ప్రభుత్వాలు మారాయి.. అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చారు.. ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా అనేది చెప్పాలి. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ లో మాట్లాడటానికి సిద్ధం. ఎవరు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చర్చిద్దాం. అన్నీ రికార్డు ప్రకారమే మాట్లాడుకుందాం అని సవాల్‌ విసిరారు. అయితే దీనికి మంత్రి పయ్యావుల నుంచి స్పందన రాలేదు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.

ప్ర‌తీ పండుగ‌కు డీఏ కోసం ఉద్యోగులు ఎదురుచూపు
పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా.. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత మాట్లాడారు. `ఉద్యోగులకు రూ. 30 వేల కోట్లు బ‌కాయిలు ఉన్నాయి. నేటి వరకు పీఆర్సీ చైర్మన్ నియామకం లేదు. పరిశీలిస్తామంటూ మంత్రి దాట వేస్తున్నారు. నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ప్రతీ పండుగకు ఉద్యోగులకు డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో పెట్టింది.. పెన్షనర్స్ ఒక్కొక్కరికీ రూ. 15 నుంచి 20 లక్షల బకాయిలు పెట్టారు. గతంలో వైయ‌స్ జగన్ వచ్చిన 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి బకాయిలు చెల్లించాలి. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేశారో చెప్పాలి` అని  ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.  

మ‌హిళ‌ల‌పై దాడుల గురించి వాయిదా తీర్మానం
రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే మహిళలు, చిన్నారుల అదృశ్యాలపై చర్చించాలని వైయ‌స్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని తిరస్కరించారు.