ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
అనంతపురం : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు బుధవారం బంగారుపాళ్యం మార్కెట్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై అనంత వెంకటరామిరెడ్డి స్పందించారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్‌కు ఉన్న బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ధాన్యం రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు.. తాజాగా మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో మామిడి రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ బంగారుపాళ్యంకు వెళ్తే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామని తెలిపారు. పక్కా ప్లాన్‌తోనే ప్రభుత్వం, పోలీసులు జగన్ పర్యటనల్లో వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే రైతులు, వైయస్ఆర్‌సీపీ నాయకులను బెదిరించారని..నోటీసులు జారీ చేశారని తెలిపారు. సాక్షాత్తూ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్‌ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. వైయస్ జగన్ ప్రజల్లోకి రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కావాలని వివాదాలు సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత మందిపై కేసులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.