సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శం

17 Mar, 2026 13:04 IST

న్యూఢిల్లీ:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏర్పాటు చేసిన స‌చివాల‌య వ్య‌వ‌స్త దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని అనంత‌పురం మేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ వ‌సీమ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ సమ్మేళనంలో అనంతపురం మేయర్ మహమ్మద్ వసీమ్ సలీం మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థ దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఈ వ్యవస్థపై ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఆసక్తిగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమ్మేళనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్‌లో నిర్వహించబడింది. సంస్థ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెవ‌ల‌ప్‌మెంట్ ఢిల్లీ 20247(Developed Delhi @2047) అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా “పట్టణాల అభివృద్ధి – దీర్ఘకాలిక ఫలాలు” అనే సెషన్‌లో మాట్లాడే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. అనంతపురంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించగా, వివిధ దేశాల ప్రతినిధులు ఎంతో ఆసక్తిగా విన్నారని చెప్పారు.

మేయర్ వసీమ్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం హయాంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడం వల్ల పేదలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అదేవిధంగా ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

పాఠశాలల్లో “నాడు-నేడు” కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు డిజిటల్ విద్యను ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.ఈ జాతీయ సమ్మేళనానికి భారతదేశంలోని పలు నగరాల మేయర్లతో పాటు సౌత్ ఆఫ్రికా, రష్యా, నెదర్లాండ్స్, ఇథియోపియా, టర్కీ, బ్రెజిల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతపురం నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ వేదికపై వివరించే అవకాశం రావడం ఒక ప్రత్యేక గౌరవమని మేయర్ వసీమ్ సలీం తెలిపారు.