ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలి
అనంతపురం: మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం సూచించారు. మిలాద్ ఉన్ నబి పండుగను పురస్కరించుకొని అనంతపురం నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అనేక చోట్ల కుల మతాలకు అతీతంగా వారికి సహకారంగా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ర్యాలీలో పాల్గొన్న వారికి నీరు, బిస్కెట్స్, జ్యూస్ అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం సలీం మాట్లాడుతూ.. మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. పేదలకు సహకారాన్ని అందించడం, వారి పట్ల సేవా గుణాన్ని ప్రదర్శించడం వంటి మంచి బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిని బోధించిన గొప్ప మహనీయుడు మొహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేకచోట్ల పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రముతవల్లిల అసోసియేషన్ అధ్యక్షులు కేఎం షకీల్ షఫీ, వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్ ఇసాక్, దాదా గాంధీ, అంగడి ఇసాక్, ఆసిఫ్, బాబావలి తదితరులు పాల్గొన్నారు.