దావోస్ లో బాబు పొలిటికల్ మార్కెటింగ్
విశాఖపట్నం: బాధ్యతగల పదవుల్లో ఉంటూ ప్రపంచ వేదికలపై రాష్ట్రంలో పెట్టుబడులు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దావోస్ లో పెట్టుబడులు గురించి కాకుండా చంద్రబాబు పొలిటికల్ మార్కెటింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పార్టీ తీరు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా దావోస్ కి బ్యాండ్ మేళంతో పర్యటనకు వెళ్లినట్లుందని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తూ.. వాటిని తమ ఖాతాలోకి వేసుకోవడం ద్వారా... ముమ్మూటికీ తండ్రీ, కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని అమర్ తేల్చి చెప్పారు.
అన్నీ తానే అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, తాను కట్టకపోయినా శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, భోగాపురం విమానాశ్రయాలను చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రంలో సంక్రాంతి పండగలో అధికార పార్టీ నేతలో అశ్లీల నృత్యాలు నిర్వాహకులగా మారితే... దానిపై స్పందించకపోవడం దారుణమన్నారు. చలి కారణంగా దావోస్ పర్యటనకు వెళ్లలేదంటూ తనపై మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలు మీద అమర్నాధ్ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...
● అధికార టీడీపీది బ్రాండ్ ఇమేజ్ కాదు - బ్యాండ్ మేళం
ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు గురించి చెప్పుకోవడం సహజం. కానీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ బృందం పూర్తిగా వారి సొంత డబ్బా చెప్పుకున్నారు. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి, ఆయన సహచరులు మాట్లాడుతూ... ఈ వేదికకు వచ్చినప్పుడు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో ఈ సమావేశంలో పాల్గొంటున్నామని చెప్పారు. కానీ ప్రజలకు మాత్రం వాళ్లు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా తెలుగుదేశం పార్టీ బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు కనిపించింది. జ్యూరిక్ వేదికగా తెలుగు డయోస్పోరాతో జరిగిన సమావేశంలో తండ్రికి కొడుకు, కొడుక్కి తండ్రి డప్పు కొట్టుకోవడమే ఇందుకు కారణం.
● మార్కెట్ మేనేజ్ మెంట్లో బాబు ఓ యునిక్ పీస్..
స్దానిక యూరప్ కి చెందిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన తండ్రి చంద్రబాబు ఒక యూనిక్ పీస్ అని వాస్తవం చెప్పాడు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడంలోనూ, నాలుగు సార్లు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడవడంలోనూ, 16 సంవత్సరాలు పాటు సీఎంగా చేసి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉంటూ కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజిమెంట్ లో నీ తండ్రికి మించిన వ్యక్తి ఈ ప్రపంచలో మరెక్కడా ఉండడు కాబట్టి.. ఆయన కచ్చితంగా యునిక్ పీస్ అన్న విషయాన్ని లోకేష్ సరిగ్గానే చెప్పాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైయస్.జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు, ఆయన శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు, ప్రారంభించిన పనులను నేనే కారణం అని చెప్పుకుంటూ... చంద్రబాబు, తనయుడు లోకేష్ వారి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇళ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు దిష్టి తగలకుండా బొమ్మలు పెడతాం. ఇళ్లు నిర్మాణం పూర్తైన తర్వాత ఈ నిర్మాణానికి నేనే కారణం అని దిష్టిబొమ్మ అనుకున్నట్టు.. నారావారి దిష్టబొమ్మ కూడా రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే అనుకోవటం పరిపాటిగా మారింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ,విశాఖ హెల్క్ సిటీ, రుషికొండ ఐటీ టవర్స్ ఇవన్నీ ఆయన చేయకపోయినా నేనే చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబులాంటి వ్యక్తిని చూసి జాలిపడాలో, సిగ్గుపడాలో, బాధపడాలో తెలియని పరిస్ధితి.
ఇటీవల బోగాపురం జిమ్మార్ ఎయిర్ పోర్టులో మొదటి కమర్షియల్ టెస్ట్ ప్లైట్ ల్యాండింగ్ జరిగితే విపరీతమైన హడావుడి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, అనుమతులుతో అన్ని పూర్తిచేసి నిర్మాణ పనులకు వైయస్.జగన్ శంకుస్థాపన చేస్తే.. అది కూడా కూడా నేనే అంటూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. భోగాపురం జిమ్మార్ ఎయిర్ పోర్టు వైయస్.జగన్ హయాంలో కట్టారా? చంద్రబాబు హయాంలో కట్టారా? అన్నది తెలుసుకోవాలంటే వర్షాకాలం వరకు ఆగాలని ఓ మిత్రుడు సూచించారు. రానున్న వర్షాకాలంలో నీళ్లు టెర్నినల్ లోకి వస్తే ఆ ఎయిర్ పోర్టు చంద్రబాబు కట్టినట్లు, రాకపోతే వైయస్.జగన్ కట్టినట్లు అని చెప్పారు. అదేలా అంటే చంద్రబాబు కట్టిన సచివాలయమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. వర్షాకాలంలో నీళ్లు రావడం మాటలా ఉంచితే.... పూర్తిగా రాజధానినే నీళ్లలో కడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ లలో వర్షం పడితే కవర్స్ వేసి మూసినట్టే రాజధాని అమరావతి పరిస్థితి ఉందన్నారు. వర్షం పడితే అమరావతిలో కూడా పంపులుపెట్టి నీళ్లు తోడిపెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ గొప్ప విజనరీ చేసిన కార్యక్రమాలన్నీ ఈ విధంగానే ఉంటాయిని ప్రజలు మాట్లాడుకుంటుంటే.. వీళ్లు మాత్రం దావోస్ వెళ్లి గొప్పులు చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు అతిపెద్ద రాజకీయ మాయాజాలకుడు. ఆయన ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మంచేస్తాడని మరోసారి తెలుసుకున్నారు. మరో మూడేళ్లు పాటు చంద్రబాబును భరించాలి.
● పాలన చేతగాక అంతర్జాతీయ వేదికలపై కూడా మాపై విమర్శలా?
సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. గడిచిన రెండేళ్లలో మీరు సాధించిన ఘనత ఏంటి? మీరు చెప్పిదానికి మీరు చేసినదేమిటి? కనీసం ఒక్కటైనా మీరు చెప్పగలరా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు లోకేష్ లింగమన్న తరహాలో ఏదీ లేకపోయినా అన్నీ మేమే చేసామని చెప్పుకున్న కార్యక్రమాన్ని చేస్తున్నారు. మహిళలు, రైతులు, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు.? రోగులు ఆరోగ్యశ్రీ లేక ఎలా ఇబ్బంది పడుతున్నారు?, రూ.5600 కోట్లు బకాయిలతో ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్ధులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు నిరాకరించడంతో పరీక్షలు రాయడానకి ఎలా ఇబ్బంది పడుతున్నారు? దీనికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటన్నవి కనిపించడం లేదు. మరోవైపు రూ.4500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేదు. రైతులకు మద్ధతు ధరలు లేవు. వారికి కనీసం యూరియా కూడా సమయానికి ఇవ్వలేని స్ధితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏం ఘనత సాధించిందని చెప్పుకుంటారు. ఇంత అధ్వాన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు కనపిస్తుంటే.. మీరు మాత్రం అంతర్జాతీయ వేదికలమీద మీ డప్పు మీరు కొట్టుకుంటూ, తిరిగి ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ మీద విమర్శలు చేయడానికి ఆ వేదికలను ఉపయోగించుకోవాడనికి మీకు సిగ్గనిపించడం లేదా?
● అత్యంత అమానవీయంగా సంక్రాంతి రికార్డింగ్ డ్యాన్సులు...
నిన్న స్విట్జర్లాండ్ జ్యురిక్ లో తెలుగు డయోస్పోరాలో చెప్పుకోవడానికి మీరు చేసిన గొప్ప పనులేం ఉన్నాయి. సంక్రాంతి పండగకి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించామని చెబుతారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని చెప్పుకుంటారా? కొద్ది రోజుల క్రితం మహిళల వస్త్రధారణ మీద కొంతమంది వ్యక్తులు కామెంట్ చేస్తే దానిమీద దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అలాంటిది నిన్నటి సంక్రాంతి పండగలో ఎప్పుడో దాదాపు 3 దశాబ్దాల క్రితం జరిగినట్లు... ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను కించపరిచే విధంగా రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలపట్ల, వారి పై చేసిన వ్యాఖ్యలపై మేధావులు, మీడియా ఎవ్వరూ స్పందించలేదు. ఈ తరహా కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వానికున్న బ్రాండ్ ఇమేజ్ ఏంటి? దీన్ని ఏ రకంగా సమర్ధించుకుంటారో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. వీటికి తోడు కష్టం వస్తే చంద్రబాబు కనిస్తాడని చెబుతున్న ఆయన కుమారుడు చెబుతున్నాడు. అచ్చు తప్పు ఏమిటంటే... చంద్రబాబు వస్తేనే కష్టం వస్తుంది. కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడన్నది శుద్ద తప్పు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. కూటమ పాలన మొదలై రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజల తరపున వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఇంకా మూడేళ్ల కాలం మాత్రమే మీకు మిగిలి ఉంది. 2029లో మరలా 2019 ఫలితాలు రావడం ఖాయం. ప్రజలు మీ మీద తిరుగుబాటు చేయడం కూడా ఖాయం. ఇన్ని అరాచకాలు చేస్తున్న మీరు మరలా వైయస్.జగన్ కుటుంబసభ్యులు గురించి, ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించడం దారుణం.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు చనిపోయి 30 ఏళ్లైంది. గతంలో ఎన్టీయే కూటమిలో చంద్రబాబే చక్రం తిప్పాడని చెప్పారు. గడిచిన రెండేళ్లుగా ఆయనే చక్రం తిప్పుతున్నాడని చెబుతున్నారు. కానీ ఎన్టీయార్ చనిపోయి 30 ఏళ్లు గడుస్తున్నా.. మీరు ప్రతిఏటా నిర్వహించుకునే మహానాడులో ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడమే తప్ప... ఎందుకు ఆ అవార్డు ఇప్పించుకోలేకపోయారు. కనీసం ఏపీలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న ఆలోచన కూడా మీకు రాలేదు కానీ మీరు కుటుంబ విలువల గురించి మాట్లాడతారు. మీరు గత కొద్ది కాలంలో నారావారిపల్లె వెళ్తున్నారు. ఈ ఏడాది మీ మేనత్త గారెని వేదిక మీద కూర్చోబెట్టారే తప్ప... మీ జూబ్లిహిల్స్ ప్యాలెస్ లో మీ మేనత్తకు పిడికెడు అన్నం పెట్టావా లోకేష్? మీ చిన్నాన్నను గొలుసులతో కట్టివేస్తే.. .వారి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? లోకేష్. అలాంటిది గురవింద గుంజ తరహాలో మీరు కూడా కుటుంబ విలువలు గురించి మాట్లాడుతున్నారు. మీకు బ్రెయిన్ వెయిట్ తక్కువ, బ్యాక్ వెయిట్ ఎక్కువ. రాసి ఇచ్చింది చదవుతూ... రెడ్ బుక్, రికార్డింగ్ డ్యాన్స్ ల గురించి చెబుతున్నావు.
గతంలో మా ప్రభుత్వ హయాంలో దావోస్ వెళ్లి ఎవరితో ఒప్పందం చేసుకున్నామో.. అలాంటి గ్రీన్ కో కంపెనీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మీరు కొత్తగా తీసుకువచ్చిన కొత్త సంస్థ, కొత్త పెట్టుబడి ఈ రెండేళ్లలో వస్తే అది చెప్పండి. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు కస్తోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం... అత్త సొమ్మ అల్లుడు దానం చేసినట్లు కట్టబెడుతోంది. వారి సొంత భూముల్లా నచ్చిన ధరలకు, ఉచితంగా భూమిలిస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్దలు కాకుండా కొత్తగా తీసుకొచ్చిన సంస్థలు లేవు. రాష్ట్రంలో వైయస్.జగన్ హయాంలో నిర్మించిన పోర్టులు, కొత్తగా ప్రారంభం అవుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మనకున్న కనెనక్టివిటీ, వనరులు గురించి అక్కడ మాట్లాడి.. రాష్ట్రానికి వారిని రాబట్టే కార్యక్రమం చేయాలి తప్ప... అక్కడికి వెళ్లి సిగ్గులేకుండా రాజకీయాలు మాట్లాడ్డం ఏంటి? సీఎం సహా అధికారులు, మంత్రుల బృందం దావోస్ వెళ్లడానికి ఏడాదికి ఒక్కసారి ఖర్చు రూ.20- రూ.25 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా పెట్టి.. వెళ్లి తండ్రీకొడుకులు అక్కడ తమ డప్పు కొట్టుకుంటున్నారు.
వెనిజులాకు చెందిన మచాడోకు నోబుల్ శాంతి బహుమతి వస్తే.. దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇచ్చారు. ప్రపంచంలో అస్ధిరతకు కారణమైన డోనాల్డ్ ట్రంప్ మచాడో నుంచి నోబుల్ బహుమతి అందుకున్నారు. అయితే నోబుల్ అవార్డుల కమిటీ దీనిపై మాట్లాడుతూ... ఈ అవార్డు బదలాయింపు చేయడానికి అవకాశం లేదని చెప్పింది. అంటే క్రెడిట్ చోరీ చేయడానికి వీల్లేదని దాని అర్ధం. అమెరికాకు ట్రంప్ తరహాలో ఏపీకి ఈ తండ్రీ కొడుకులు రెండు పంపుల్లా తయారయ్యారు. వీరు ఒకరికి ఒకరు పంపుకొడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. మా కన్నా గొప్ప విజనరీ లేడని చెప్పుకుంటున్నారు. ఈ జనరేషన్ లో చాలా మందికి తెలిసిన గొప్ప నటుడు చిరంజీవి కూడా తాను గొప్ప నటుడునని చెప్పుకోలేదు. అలాగే దివంగత ఎన్టీఆర్ కూడా తాను గొప్ప నటుడునని చెప్పుకోలేదు. క్రీడల్లో సచిన్ టెండూల్కర్ తానే గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పుకోలేదు. కానీ మన ఖర్మ ఏమిటంటే... నేను విజనరీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయన్ను అయనే పొగుడుకోవడం చాలా విచిత్రం. మన గురించి పక్కవాళ్లు చెప్పాలి, లేదా ప్రజలు చెప్పాలి, మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పులు చెప్పుకోవడం, విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం దౌర్భాగ్యం.
● నా పై ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి...
నా మీద కూడా వ్యక్తిగతంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐటీతో పాటు ఐదుశాఖల మంత్రిగా నేను పనిచేశాను. మా ప్రభుత్వ హయాంలో 2022 మే నెలలో వైయస్.జగన్ అధ్యక్షతన దావోస్ పర్యటనకు వెళ్లాం. మరలా 2023 జనవరిలో దావోస్ కి ఆహ్వానం వస్తే ఆరు నెలలు ముందే వెళ్లాం.. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్టు కాదు. వచ్చే ఏడాది చూద్దామని సీఎం వైయస్.జగన్ చెబితే దానిపైనా తప్పుడు ప్రచారం చేశారు. అసలు మాకు ఆహ్వానమే రాలేదని లోకేష్ తో పాటు ఆయన బృందం తప్పుడు ప్రచారం చేసింది. చంద్రబాబు మార్కెటింగ్ పిచ్చి గురించి మాట్లాడితే.. మేం దావోస్ లో చలి ఉంటుంది కాబట్టి వెళ్లలేదన్నట్టు.. ప్రచారం చేశారు. ఇదే లోకేష్ జ్యూరిక్ ప్రపంచ వేదిక సాక్షిగా నా మీద చేసిన ఆరోపణలు నిరూపించే శక్తి ఉంటే, నేను మాట్లాడినట్లు విజువల్స్ చూపిస్తే.. రాజకీయాల్లో అదే ఆఖరి రోజు అవుతుంది. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్తావా? ముఖ్యమంత్రిగా కొడుకుగా ఫేక్ వార్తలను ప్రచారం చేసి, రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా గుడివాడ అమర్నాద్ ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర అవరాలు, ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం తమకు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలు తెలుసుకున్నారని... రానున్న కాలంలో వీటన్నింటికీ కూడా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తేల్చి ఆయన చెప్పారు.
● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తమకు కావాల్సిన ఆంధ్రజ్యోతిలాంటి సంస్థలకు, భూ కేటాయింపు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు భూమి కేటాయించారు. ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇస్తాను సారంగా భూమి కేటాయించారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుపై చర్యలు ఉంటాయి. నిబంధన ప్రకారం భూ కేటాయింపు జరపమని కోర్టు చెబితే ఇష్టానుసారంగా భూమి కేటాయించారు. ఆంధ్రజ్యోతి మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ భూములను ఇవ్వండి. ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ గా ఉండాలే తప్ప... ఇష్టానుసారంగా భూ కేటాయింపులు జరుపుతామంటే కుదరదు. ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాల్లా పంచారని ఆక్షేపించారు.