మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో అయినవారికి అడ్డగోలు భూకేటాయింపులు చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో భూదోపిడీకి సిద్ధమైందని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మంత్రి లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ రూ.5వేల కోట్ల విలువైన భూమిని ఆక్రమిస్తే.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టాల్సింది పోయి.. రెగ్యులరైజ్ చేయాలన్న నిర్ణయం ప్రభుత్వ బరితెగింపుకు ప్రత్యక్షనిదర్శనమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి రాచరిక పోకడలు సరికాదని.. ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్స్ గా ఉండాల్సిన వారే కాటేసే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రెండేళ్లుగా అక్రమ కేటాయింపులతో కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ భూమి హారతి కర్పూరంలా కరిగిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకునేంత వరకు వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ పోరాటం తధ్యమని అమర్ స్పష్టం చేశారు. 18 నెలల పాలనలో రూ.3 లక్షల కోట్లు అప్పు ప్రజల నెత్తిన పెట్టిన ప్రభుత్వం.. తమ వారికి మాత్రం రూ. 30 వేల కోట్ల భూసంతర్పణ చేసిందని తేల్చి చెప్పారు. దావోస్ పర్యటనకు రూ.25 కోట్లు ప్రజా ధనం వృధా చేసిన చంద్రబాబు.. పెట్టుబడులేవీ లేకుండానే వట్టి చేతులతో తిరిగొస్తే.. అనుకూల మీడియాలో మాత్రం దావోస్ మ్యాన్ అంటూ డబ్బా కొట్టుకోవడాన్ని తప్పు పట్టారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలోనూ సీఎం చంద్రబాబు అభాసుపాలయ్యారని అమర్నాధ్ స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదన్న దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ తో బాబు నీచ రాజకీయం బట్టబయలైందన్నారు. మరోవైపు
అన్నవరం ప్రసాదం కౌంటర్లో స్వైరవిహారం చేస్తున్న ఎలుకలు... నిర్వహణ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని తేల్చి చెప్పారు. చివరకు ప్రసాదం పవిత్రను కూడా కూటమి ప్రభుత్వం నీరుగార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..
● విశాఖలో అడ్డగోలు భూదోపిడీ..
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. దాదాపు రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలోని భూములను అధికార పార్టీ బినామీ కంపెనీలకు, వారికి సంబంధించిన సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. ఒకటి రెండు పెద్ద కంపెనీలను ముందు పెట్టి.. ఆ క్రమంలో తమకు కావాల్సిన వారికి అడ్డగోలుగా భూసంతర్పణ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు విశాఖపట్నంలోనే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములుకన్నా వైజాగ్ అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్న నగరం. వాస్తవానికి ఒకవైపు తూర్పు కనుములు, మరోవైపు సముద్రం, ఇంకోవైపు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన దాదాపు 11వేల ఎకరాలు భూమి పోగా.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి భూములు విశాఖలో చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ వద్ద 26వేల ఎకరాలు, నేవీతో పాటు వివిధ రక్షణ రంగ సంస్దలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న భూమిపోగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి తక్కువే అయినా అత్యంత విలువైనది. ఆ భూమిని కాపాడి, కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం.. ఆ పనిచేయకుండా వారికి కావాల్సిన మనుషులకు గడిచిన రెండేళ్లుగా అప్పనంగా కట్టబెడుతూనే ఉంది.
గతంలో ఉర్సా అనే కంపెనీకి ఏకంగా 57 ఎకరాలు కట్టబెట్టారు. బినామీ పేరుతో పెట్టిన ఈ సంస్థకు దాదాపు రూ.2వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే.. వైయస్ఆర్‌సీపీ , ప్రజాసంఘాలు, మేధావులు ప్రశ్నిస్తే దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పక్క రాష్ట్రాల్లో వేలం పాటలో ప్రభుత్వ భూములు కొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏపీలో అది కూడా విశాఖలో మాత్రం అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ఎకరా రూ.50 కోట్లు ఖరీదు చేసే భూమిని కేవలం రూ.50 లక్షలకు, రూ.25 కోట్లు ఖరీదు చేసే భూమిని రూ.25 లక్షలకు, రూ.40 కోట్లు ఖరీదు చేసే భూమిని కేవలం రూ.1 కే కపిల్, సత్వా అనే సంస్థలకు గత రెండేల్లుగా కేటాయిస్తూ వస్తున్నారు.
ఈ ప్రభుత్వ అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రశ్నిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు తనయడు, మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎకరా భూమి కాదు మొత్తం ఇచ్చేస్తామని చెబుతున్నాడు. వైజాగ్ లో ప్రభుత్వ భూమి మీ తాత ఆస్తో, జాగీరో కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సంతర్పణ పతాకస్దాయికి చేరింది. ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ తోడల్లుడు, స్థానిక ఎంపీ, విశాఖలో ప్రభుత్వ భూములు కాపాడాల్సిన వ్యక్తి అయిన భరత్ కు కొత్తగా రుషికొండలో వారికి సంబంధించిన గీతం సంస్థ ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 30న జరుగుతున్న విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి ఆమోదించడానికి సిద్ధమయ్యారు.
● విశాఖ భూదోపిడీపై వైయస్ఆర్‌సీపీ పోరాటం..
వాస్తవానికి 2014-19 మధ్యలోనే విశాఖపట్నం నగర పరిధిలో ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్న దోపిడీదారులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే దోపిడీకి గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా 2019-20లో వైయస్.జగన్ హయాంలో ఇదే గీతం సంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే దానిపై గగ్గోలు పెట్టారు. వాస్తవానికి అప్పటికే గీతం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భవనాలు సైతం నిర్మించారు. కొన్ని ఖాళీ భూములు కూడా ఉన్నాయి. ఇవాళ ఆ భూములనే ప్రభుత్వం తిరిగి వారికి రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది.
నిజానికి ఈ ప్రభుత్వ భూమి మూడు నాలుగు దశాబ్దాలుగా మా ఆధీనంలో ఉందని చెప్పినప్పుడే.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద గీతం యాజమాన్యంపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందనేది మా పార్టీ డిమాండ్. కేవలం 50 గజాల ప్రభుత్వ భూమిలో పేదవాడి పాక నిర్మించుకుంటేనే ఉపేక్షించని ప్రభుత్వం... ఏకంగా రూ.5వేల కోట్ల విలువు చేసే 54 ఎకరాల భూమిని టీడీపీ ఎంపీకి చెందిన సంస్థ ఆధీనంలో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఎలా ముందుకు వస్తున్నారు? ఇవేమైనా మీ కుటుంబ ఆస్తి అనుకుంటున్నారా? ప్రభుత్వ ఆస్తులు మా కుటుంబ ఆస్తులనుకుని మీకు నచ్చినట్లు చేసుకోవాలనే బరితెగింపు ఏంటి?
రూ.5వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ఎంపీకి చెందిన సంస్ధ అన్యాక్రాంతం చేసుకుంటే.. దాన్ని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిద్దామా? అంగీరిద్దామా? విశాఖపట్నం, ఉత్తరాంధ్రాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సమాధానం చెప్పాలని కోరుతున్నాం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వైయస్.జగన్ నాయకత్వంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి పోరాటం చేస్తుంది. ఎన్ని రకాలుగా మమ్నల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా.. చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని మమ్నల్ని అక్రమ అరెస్టులు, కేసులు పేరుతో ఎంత వేధిస్తున్నా ప్రజల ఆస్తులను కాపాడ్డానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. లులూ సంస్థకు రూ.1500 కోట్ల విలువైన భూములను ఆర్కేబీచ్ సమీపంలో ధారాదత్తం చేశారు. ఉర్సా అనే ఊరూ పేరు లేని కంపెనీకి
50 ఎకరాలు ఎండాడ, మధురవాడలో ధారాదత్తం చేసే ప్రయత్నం చేశారు.
రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే... గగ్గోలు పెట్టి దాన్ని ప్రపంచ సమస్యలా చూపించిన ముఖ్యమంత్రి, మంత్రులు అదే రుషికొండ ప్రభుత్వ భవనాలకు ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు సంస్థ రూ.5వేల కోట్ల విలువ చేసే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మీరు నీతిపరులా? మీరు మంచివారా? మీరా విజనరీ? ప్రజలకు మీకు జేజేలు కొట్టాలా? ప్రభుత్వ భవనాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన వైయస్.జగన్ ను నోటికొచ్చినట్లు విమర్శిస్తారా? విశాఖలో విజ్ఞులైన మేధావులు, రాజకీయపార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ భూ కబ్జాను సమర్ధిస్తారా? వైయస్ఆర్‌సీపీ తరపున కౌన్సిల్ సమావేశంలో రెగ్యులరైజ్ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. దీనిపై మా పార్టీ తరపున పోరాటం చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందిస్తాం.
● ప్రజల నెత్తిన లక్షల కోట్ల అప్పులు - అయిన వారికి వేల కోట్ల భూదోపిడీ
ఒకవైపు 20 నెలల్లో రూ.3 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. మరోవైపు తమకు కావాల్సిన సంస్థలకు దాదాపు రూ.30వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా ధారాదత్తం చేసింది. ఎవరి జాగీరని ఈ రకంగా కేటాయిస్తున్నారు. ప్రశ్నిస్తే వారిని భయపెట్టి, బెదిరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో అప్పులు, విదేశాల్లో గొప్పలు చెప్పుకోవడం వీరికి అలవాటుగా మారింది. రూపాయి పెట్టుబడి లేదు. పబ్లిసిటీ మాత్రం ఫీక్ లో ఉంటుంది. 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ 15 దఫాలు దావోస్ వెళ్లిన చంద్రబాబు తెచ్చిన కంపెనీలు, పెట్టుబడులు శూన్యం. కోట్లాది రూపాయల ప్రయాణ ఖర్చులు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వం తరపున అధికారికంగా నాలుగైదు మీడియా సంస్థలకు ఫండింగ్ ఇచ్చి... ప్రచారం చేసుకోవడం అక్కడ కూడా అభాసుపాలవడం వీరికి అలవాటుగా మారింది. స్దానిక మీడియా సంస్దలకు సాయంత్రం ఆరైతే చాలు... వీరి భజన మొదలవుతుంది. హీమ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ తరహాలో ఉండే కాల్పినిక వ్యక్తుల్లా చంద్రబాబుకి దావోస్ మ్యాన్ అనే పేరు తగిలించారు. ఈ దావోస్ మ్యాన్ కేరెక్టర్ లక్షణం ఏమిటంటే ప్రతి ఏడాది రూ.25 కోట్లు ఖర్చుపెట్టి దావోస్ వెళ్తాడు, పుల్ గా ప్రచారం చేసుకుని.. రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం వట్టి చేతులు ఊపుకుంటూ వస్తాడనేది ఈ దావోస్ మ్యాన్ లక్షణం.
● లడ్డూ వ్యవహారంలో అభాసు పాలైన చంద్రబాబు..
తన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చివరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకుని ఏ రకంగా అభాసుపాలయ్యారో చూశాం. దర్యాప్తు సంస్ధ ఛార్జ్ షీట్ లో లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదని, వైయస్ఆర్‌సీపీ నేతల ప్రమేయం కూడా లేదని తేల్చారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా వదలని పరిస్థితి. తన నీచరాజకీయాలకు చంద్రబాబు ఏ స్దాయికి దిగాజారిపోయాడన్నదానికి ఇదొక ఉదాహరణ. హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద వారికి మాత్రమే ప్రేమ, గౌరవం ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు అన్నవరంలో తాజాగా జరిగిన ఉదంతం చూస్తే... స్వామివారి ప్రసాదం మీద ఎలుకలు ఎలా తిరుగుతున్నాయో చూస్తే... దేవుడి ప్రసాదం యొక్క పవిత్రతను ఎలా నీరుగార్చారో అర్ధం అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి అనేక ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పలాసలో దారుణం జరిగి భక్తులు చనిపోతే అది ప్రైవేటు సంస్థ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి అన్నవరం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవస్థానం కదా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు. లేని ప్రేమను నటిస్తూ.. హిందూ ధర్మం మీద మీకు మాత్రమే గౌరవం ఉన్నట్టు మీరు నటించే ప్రయత్నం చేస్తే అది మీకు చుట్టుకోవడం ఖాయం. తిరుమల లడ్డూలో మీకు అదే జరిగింది. చివరికి దావోస్ లో సైతం వైయస్.జగన్ హయాంలో చేసిన భూసర్వే మీద ప్రతినిధులు ప్రశంసలు జల్లు కురిపించిన వైనంతో మన రాష్ట్రం గౌరవం నిలబడింది. మిగిలిన అన్న విషయాల్లో మీరు అభాసు పాలయ్యారు. భూ సర్వేతోపాటు అనేక అభివృద్ధి విషయాల్లో వైయస్.జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ ప్రభుత్వం ఏ విషయంలోనూ పేదలకు, విద్యార్ధులకు, ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు. మీరు చేస్తుందల్లా భూములను అడ్డగోలుగా మీకు కావాల్సిన వారికి కట్టబెట్టడమే. అది ఏ స్థాయికి చేరుకుందంటే... ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ తోడల్లుడు, స్థానిక ఎంపీకి చెందిన గీతం సంస్థ ఏకంగా 54 ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం అత్యంత దారుణం. ఈ ఒక్క ఉదంతంతోనే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందో, వారి కుటుంబం కోసం ఉందా? టీడీపీ, కూటమి పార్టీ నాయకుల కోసం పనిచేస్తుందా? అన్నది ఆలోచన చేయాలని అమర్నాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...
కూటమి ప్రభుత్వం చెబుతున్న హైందవ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే ఆ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శారదాపీఠం విజ్ఞప్తి మేరకు భూమి కేటాయిస్తే.. కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. గీతం విద్యాసంస్థల భూమి కబ్జాను, ప్రభుత్వం భూమి కేటాయింపులను ఒకే రకంగా ఏ విధంగా చూస్తారు. సమాజహితం కోసే చేసే కేటాయింపులు.. సంపాదన కోసం అవినీతి, అక్రమాలు వేరు, అలాంటి కేటాయింపులు వేరు. ఈ ప్రభుత్వం కేవలం కిక్ బ్యాగులు, అవినీతి సంపాదన కోసమే రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా భూ కేటాయింపులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.