ప్రతీ పేదవాడు ఆనందంగా ఉండాలంటే మళ్లీ వైయస్ జగన్ సీఎం కావాలి
అనకాపల్లి: ప్రతీ పేదవాడు ఆనందంగా ఉండాలంటే మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో మారేడుపూడి నుంచి సామాజిక సాధకార బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైెయస్ఆర్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయయాత్రగా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం మారేడుపూడి వద్ద ప్రజలు మంగళ హారతులు, హర్షధ్వానాల మధ్య బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బస్సుయాత్ర ద్వారా చేరుకున్న నేతలు పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం భారీ ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్నదొర, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, వైయస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నియోజకవర్గం నలు మూలలు నుంచి భారీగా తరలివచ్చిన జనంతో ఎన్టీఆర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతలంతా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.నేతలు ఏమన్నారంటే...
ప్రతీ పేదవాడు ఆనందంగా ఉండాలంటే మళ్లీ వైయస్ జగన్ సీఎం కావాలి - డిప్యూటీ సీఎం బూడి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి అణగారిన వర్గాలకు జగన్ అధికారం కల్పించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సాధికారతకు ప్రాధాాన్యతను ఇచ్చారని గుర్తు చేసారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు దోపిడీలు చేసి ప్రజలను మోసం చేసాడని, అందుకే చివరకు జైల్లో చిప్పకూడు తిన్నాడని విమర్శించారు. టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపిస్తుంటారని, వచ్చే జనవరి నుంచి జగన్ పెన్షన్ రూ. 3 వేలు ఇవ్వనున్న నేపథ్యంలో ఇకపై తెలుగుదేశం నేతలకు మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. మహిళలకు డ్వాక్రా రుణాల విషయంలో చంద్రబాబు మోసం చేసారని, జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మాఫీ చేయగా, త్వరలోనే మరో విడత మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారన్నారు. నాడు- నేడు ద్వారా విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో ఇంగ్లీషు మీడియంలో కూడా పాఠాలు చెప్పిస్తూ, తల్లితండ్రులకు భారం కాకూడదని అమ్మఒడి పథకం ద్వారా నిధులు కూడా వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ పేద వాడు ఆనందంగా ఉండాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రూ. 4 లక్షల 5వేల కోట్లలతో 12 కోట్ల 66 లక్షలమందికి (ఒకే వ్యక్తికి పలు పధకాల ద్వారా లెక్కించగా) సంక్షేమ లబ్ధి - ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో, సంక్షేమంలో సమూలమార్పులు తీసుకురాగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏమి చేసాడో ప్రజలు ఆలోచన చేసి గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రూ. 4 లక్షల 5వేల కోట్లరూపాయలను 12 కోట్ల 66 లక్షల మంది బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని వెల్లడించారు. కులాలకు,మతాలకు,రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తూ సంక్షేమ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారన్నారు. గిరిజనుల కోసం సీఎం జగన్ రూ. 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారన్నారు. అణగారిన వర్గాలకు ఎల్లవేళలా మంచి జరగాలంటే మళ్లీ మళ్లీ జగన్ సీఎం కావాలని రాజన్నదొర పిలుపునిచ్చారు. అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తూ సామాజిక సంక్షేమం సాగిస్తున్నారని వివరించారు.
రెండోసారి వైయస్ జగన్ ను సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది - మంత్రి అమర్ నాథ్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో హామీలన్నింటినీ అమలు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి జగన్ కృషి చేసారన్నారు. రూ. 830 కోట్లు అనకాపల్లి ప్రజల సంక్షేమానికి జగన్ ఖర్చు చేసారన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను తన పాలన ద్వారా సాకారం చేసిన ఘనత సీఎం జగన్ ది మాత్రమేనని గుడివాడ అమర్ నాథ్ గుర్తు చేసారు.
వైయస్ఆర్‌సీపీకి మహిళల ఆదరణ వెనుక జగన్ ఆలోచన విధానం ఉంది - మంత్రి ధర్మాన
రాష్ట్రరెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల వైయస్సార్ సీపీ ప్రభుత్వ పాలనను మహిళలు అపురూపంగా ఆదరించడం వెనుక జగన్ ఆలోచనా విధానం ఉందని వివరించారు. దేశంలో సీనియర్ పొలిటిషీయన్ గా చెప్పుకునే చంద్రబాబు చాలా ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతూ వంచనకు గురి చేస్తున్న అంశాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి 12,800 కోట్లరూపాయలతో భూమి కొనుగోలు చేసి సొంతింటి కలను వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని, గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేసారా అని ధర్మాన ప్రశ్నించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తేనే విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, పేదలకు సొంతిల్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఈ పనులు ఎప్పుడైనా చేసారా అన్న ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో భోగాపురం ఎయిర్ పోర్టు, పోర్టులు, విద్యుత్ ప్రజెక్టులతో పాటు అనేక పరిశ్రమలు నెలకొల్పుతుండటం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అత్యుత్తమమైనవని వివరించారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన జగన్ గెలిపిస్తారా.. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే మళ్లీ ఓసారి అధికారంలోకి వస్తే చేస్తానని చెబుతున్న చంద్రబాబును నమ్ముతారా అని ధర్మాన ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు మొట్టమొదటిసారిగా అధికారం ఇచ్చి జగన్ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు.
అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ప్రతీ పౌరునికి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేసారు. కరోనా వంటి విపత్కర సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు విలవిలలాడగా, సీెఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలకు జగన్ ఆరోగ్యసేవలు, సంక్షేమం అందించారన్నారు. ఈరోజు ప్రజలంతా క్షేమంగా ఉన్నారంటే ఆరోజు జగన్ ప్రజల పట్ల చూపిన సంరక్షణ, సంక్షేమమే కారణమని వివరించారు. సామాజిక సాధికారత అంటే ఏంటో తన పాలనలో చేతల్లో చూపిన సీఎం వైయస్ జగన్ అని సత్యవతి వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో వై ఏపీ నీడ్స్ జగన్, వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి లక్ష్యాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.