ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం

9 Nov, 2020 14:05 IST

 కర్నూలు: అబ్దుల్ సలామ్‌ ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంద‌ని, వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతంది అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా వెల్లడించారు. నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌ సలామ్‌ కుటుంబ సభ్యులను సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ సలామ్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.  కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది.