అంబేడ్కర్ దార్శనికత స్ఫూర్తిగా ప్రభుత్వం
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దార్శనికత స్ఫూర్తిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళలర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించిన వైయస్సార్‌సీపీ నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు.
వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ నిజ జీవితంలో చోటు చేసుకున్న యదార్థ ఘటనలను సేకరించి వరప్రసాద్ ప్రచురించిన పుస్తకాన్ని కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.∙
– ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా నాయకుడు. ఆయన దేశానికి ఒక దిశా నిర్దేశం చేశారు. వారు మన జాతి, దేశంతో పాటు, ప్రపంచానికి కూడా మార్గదర్శం చేశారు. అవి ఎప్పటికీ స్మరణీయం. సమసమాజం గమ్యంగా జాతిని నడిపించడానికి ఆయన అవిరళ కృషి చేశారు. నాడు అంబేడ్కర్ ఆశించిన సమ సమాజం, ఆ తర్వాత తరం వారికి ప్రసంగాలకే పరిమితం అయింది. ఇక్కడ సీఎం శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం, తొలిసారి అంబేడ్కర్ ఆలోచన విధానం, ఆయన దార్శనికత స్ఫూర్తిగా పని చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సీఎం వాటిని అమలు చేస్తున్నారు. ఆ దిశలో ఈ 20 నెలల్లోనే ఆయన సఫలీకృతులయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో జరగనిది ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సీఎం శ్రీ వైయస్ జగన్ చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది. మహిళల సాధికారత, రాజకీయంగా దళితులకు తగిన ప్రాతినిథ్యం కల్పించడం, కుల మతాలకు అతీతంగా పేదల అభివృద్ధి కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దీన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో సంకుచిత రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములు కావాలి’.
నందిగం సురేష్. ఎంపీ:
– ‘ఎస్సీలు తన బంధువులు అని చెప్పుకునే సీఎం శ్రీ వైయస్ జగన్, వారందరి సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. అందుకే కేవలం సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను, ఏకంగా ఎంపీని చేశారు. సీఎం శ్రీ వైయస్ జగన్‌కు దళితులు ఎల్లవేళలా అండగా ఉంటారు’.
మేరుగ నాగార్జున. ఎమ్మెల్యే:
– ‘అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని సీఎం శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. అందుకే అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా, వారిని అభివృద్ధి పర్చే విధంగా వివిధ పథకాలు, కార్యక్రమాలను ఆయన అమలు చేస్తున్నారు. చాలా పార్టీలకు దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు. కానీ మా పార్టీ అధినేత, సీఎం శ్రీ వైయస్ జగన్ నిరంతరం అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు’.