రాష్ట్రం తిరోగమనం దిశగా అడుగులు
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...
గత వైయస్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.
కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్‌పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైయస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.
వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులు
లేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్‌కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్‌లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్‌లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్‌ను వరల్డ్ ఫస్ట్‌క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.
ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్‌టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్‌ను అడ్డం పెట్టుకుని జిందాల్‌ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్‌లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్‌పై కోపంతో, మరోసారి వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.
కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలు
మరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్‌పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్‌నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్‌నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?
గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.
శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్‌రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్‌పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.
అసమర్థ పాలనతో ప్రగతి శూన్యం
చంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.
అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.
హామీల అమలులో పూర్తి వైఫల్యం
చంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.
చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.