ఏలూరులో సాధారణ పరిస్థితి
పశ్చిమగోదావరి: అస్వస్థతతో ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు. డిశ్చార్జ్ అయిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. మెడికల్ టీమ్‌లు బాధితుల ఇంటికెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయని వివరించారు. అనారోగ్యానికి గురై డిశ్చార్జ్ అయిన బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఏలూరులో మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. డిశ్చార్జ్ అయిన వారికి పౌష్టికాహారం, మెడిసిన్ అందిస్తున్నామని, 650 కుటుంబాలకు 5 కేసుల బియ్యం, కందిపప్పు, వంట నూనె, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. మూడు రోజుల్లో తుది నివేదిక వస్తుందని, తుది నివేదిక బట్టి అస్వస్థతకు కారణాలు తెలుస్తాయని చెప్పారు.