శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం  విడుదల చేయాలి

23 Feb, 2026 11:55 IST

అమరావతి: శుక్రవారం నాటి  శాసనమండలి సమావేశాల ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ఛాంబర్ ముందు సోమ‌వారం ధర్నాకు దిగారు. శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను టీడీపీ నేతలు ఎడిటింగ్ చేసి విడుదల చేశారని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అసలు పూర్తి ఫుటేజ్‌ను విడుదల చేసి నిజానిజాలు బయటపెట్టాలని ఆయన కోరారు.

రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మొత్తం ఫుటేజ్ ఇవ్వాల్సిందే. ఎడిటెడ్ వీడియో బయటకు ఎలా వచ్చింది? దానికి బాధ్యులు ఎవరు?” అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. పూర్తి ఫుటేజ్ విడుదలయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చైర్మన్ ఛాంబర్‌లోనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలి వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని, ఎడిటింగ్ వీడియోలతో ప్రజలను తప్పుదారి పట్టించకూడదని వారు పేర్కొన్నారు.