“మన మూలపేట పోర్టుకు పోదాం పదండి”
శ్రీకాకుళం: జిల్లాలో మూలపేట పోర్టు అభివృద్ధి అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కీలక నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి , జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయతో పాటు ఆమదాలవలస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు చింత రవికుమార్, పేడాడ తిలక్, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మూలపేట పోర్టు సందర్శనపై చర్చ
సమావేశంలో మూలపేట పోర్టు ప్రస్తుత స్థితిగతులు, పనుల పురోగతి, తదుపరి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధి పనులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.
30న పోర్టు సందర్శన
ఈ నెల 30వ తేదీ (30-04-2026) సోమవారం ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టును వైయస్ఆర్‌సీపీ నాయకులు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో జిల్లాకు ఇంత పెద్ద ప్రయోజనం కలిగించే ప్రాజెక్ట్‌ను ఏ ప్రభుత్వం తీసుకురాలేదని నాయకులు పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.4362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించి, 70 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని, పోర్టు పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్శన కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.