24న ఢిల్లీలో ధర్నా
వినుకొండ: ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీ బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దారుణ హత్యకు గురైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని సహా అందరినీ కలుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామన్నారు.
వైయస్ జగన్ ఏమన్నారంటే..
ఎవరిని అడిగినా చెబుతారు:
రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది ఏ సామాన్యుడిని అడిగినా కూడా, ఆ సామాన్యుడి నోటి నుంచి వచ్చే మాట ఒక్కటే.. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది లేదు అన్నది.
టీడీపీ వారైతే చాలు..:
రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వారు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా సరే, పోయి కొట్టొచ్చు. ఎవరి ఆస్తిని అయినా ధ్వంసం చేయొచ్చు. ఎవరినైనా కూడా హత్య చేయొచ్చు. ఎవరి మీద అయినా హత్యాయత్నం చేయొచ్చు.
నీచమైన సంస్కృతి:
తెలుగుదేశం పార్టీ వారు ఏం చేసినా కూడా, పట్టించుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తారు. అటు వైపు నుంచి ఇంకా ఎవరైనా కేసు పెడితే.. పోలీసులు దొంగ కేసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేలుతోంది.
ఇదేనా మీ పాలన?:
చంద్రబాబునాయుడుగారిని ఒకటే ఒకటి అడుగుతున్నాను. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఇంకా తెలుగుదేశ«ం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరపడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల తరవాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇది.
ఈ హత్య ఒక ఉదాహరణ:
ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి, ఈ రషీద్ కేసు ఒక ఉదాహరణగా తీసుకొండి.
ఇదే జిల్లాకు ఇంతకు ముందు రవిశంకర్‌రెడ్డి అనే ఒక మంచి ఆఫీసర్ ఎస్పీగా ఉన్నారు. ఆయన సమర్థుడు. అయితే ఎన్నికల ముందు వీళ్లకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్‌ను తప్పించేశారు. ఆ తరవాత వీళ్లకు కావాల్సిన బిందుమాధవ్ అనే ఆఫీసర్‌ను ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందుమాధవ్ అనే అధికారి ఎంత అన్యాయస్తుడంటే.. చివరకు ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుని ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తరవాత ఎన్నికల సంఘమే.. మల్లికాగర్గ్ అనే అధికారిని జిల్లా ఎస్పీగా నియమించింది. అయితే చంద్రబాబునాయుడుగారు అధికారం చేపట్టగానే, ఆమెను పంపించేశారు. ఆ ఆఫీసర్ తెలుగుదేశం పార్టీ వారికి సహకరించదు లఅని చెప్పి, ఆమెను పంపించేసి, వీళ్లకు సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్ అనే ఆఫీసర్‌ను జిల్లా ఎస్పీగా తెచ్చుకున్నారు.
కొత్త ఎస్పీ వచ్చిన వెంటనే..:
జిల్లాకు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజులకే ఈ హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి? నడిరోడ్డు మీద, ప్రజలందరూ చూస్తుండగా నరికి చంపారు. హతుడు రషీద్ ఒక సామాన్య వ్యక్తి. ఒక వైన్‌షాప్‌లో పని చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తున్నాడు. అలాంటి సామాన్యమైన వ్యక్తిని అందరూ చూస్తుండగానే, నడిరోడ్డు మీద కత్తితో దారుణంగా నరకడం.. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులందరినీ రాష్ట్రమంతా ఇలా కిరాతకంగా నరికి చంపుతాం.. అన్న మెసేజ్ పంపడం..
మీడియా ముసుగులో..:
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. పోలీసు వ్యవస్థ కూడా వీళ్లదే. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పత్రికలు, మీడియా ముసుగులో ఏ స్థాయికి దిగాజారారో ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను.
ఈనాడులో ఓ స్టోరీ. అప్పుడెప్పుడో ఈ జిలానీకి చెందిన మోటార్‌బైక్ కాలిందట. దాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ వాళ్లు కాల్చారట. అందుకే ఈ హత్య జరిగిందన్న ఒక దిక్కుమాలిన కధనం రాశారు. అలా వీరు చేస్తున్న దుష్ప్రచారాలు, చెబుతున్న అబద్ధాలకు వీరంతా సిగ్గుతో తల దించుకోవాలి.
తీరా చూస్తే.. ఇదీ వాస్తవం:
తీరా చూస్తే, ఆ మోటార్‌బైక్ జిలానీకి చెందింది కాదు. ఆసిఫ్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిది. ఆ «ఘటనపై ఆసిఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులపై కేసు కూడా నమోదు చేశారు. మోటార్‌బైక్‌ను తగలబెట్టడమే కాకుండా, ఆసిఫ్ తల కూడా పగలగొట్టారని ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది జనవరి 17న ఆసిఫ్ ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ కూడా రాశారు. అయితే ఆ ఘటన ఎప్పుడో జరిగిందని, దానిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ.. తప్పుడు ప్రచారం కూడా చేశారు. కానీ, ఆ ఘటన జరిగింది ఈ ఏడాది జనవరి 17న.
అసలు జరిగిన ఘటన. ఆసిఫ్ బైక్ కాల్చేశారు. ఆయన ఎవరు అంటే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు. ఆ పని చేసింది ఎవరు అంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు. టీడీపీ మాజీ ఛైర్మన్ ఫమీమ్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయూబ్‌ఖాన్.
వాస్తవాల దారుణ వక్రీకరణ:
ఎంత దారుణంగా వాస్తవాలు వక్రీకరిస్తున్నారంటే.. కొత్తగా ఎస్పీ వస్తాడు. ఆయన వచ్చిన మూడు రోజులకే హత్య జరుగుతుంది. ఘటన జరిగిన గంటకే బయటకు వచ్చిన ఎస్పీ ఏం చెప్పాడంటే.. ఈ హత్యకు కారణం ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలని, అందుకే జిలానీ, రషీద్‌ను చంపాడని ప్రకటించారు.
మరి ఇదేమిటి?:
కేసు పెట్టామని చెబుతున్నారు. మరి నేను అడుగుతున్నాను. కేసు పెట్టినప్పుడు, ఒట్టి జిలానీ మీదనే కేసు పెట్టారు..
(మరి ఇదేమిటి? అంటూ ఒక ఫోటో చూపారు..)
ఇందులో జిలానీ అనే వ్యక్తి, స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తున్నాడు. అంటే వీళ్ల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి, ఇంతకన్నా నిదర్శనం కావాలా?.
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వారు కేక్ కట్ చేయడం. ఆ కేక్‌ను ఈ జిలానీ అనే వ్యక్తి స్వయంగా ఎమ్మెల్యే భార్యకు తినిపించడం.. జిలానీకి టీడీపీ నాయకులతో అంత సత్సంబంధాలు ఉన్నాయి..
(అంటూ ఎమ్మెల్యేతో, ఆయూబ్‌ఖాన్, షమీమ్‌ఖాన్‌తో జిలానీ దిగిన ఫోటోలు చూపారు)
మరి వీళ్లెవరూ కేసులో ఎందుకు లేరు? వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?. ఇంతకన్నా అన్యాయం ఇంకా ఏమైనా ఉంటుందా?.
ఎంపీ నియోజకవర్గంలో తిరగొద్దా?:
నిన్న కూడా మిధున్‌రెడ్డి అంశం మీరంతా చూశారు. సాక్షాత్తూ ఒక సిట్టింగ్ ఎంపీ, తన నియోజకవర్గంలో తిరగకూడదా? పుంగనూరు ఎంపీ నియోజకవర్గంలో ఉంది. తన పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం పుంగనూరు. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ ఎంపీ తండ్రి. ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా?:
అదే పుంగనూరులో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఉంటున్నారు. ఆయన ఇంటికి ఎంపీ మిధున్‌రెడ్డి వెళ్లినప్పుడు, ఆ ఇంటిని దిగ్భంధం చేసి, ఇంటి మీద రాళ్లు వేసి, కార్లు ధ్వంసం చేసి.. చివరకు రెడ్డప్ప కారును ఏకంగా తగలబెట్టి.. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయంటే... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన ఇంత దారుణ పరిస్థితి ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందా?.
దొంగ కేసులు పెడుతున్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించే పరిస్థితి తెచ్చారు. లా అండ్ ఆర్డర్ చివరకు ఏ స్థాయికి పడిపోయిందంటే.. దాని గురించి పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులెవ్వరూ పట్టించుకోవడం లేదు. అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబునాయుడుగారు పట్టించుకోవద్దంటున్నారు కదా, అని చెప్పి వదిలేసిన పరిస్థితులు.
ఆనాడు అన్నీ సవ్యంగా..:
నేను ఒకటే గుర్తు చేస్తున్నా. గతంలో వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వారిని కొట్టండి. చంపండి. వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దు.. అని ఏ రోజు కూడా చెప్పలేదు. అక్కచెల్లెమ్మల చేతిలోని ఫోన్లలో దిశ యాప్ ఉండేది. ఏ ఆపద వచ్చినా ఆ ఫోన్‌ను అయిదుసార్లు ఊపినా లేక యాప్ (ఎస్‌ఓఎస్) బటన్ నొక్కినా, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి.
అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది?. కారణం, చంద్రబాబునాయుడుగారు అనే వ్యక్తి, తప్పుడు మాటలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి, వారికి ఆశలు కల్పించి, ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు.
అదే జగన్ ఉండి ఉంటే..:
- చంద్రబాబునాయుడుగారిని నేను అడుగుతున్నాను. ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. గత 5 సంవత్సరాల పాలన చూడండి.
- ప్రతి మూడు నెలలు గడవగానే.. ఆ త్రైమాసిక విద్యాదీవెన వచ్చి ఉండేది. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చి.. ఆ క్వార్టర్ విద్యాదీవెన పోయింది. అలాగే ఏప్రిల్, మే, జూన్.. ఆ క్వార్టర్‌ది కూడా పోయింది. అంటే, రెండు క్వార్టర్ల విద్యాదీవెన బకాయిలు. జగనే ఉండి ఉంటే, అవి ఇచ్చేవాడు. పిల్లలకు మేలు జరిగి ఉండేది.
- జగనే ఉండి ఉంటే, ప్రతి ఏప్రిల్‌లో వసతిదీవెనకు సంబంధించిన ఒక వాయిదా తల్లి ఖాతాలో పడి ఉండేది.
- జగనే ఉండి ఉంటే, ఈపాటికే రైతు భరోసా కింద తొలి విడత సాయం అంది ఉండేది.
- జగనే ఉండి ఉంటే, అమ్మ ఒడి డబ్బులు ఈపాటికే తల్లులకు వచ్చి ఉండేది. ప్రతి జూన్‌లో అమ్మ ఒడి డబ్బులు తల్లులకు వచ్చి ఉండేవి.
- జగనే ఉండి ఉంటే, ప్రతి ఏప్రిల్‌లో అక్కచెల్లెమ్మలకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు, ఈపాటికే వచ్చి ఉండేవి.
- జగనే ఉండి ఉంటే, మత్య్సకార భరోసా. ప్రతి ఏప్రిల్ నుంచి జూన్ వరకు.. ఇచ్చే ఆ సాయం అంది ఉండేది.
- ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం.. ఇప్పుడు గత ఎన్నికల ముందు చంద్రబాబుగారు చెప్పిన మాటలు నమ్మిన ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తోంది.
చంద్రబాబు ఏమేం హామీలు ఇచ్చారు:
ఎన్నికల ముందు చంద్రబాబుగారు ఏం చెప్పారు?. జగన్ అయితే ఒక్క రూ.15 వేలు మాత్రమే ఇస్తాడు. అదే మేం అధికారంలోకి వస్తే.. రూ.15 వేలు నీకు, రూ.15 వేలు నీకు, రూ.15 వేలు నీకు.. మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారా? అంటే మీకు రూ.60 వేలు వస్తాయి.
మళ్లీ ఆ ఇంట్లో అమ్మను చూపించి, నీకు రూ.18 వేలు ఇస్తాం అన్నారు. ఈ మాటలన్నీ చెప్పారు. ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తోంది. ఇంకా ఎన్నికల ముందు నీవు చెప్పిన మాట ఏమిటి?
18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 ఇస్తాం అన్నావు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో 4.12 కోట్ల మంది ఉన్నారు. అంటే దానర్థం ఏమిటి? వారంతా 18 ఏళ్లకు పైబడిన వారే కదా?
మరి అందులో 2.10 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. అంటే వారంతా 18 ఏళ్లకు పైబడిన వారే కదా?
వారంతా అడుగుతున్నారు:
రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలను పక్కన పెడితే, ఏకంగా 1.80 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు మీరు ఇస్తామని చెప్పిన నెలకు రూ.1500 సాయం గురించి అడుగుతున్నారు.
ఇవాళ ప్రతి పిల్లాడు అడుగుతున్నాడు. జగన్‌మామ ఉన్నప్పుడు అమ్మ ఒడి కింద, మా అమ్మకు రూ.15 వేలు ఇచ్చేవాడు..
నువ్వు తల్లికి వందనం అన్నావు. మా ఇంట్లో నలుగురు పిల్లలం ఉన్నాం. మరి మాకు రూ.60 వేలు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు.
ప్రతి రైతు అడుగుతున్నాడు. ఈ ఏడాది సాగు పనులు మొదలయ్యాయి. వైయస్ జగన్ ఉండి ఉంటే, ఇప్పటికే రైతు భరోసా సొమ్ము వచ్చి ఉండేదని. నీవు రైతుకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానన్నావు. రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఆ సాయం గురించి అడుగుతున్నారు.
ఇవాళ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అడుగుతున్నారు. వారు ఏప్రిల్‌లో సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కట్టాలి. మరి ఆ డబ్బు ఎందుకు కట్టడం లేదని వారు అడుగుతున్నారు.
ఇంకా చదువుకునే పిల్లలు కూడా అడుగుతున్నారు. వారి ఫీజులు మీరు ఇవ్వడం లేదు. వారి కాలేజీ యాజమాన్యాలు అడుగుతున్నాయి. ఫీజు మీరు చెల్లించకపోవడంతో, వారికి కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రెండు త్రైమాసికాలకు సంబంధించిన విద్యాదీవెన ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు.
వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదని తల్లులు అడుగుతున్నారు. మత్స్యకారులు కూడా అడుగుతున్నారు తమ సాయం గురించి.
అందని దృష్టి మళ్లించేందుకే..:
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, వారు ప్రశ్నించే పరిస్థితి రాకుండా ఉండేందుకు, వారిలో భయాందోళనలు సృష్టించే కార్యక్రమంలో భాగంగా, ఈ మాదిరిగా దాడులు చేస్తూ, అన్యాయాలు చేస్తూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.
నిరసన కార్యక్రమాలు:
నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. కచ్చితంగా వీటన్నింటిపై నిరసన చేస్తాము. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రోజున, ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ, ఆయనను నిలదీస్తూ.. మా నిరసన గళం విప్పుతాం.
దాని తరవాత మంగళవారం నాడు, వైయస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్తారు. ఆ మర్నాడు ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తాము. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, ఇక్కడ దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిని దేశమంతా గుర్తించేలా, వారు కూడా మాకు అండగా నిల్చేలా ఆ కార్యక్రమం చేస్తాం.
ఆ అవసరాన్ని వివరిస్తాం:
ఇప్పటికే ప్రధానమంత్రిగారి అపాయింట్‌మెంట్ కోరాం. రాష్ట్రపతి, హోం మంత్రిగారి అపాయింట్‌మెంట్ కూడా కోరుతాం. వారు అపాయింట్‌మెంట్ ఇస్తే.. కలిసి ఇక్కడి దారుణ పరిస్థితి వివరిస్తాం.
అలా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది? అన్న విషయాన్ని గట్టిగా వారి తీసుకువెళ్లడం జరుగుతుంది.
ఇది ధర్మమేనా?:
ఇక ఈ ఘటనకు సంబంధించి, మా ప్రధాన డిమాండ్ ఒకటే. ఆ కుటుంబం ఏం పాపం చేసిందని ఆ పిల్లాడిని దారుణంగా చంపారు. అలా చంపడమే కాకుండా, ఆ పిల్లాడి మీద దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. అతడిని హంతకుడిగా, ఫ్యాక్షన్ లీడర్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ కుటుంబంలోని వారి జీవితాలతో ఆడుకుంటూ, వ్యక్తిత్వ హననం చేయడం ధర్మమేనా?
బాబు క్షమాపణ చెప్పాలి:
పోలీసులు అంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారు? ప్రేక్షకపాత్ర ఎలా పోషిస్తారు?. దీనికి చంద్రబాబునాయుడుగారు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఖండించి, ప్రజలకు క్షమాపణ చెప్పి, ఇక మీదట ఇలాంటివి జరగవు అన్న భరోసా ప్రజలకు ఇవ్వాలి. అలాగే వైయస్ఆర్‌సీపీకి ఓటు వేసిన వారికి కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే, వైయస్సార్‌సీపీకి చెందిన వారు కూడా కొందరు ఓటు వేయడం వల్లనే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
అందుకే ఇవన్నీ..:
మొట్టమొదటగా చంద్రబాబుగారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వారి విధులు సక్రమంగా కొనసాగించేలా అడుగులు వేయాలి. ఇవన్నీ జరిగేలా, ఒత్తిడి తీసుకురావడం కోసమే, ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నాం.