కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరం

24 Dec, 2025 21:57 IST

తాడేపల్లి:  అన్నదాతలను ఆదుకోవడంతో పాటు, కనీస మద్ధతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ఎం వీ యస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీకేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సాగును పూర్తిగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతో పాటు రైతులకు కనీసం బస్తా యూరియా కూడా ఇవ్వలేని సమర్థత లేని ప్రభుత్వమని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ నేతల అండదండలతోనే యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని తేల్చి చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే తిరిగి వైయ‌స్ఆర్‌సీపీనేతలపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మంత్రులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు.. కూటమి పాలనపై అధికార పార్టీ రైతులే విమర్శలు చేస్తున్నారని.. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ అసమర్ధతేనని తేల్చిచెప్పారు. 18 నెలల పాలనలో వరి, అరటి, మొక్కజొన్న, ప్రత్తితో పాటు  ఏ పంటకూ  మద్ధతుధర కల్పించకపోవడంతో...  రైతులు పండిన పంటను పొలాలాల్లోనే వదిలిపెడుతున్న దుస్ధితి నెలకొందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్ధతు ధర కల్పించడంతో పాటు, రైతులకు యూరియా అందించాలని అడిగితే.. రాజకీయం చేస్తున్నామంటూ వక్రభాష్యం చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రనటించడం మానివేసి.. రైతులను ఆదుకోవాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే.. 

  2025 రైతుల పాలిట చీకటి సంవత్సరం.. 

రాష్ట్ర ప్రజలకు, రైతుసోదరులకు, మీడియా మిత్రులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట చీకటి సంవత్సరం. 40 ఏళ్లుగా రైతుల ప్రతినిధిగా ఉన్న నా జీవితంలో వ్యవసాయంలో ఇంతటి సంక్షోభాన్ని మునుపెన్నడూ చూడలేదు. పాలకులు రైతులను మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అనేక మంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వర్గీయ డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా మా ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న భరోసా ఇవ్వగలిగాడు. సీఎంగా ఆయన చేసిన తొలి సంతకమే ఉచిత విద్యుత్ తో పాటు విద్యుత్ బకాయి లు రద్దు ఫైలు మీద చేశారు. భారతదేశంలో ఇది సాధ్యం కాదని ఎంతోమంది విమర్శించిన ఈ పథకమే ఇవాళ దేశంలో 5 రాష్ట్రాల్లో అమలవుతోంది. కానీ ఇవాళ సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమను హార్టికల్చరల్ హబ్ గా చేస్తామని చెబుతున్నాడు. కానీ ఇప్పటికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ఉంది. ఇటీవల చంద్రబాబు వస్తున్నా మీకోసం మీటింగ్ పెట్టిన  పామాయిల్ తోటలు కూడా దివంగత వైయస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ తో పాటు, విద్యుత్ బకాయిలు రద్దు మూలంగా  పెరిగిన హార్టికల్చర్ పంటే.
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ వారసుడుగా ఆయన తనయుడు  వైయస్.జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం రైతులు బాగుండాలని కోరుకునే పార్టీ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా రైతుల సమస్యలనే లేవనెత్తుతోంది. వైయస్.జగన్ తన తండ్రి మరణం తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజీ ఇసుక తిన్నెల్లో
రైతుల కోసం లక్ష్యదీక్ష చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా తిరిగి ఇవాళ ప్రతిపక్షంలో కూడా రైతులు బాగుండాలని తపన పడే ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైయస్.జగన్ నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ రైతుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 

రూ.25 వేల కోట్ల రైతు సంపదను హరించిన కోల్పోయిన రైతులు... 

2025 ఏడాది ముగుస్తున్న నేపధ్యంలో కూటమి పాలనలో రైతుల సంక్షేమం గాల్లో దీపంలా మారింది.  చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన సంపదసృష్టి మాట దేవుడెరుగు.. ఈ ఏడాది రూ.25వేల కోట్ల రైతులు సంపద హరించుకుపోయింది. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయాలు కన్నా.. రైతులు సాగు విస్తీర్ణం తగ్గిపోవడం,  పంట దిగుబడి తగ్గడం వలన, రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్ధతు ధరలకు అమ్ముకోలేకపోవడం వల్ల , ప్రకటించిన ధరలకు ప్రభుత్వం రైతుల నుంచి పంటలను కొనుగోలుచేయకపోవడం వల్ల రైతులు ఇంత తీవ్ర స్ధాయిలో నష్టపోయారు.
ఆ రోజు డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉండేది. సకాలంలో నీళ్లు రాక, పంటలు పండక, పండిన పంటలను అమ్ముకోలేక, భూములు అమ్ముదామంటే కొనేవాళ్లు లేని దుర్భర పరిస్థితులు ఉండేవి. సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు మరలా రాష్ట్రంలో నెలకున్నాయి. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో భూములు ధరలు తగ్గిపోయాయి. భూములు అమ్ముదామంటే కొనేవాడు లేకుండా పోయాడు. సంపద హరించుకుపోయింది. గ్రామాల్లో రైతుల అప్పులు, మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరుగుతున్నారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఉత్పత్తులు గణనీయంగా పడిపోతే.. ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి పెట్టడం లేదు. 

కూటమి పాలనలో అన్నదాతల అగచాట్లు..

అకాల వర్షాలు లేదా అతివృష్టి వలన 2025లో వ్యవసాయరంగంలో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. నంద్యాలలో మాత్రమే పండే సన్నబియ్యం ఎన్ డి ఎల్ ఆర్, బాపట్ల రకాలు సన్నబియ్యాన్ని కూడా 75 కిలోల బస్తాను కనీసం రూ. 1300 కూడా కొనుగోలు చేసేవాళ్లు లేక 2025 జనవరి లో రైతులు రొడ్డెక్కడం మొదలుపెట్టారు. ఈ తర్వాత గుంటూరు మిర్చియార్డులో మద్ధతు ధర లేక రైతులు రొడ్డెక్కిని పరిస్థితి చూశాం. వారందరనీ వైయస్.జగన్ పరామర్శించి వారికి అండగా నిలబడ్డారు. వాస్తవానికి మిర్చి ఎగుమతులు జరిగితేనే లాభాలు వస్తాయి. కానీ ధరలు కుప్పకూలిపోయి అమ్ముకోలేక  రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితుల్లో వైయస్.జగన్ మిర్చియార్డుకు వెళ్లిన పరిస్థితుల్లో.. కేంద్రానికి లేఖ రాస్తే.. అప్పుడు  క్వింటాళు రూ.11,871 కి కొనుగోలుచేస్తామని ప్రకటించారు. కానీ ఒక్క క్వింటా కూడా ఆ ధరకు కొనుగోలు చేయలేదు. వాళ్ల పార్టీ అనుకూల రైతాంగం కూడా రోడ్డెక్కిఆందోళన చేశారు.
ప్రకాశం జిల్లాలో పొగాను వేలం కేంద్రాలను వైయస్.జగన్ పరిశీలించినప్పుడు... పొగాకు రేటు చరిత్రలో లేనంతగా కుప్పకూలిపోయింది. బర్లే పొగాకు బకాయిలు ఇంకా ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతులు చెబు తున్నారు. ప్రభుత్వం కొంటామని చెప్పి చేతులెత్తేసింది. బర్లీ పొగాకు పండే ప్రాంతమంతా టీడీపీ అనుకూల ప్రాంతమే, వాళ్లను కూడా ఆదుకోలేదు.
అ తర్వాత అత్యంత దారుణంగా మామిడి పంట కొనుగోలు ధర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే కుప్పకూలింది. టమాట ధరలు కుప్పకూలితే రైతులు అమ్ముకోలేక పంటను రోడ్ల మీద పారబోసే పరిస్ధితిని చాలా సార్లు చూసినట్లు.. తొలిసారి మామిడి రైతులు కూడా తమ పంటను రూడ్లమీద పారబోసుకున్నారు. కేజీకి రూ.4 తాము ఇస్తామని ఫ్యాక్టరీలు రూ.8 ఇస్తాయని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించింది. వ్యవసాయశాఖ మంత్రి సైతం ఇదే మాట చెప్పారు. కానీ రైతులు రోడ్ల మీద పారబోసుకునే పరిస్థితి తెచ్చారే తప్ప.. ఇచ్చిన హామీ అమలు కాలేదు. అందుకు నిదర్శనమే తాజాగా రైతులు ఫ్యాక్టరీలు ఇస్తామన్న ధర ఇవ్వలేదని, తమ బకాయిలు చెల్లించలేదని చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 2025 మే.. జూన్ నెలలో పంటకు నేటికీ రైతులకు బకాయిలు పూర్తిగా చెల్లించలేదు.

ఖరీఫ్ కొనుగోళ్లలోనూ విఫలం ప్రభుత్వం...

ఇక ఖరీఫ్ లో మార్కెట్ కు వచ్చే తొలి పంట ఉల్లి.  కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో అధికంగా ఉల్లి పంట పండుతుంది. ఉల్లికి ఎప్పుడూ లేనంత సంక్షోభం వచ్చింది.   ప్రభుత్వం రూ.12 లకే కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 రోజులు కొనుగోలు చేసి ఆ తర్వాత మాట మార్చి కొనుగోలు కాదు మీకు రూ.12 పేమెంట్ చేస్తామని చెప్పారు . అలా రూ.18 కోట్ల కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఇంకా రూ.8 కోట్లు రైతులకు బకాయిలు పెట్టింది. వాటి కోసం కలెక్టరేట్ల వద్ద రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. నెల్లూరు జిల్లాలో రబీ ధాన్యం ఎంఎస్పీ దొరకక రైతులు రోడ్లెక్కిన పరిస్ధితి. ఎంఎస్పీ లేకపోవడం వల్ల రైతులు రూ.250 కోట్లు కోల్పోయారు. రాయలసీమలో మాత్రమే ఖరీఫ్ లో వేరుశెనగ పండుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సాగు అంచనా 14.13 లక్షల ఎకరాలు అంచనా కాగా వాస్తవంగా సాగు అయిన విస్తీర్ణం కేవలం 6.5 లక్షల పై చిలుకు ఎకరాల లోనే జరిగింది. అంటే కేవలం 42 శాతం మాత్రమే సాగయింది. అది కూడా అధిక వర్షాల వల్ల దెబ్బతింటే ఆ పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వాస్తవానికి ఖరీఫ్ లో 78 శాతం వరి, వేరుశెనగ, ప్రత్తి ఈ మాడు పంటలే సాగవుతాయి. ఈ మూడు పంటలు సక్రమంగా పండి వాటికి సరైన ధర లభిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ రైతాంగం ఆనందంగా ఉంటుంది. ఇందులో మొదటిది వేరుశెనగ పంట నష్టపోయిన పరిస్ధితి.
ఇక ప్రత్తిపంట రాష్ట్రంలో సరాసరి 13 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా జరిగినది 11.27 లక్షల ఎకరాలు.. ఒక్క కర్నూలు జిల్లాలో 5.50 లక్షల ఎకరాల సాగవుతుంది. సరాసరి దిగుబడి 13 నుంచి 14 క్వింటాల్లు అయితే.. ఈ ఏడాది సగటున 3-4 క్వింటాల్లు, గరిష్టంగా 5 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది.   రూ.8111 కనీస మద్ధతు ధర కాగా.. రూ.6 నుంచి 6,500 కే ప్రత్తిని అమ్ముకున్న పరిస్థితి. కర్నూలు, ఎన్టీఆర్, నంద్యాల, అనంతపురం జిల్లాలో రైతులు నష్టపోయారు. 

రైతులకు భరోసా ఇవ్వలేని సమర్థలేని ప్రభుత్వం...

ఇక మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం 3.58 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం అంచనా కాగా... 3.29 లక్షల ఎకరాలు సాధారణ సాగు. కానీ 4.62 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 కాగా.. రూ.1900 నుంచి మొదలై రూ.1400 కు పడిపోయింది. పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఏపీలో ఇంతవరకు కొనుగోలు జరగలేదు. ఇందులో 45 శాతం నంద్యాల జిల్లాలో సాగవుతుంది. అయినా మేమున్నామన్న భరోసా ప్రభుత్వం రైతులకు ఇవ్వలేకపోయింది. 
వరి పంట విషయానికొస్తే.. రాష్ట్రంలో సాగు అంచనా 38.42 లక్షల ఎకరాలు అయితే సరాసరి సాగు 36 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది  38.5 లక్షల ఎకరాల్లో 105 శాతం సాగు జరిగింది. వర్షాలు వల్ల నదీజలాల్లో నీళ్లుండం,  భూగర్భ జలాలు వల్ల మొంథా తుపాను వరకు సాగు బాగానే ఉంది.ఆ తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతింది. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. అప్పుడు కూడా 4ల7ల టన్నుల మాత్రమే నష్టమని చెప్పారు. వరి  పంట దెబ్బతిన్న కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష నేతగా వైయస్.జగన్ పరిశీలించి, రైతులను పరామర్శించి అన్ని పంటలు కలిపి 15 లక్షల ఎకరాల వరకు దెబ్బతిన్నాయని చెప్పారు.  ప్రభుత్వం మాత్రం 33 శాతం దెబ్బతిన్నపంటలను మాత్రమే ప్రకటించారు. రైతులు నష్టపోయిన పరిస్తితుల్లు. కందిపంట 8.12 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం అంచనా అయితే... 6.37 లక్షల ఎకరాల్లో సాగు జరగాలి. వేరుశెనగ సాగు గణనీయంగా పడిపోవడంతో కంది సాగు టైమ్ అయిపోయిన తర్వాత జరిగింది. ఇప్పడు  7.95 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. మద్ధతు ధర లేక రూ.6500 కే అమ్ముకుంటున్న పరిస్ధితి. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియే చేపట్టలేదు. 

మినుములుది అదే పరిస్థితి. 89 వేల ఎకరాలు సాగు అంచనా అయితే అనుకున్న మేరకు సాగు, దిగుబడి రెండూ తగ్గిపోయాయి. పెసర పంట విషయానికొస్తే  ఎన్టీఆర్ జిల్లాలో 85 శాతం సాగవుతుంది. టీటీపీ నందిగాం ఎమ్మెల్యే కనీస మద్ధతు ధర లేదని  అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ పంట వేసినా ప్రభుత్వం రైతులను ఆదుకున్నదే లేదు. రైతుల చరిత్రలో ప్రభుత్వం తరపున ఈ ఏడాది చీకటి సంవత్సరం. ప్రకటించిన మద్ధతు ధర ఏ పంటకూ లభించని దుస్థితి నెలకొంది. 
టీడీపీ అనుకూల పత్రికల్లోనే ధాన్యం మద్ధతు ధర లేని రూ.1789 లకే కొనాల్సి ఉంటే కేవలం  రూ.1400 నుండి 14 50 రూ. కే కొనుగోలు చేస్తున్నారని రాశారు.  నెల్లూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి. రైతుల కోసం పనిచేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కావడం తప్ప.. క్షేత్రస్ధాయిలో వారికి చేసిన సాయం మాత్రం సున్నా. 

ప్రత్యామ్నాయం లేకుండా సాగొద్దంటే ఎలా?

నేరుగా ముఖ్యమంత్రే వరి పంటపండించొద్దని చెప్పడం దారుణం. రాష్ట్రంలో 72 లక్షల టన్నుల అరటి ఉత్పత్తి అయితే ఒక్క రాయలసీమలోనే 40 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. కిలో రూ.1,  రూ.50 పైసలకే అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తే.. ప్రభుత్వం నుంచి కనీస సాయం లేదు. హార్టికల్చర్ లో ప్రధానమైన చినీ పంట 40 లక్షల టన్నుల ఉత్పత్తి అయింది. అది కూడా రాయలసీమలోనే పండుతుంది. రాయలసీమ పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని మేం ముందునుంచీ చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి బాధ్యతగల ప్రతిపక్షంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే మమ్నల్ని విమర్శిస్తున్నారు. కొబ్బరి పంటకూ మద్దతు ధర లేదు. 
ఇక పాలసీల పరంగా చూస్తే... వైయస్.జగన్ ప్రభుత్వం హయాంలో అతిముఖ్యమైనది పంటల బీమా పథకం. ఇది పూర్తి ఉచితంగా రైతులకు అందించింది. రాష్ట్రంలో మొదటి 4 సంవత్సరాలలో ఒక్క కరువు మండలం కూడా లేకుండానే..  రూ.7802 కోట్లు వైయస్.జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇన్సూరెన్స్ కింద చెల్లించింది. అది రైతులకు భరోసా ఇవ్వడం. దాన్ని కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పంటలబీమాకు సంబంధించి ఉల్లి, మిర్చి, ప్రత్తి పంటలకు ఎకరాకు రూ.1700 నుండి 1900 వరకు కట్టాల్సి రావడంతో రైతులు ఎవరూ బీమా చేసుకునే పరస్థితి లేదు.  దీంతో ఎవ్వరూ ఇన్సూరెన్స్ ప్రీమియమ్  పరిధిలోకి రాకపోవడంతో నష్టపోయిన పరిస్థితి తలెత్తింది.

రైతులను ఆదుకునే పథకాలకూ గండి...

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేలు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. తొలి ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో ఏడాది రెండు దఫాలు కలిపి మొత్తం రూ.10 వేలు మాత్రమే చెల్లించారు. 53.58 లక్షల మంది రైతులుకు పెట్టుబడి రాయితీ కింద రైతు భరోసా అందిస్తే.. ఇందులో అన్నదాత సుఖీభవ కింద 7 లక్షల మందిని తొలగించారు. కౌలురైతులకు కూడా పెట్టుబడి సాయం వైయస్.జగన్ ప్రభుత్వంలో అందిస్తే.. కూటమి ప్రభుత్వంలో దాని ఊసేలేదు.ఈ ఏడాది రైతులు ఇన్ని పంటలు నష్టపోతే.. పంట నష్టపోయిన రైతులకిచ్చే పరిహారం ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 
ఏ రకంగా రైతులు తర్వాత పంటల సాగుకు ముందుకు వెళ్ళగలరు. వైయస్.జగన్ హాయంలో రూ.2 వేల కోట్లకు పైగా సున్నావడ్డీ రాయితీ కింద  రీయింబర్స్ చేశారు. ఈ ప్రభుత్వంలో సున్నావడ్డీ కింద ఒక్కరూపాయి కూడా రీయింబర్స్ చేయలేదు. గిట్టుబాటు ధరలు ఏ పంటకూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవి కూడా అమలు చేయలేదు. మరోవైపు పంటల కొనుగోలులో మీనమేషాలు లెక్కించి.. రైతులకు తీవ్ర ఆన్యాయం చేసింది. 

కూటమి నేతలనే ప్రశ్నిస్తున్న రైతులు..

ప్రతిచోటా కూటమి మంత్రులకు రైతుల నుంచే ప్రశ్న ఎదురవుతోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో రైతులు ఆయనతో మాట్లాడుతూ..  వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో  ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సక్రమంగా అమలయ్యాయని, మన ప్రభుత్వంలో అవేవీ అమలు కావడం లేదని వాళ్ల పార్టీ రైతులే లేవనె త్తరు. అయినా సమాధానం చెప్పని.. ఈ ప్రభుత్వం ప్రజలకు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను నిలిపివేసి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
ఏ పంటకూ గిట్టుబాటు లేని పరిస్ధితి తలెత్తింది. ఫలానా పంట వేయొద్దని చెప్పినప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ఏవి సాగు చేయాలో చెప్పాలి, కానీ అలా చేయడం లేదు.  కూటమిలో గ్రామ, మండల స్థాయి నాయకులే అధికార పార్టీ మంత్రులను ప్రశ్నిస్తున్నారు. 
రైతులకు తమ పంట సక్రమంగా పండి దానికి సరైన మద్ధతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రైతుల మనుగడ ఉంటుంది. మరోక కీలకమైన అంశం ఎరువులు సరఫరా.. కానీ మొన్నటి ఖరీఫ్ లో రైతులకు ప్రభుత్వం ఎరువులు సరఫరాలో విఫలమైంది. ఇదేంటని ప్రశ్నిస్తే..విమర్శించారు..  వాస్తవ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాన్ని అంగీకరించలేకపోతుంది.
వాస్తవానికి లక్షల టన్నుల యూరియా డైవర్ట్ అవుతుంది అని అనుమానం వ్యక్తం చేసాము. అదే సమస్యకుకారణం అవుతుంది. యూరియా అడిగితే బలవంతంగా నానో యూరియా అంటగట్టవద్దని చెప్పాం. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కూడా బలవంతం చేయవద్దని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నా ప్రకటనకు రైతులను రెచ్చగొడుతున్నారని ప్రతి స్పందన ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రైతు నాయకుడిగా నేను ప్రజలకు, రైతులకు ఉపయోగపడే వాస్తవాలనే చెబుతున్నాను. 
2.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మార్కె ఫెడ్ ద్వారా సరఫరా జరిగింది. 1.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్లు ద్వారా సరఫరా జరిగింది, రైతులను రెచ్చగెట్టవద్దని చెప్పారు. నేను రైతు సంఘం నాయకుడిగా వాస్తవాలనే మాట్లాడాను. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తే మీకు కచ్చితంగా ధన్యవాదాలు చెబుతాం. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యూరియా కొరత స్పష్టంగా ఉంది. శ్రీకాకుళం నుంచి నంద్యాల వరకు రైతు భరోసా కేంద్రాల వద్దకు వచ్చిన యూరియాకు..రైతులు రోజుల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి..  కొన్ని చోట్ల రైతుల సీరియల్ నెంబర్లు రాసుకుని మరలా రమ్మంటున్నారు. అంటే అక్కడ యూరియా స్టాక్ లేనట్లే లెక్క. వీటన్నింటినీ సరిదిద్దాలని కోరుతున్నాను. రైతుల ప్రతినిధిగా నాలుగు దశాబ్దాలుగా నిరంతరం వాస్తవాలనే చెబుతున్నాను. క్షేత్రస్ధాయిలో రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వాలని ఎం వీ యస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే తప్ప ప్రభుత్వం వాస్తవదూరంగా నిద్రనటించవద్దని హెచ్చరించారు.   
ఈ సందర్భంగా సంక్రాంతి రైతుల పండగని రాష్ట్ర రైతాంగానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.