వేమూరులో కూటమికి షాక్‌

31 Dec, 2025 11:16 IST

బాప‌ట్ల‌: వేమూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శిస్తూ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినపరిమి గ్రామానికి చెందిన కూటమి నేతలు, యువకులు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చినపరిమి వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడు తమ్మా పాములరెడ్డి ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి పాలనపై విరక్తి చెంది, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం, సంక్షేమ పాలనపై విశ్వాసంతో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నామని వారు వెల్లడించారు. 

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీయేనని, రాబోయే రోజుల్లో వేమూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ బలం మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నిజాన్ని గుర్తిస్తున్నారని, ఈ వలసలు అదే సూచిస్తున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. వేమూరులో వైయ‌స్ఆర్‌సీపీ పునర్వైభవానికి ఇది నాంది అని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు.