‘వైయస్ జగన్ అనే నేను..’ సంక్షేమ సంతకానికి రెండేళ్లు
2019 వేసవి కాలం మే 30వ తేదీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగుజనం టీవీలకు అతుక్కుపోయి ఓ మహోత్సవాన్ని చూశారు. అది భావోద్వేగాల సంగమస్థలి. పదేళ్ల కష్టానికి.. ప్రజలందించిన ప్రతిఫలం. అపూర్వ విజయం.. అనితరసాధ్యమైన మెజార్టీ. ఇంతటి అపురూప క్షణాలు, అపూర్వ ఘట్టాల మధ్య ‘‘వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’ అంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అచ్చం నాన్నలా అంటూ జనం.. మా నాయకుడు అంటూ కార్యకర్తలు.. కాలర్ ఎగరేశారు. జన సంక్షేమానికై వర్థిల్లూ అంటూ నోరారా దీవించారు. ఆ క్షణాన తల్లి వైయస్ విజయమ్మ తన కొడుకుని హత్తుకొని ఆనందభాష్పాలు చిందించిన తీరు.. వర్ణించలేని అద్భుత దృశ్యం.
కోట్లాది సామాన్య జనజీవితాల్లో వెలుగులు..
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న తపన. అసలు సిసలు అభివృద్ధి సాధించి చూపాలన్న ధృడ సంకల్పం. రెండేళ్ల క్రితం మే 30 నుంచే ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన మొదలైంది. ప్రతి రోజూ సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతూ సాగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల లబ్ధి గురించి ఆలోచించేలోపే ఆంధ్రప్రదేశ్‌లో అవి అమలుకు వచ్చాయి. సంక్షేమ పథకాలకు సరికొత్త అర్థం చెబుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా వ్యవస్థ సిద్ధమైంది. అది కోట్లాది సామాన్య జనజీవితాల్లో వెలుగు పంచడం మొదలైంది.
మేనిఫెస్టోకు స్వచ్ఛమైన నిర్వచనం..
గత ప్రభుత్వ అసమర్థపాలన చీకటి నీడలు అడుగడుగునా వెంటాడుతున్నా.. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతున్నా.. ఏ మాత్రం బెరుకు లేకుండా, సమర్థుడు ఎలా పాలించగడో.. గుండె నిండా జన సంక్షేమమే ఉన్న నాయకుడు ఏమేమి చేయగలడో.. అన్నీ రెండేళ్ల కాలంలోనే చేసి చూపించారు సీఎం వైయస్ జగన్. పదవి అన్నది అలంకార ప్రాం కాదని, అధికార దర్పం ప్రదర్శించడానికి కాదన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్ధాంతం. అందుకే తాను హామీ ఇచ్చిన నవరత్నాలను కళ్ల ముందే పెట్టుకున్నారు. తాను మాత్రమే కాకుండా తన ప్రభుత్వ సహచరులకు, అధికార వ్యవస్థకూ ఆ నవరత్నాలు కంఠోపాఠం కావాలని అడుగడుగునా కోరారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తూ.. స్వచ్ఛమైన నిర్వచనం చెప్పారు.
ప్రజాహితమే పరమావధిగా..
పేరుకే యువకుడు.. కానీ, ఆలోచనల్లో పెద్ద మనసున్న నాయకుడు. ప్రజలకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో సూక్ష్మంగా ఆలోచిస్తూ.. వారికి చేస్తున్న మంచి మరో వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా దూరదృష్టితో అడుగులు వేస్తున్నారు సీఎం వైయస్ జగన్. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై సాటిలేని దార్శనికత చూపుతున్నారు. ఈ రెండేళ్ల వైయస్ జగన్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సమీక్షిస్తే.. ప్రజాహితమే పరమావధిగా కనిపిస్తుంది. తన పాలనతో సంక్షేమం, అభివృద్ధికి స్వచ్ఛమైన నిర్వచనాన్ని ప్రజలకు తెలియజేశారు.
వలంటీర్ల వ్యవస్థతో సరికొత్త విప్లవానికి నాంది..
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి.. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి బాటలు వేశారు సీఎం వైయస్ జగన్. సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందించేలా వలంటీర్ల వ్యవస్థ ద్వారా తనలాగే ప్రజాసేవ చేసే ఓ సైన్యాన్ని రంగంలోకి దించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏకంగా 4.5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. పెన్షన్ మొదలు ఏ పథకమైనా నేడు గడప ముందుకొస్తోంది. రాష్ట్రంలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వలంటీర్లను పలు బిరుదులతో సత్కరించి.. ప్రజాసేవకు ప్రోత్సహిస్తోంది వైయస్ జగన్ ప్రభుత్వం.
సకల వర్గాలకు, సమస్త వృత్తులకు చేయూత..
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం తెచ్చి అరకోటి పైగా రైతులకు తోడుగా నిలిచారు. లక్షలోపు వ్యవసాయ రుణాలు మాఫీ, పంటల బీమా, జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం, పాడి, మత్స్యకారుల భరోసా కోసం పథకాలు, విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం కోసం ‘నాడు–నేడు’ అన్నవి అద్భుత పథకాలు. వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ, మహిళల కోసం ఎన్నెన్నో పథకాలు.. ఇళ్ల పట్టతాలు, గృహ నిర్మాణ ప్రణాళికలు, ఆర్థిక తోడ్పాటుతో మహిళా సాధికారతకు పెద్దపీట, అవ్వాతాతల పెన్షన్లు గణనీయం.. ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు, సమస్త వృత్తులకు ప్రభుత్వ చేయూత పథకాలు ఎన్నెన్నో..
సంక్షేమంలో తనదైన ముద్ర..
ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో తలెత్తిన సంక్షోభాలెన్నో.. అయినా వాటన్నింటినీ సవాళ్లుగానే స్వీకరించారు సీఎం వైయస్ జగన్. ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడమే ఏకైక మార్గంగా ఎంచుకొని ప్రజల కోసమే ప్రభుత్వమన్న లక్ష్యం నుంచి వెనుదిరగకపోవడమే తన ధ్యేయంగా పనిచేశారు. గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవీ ఏమారక స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి పథకాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అడుగులు వేశారు సీఎం వైయస్ జగన్. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి పథకాల్లో తనదైన ‘ప్రజాహిత’ లక్ష్యాన్ని, రాష్ట్ర శ్రేయస్సును చాటారు.
ప్రతి అడుగులోనూ ప్రస్పుటంగా మానవీయకోణం..
గుజరాత్‌లో ఇరుక్కుపోయిన జాలర్లను ప్రత్యేక బస్సుల్లో రప్పించడంతో పాటు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన మత్స్యకారులను విడిపించి.. వాళ్ల కష్టాన్ని చలించి.. రూ.5 లక్షల చొప్పున సాయం చేసిన సంఘటన వెనుక సీఎం వైయస్ జగన్‌లో ఉన్న మానవీయ కోణం ప్రస్పుటంగా ప్రతి అడుగులోనూ కనిపిస్తూనే ఉంటుంది. అడగందే అమ్మ అయినా పెట్టదంటారు.. కానీ, కష్టం అనే మాట వినపడినా, కనపడినా సాయం చేయాలన్న సీఎం వైయస్ జగన్ చేయి మాత్రం అస్సలు ఊరుకోదు. సరిగ్గా సంవత్సరం క్రితం మేధోమధన సదస్సుల్లో ఓ చిన్నారి అమ్మకు బాగోలేదు.. అయినా పర్వాలేదు నాకు మామయ్యలా మీరున్నారని చెప్పిన వెంటనే చలించిపోయిన సీఎం వైయస్ జగన్.. వెంటనే ఆ చిన్నారి ఇంటికి వైద్యులను పంపించి ఆ తల్లికి మెరుగైన వైద్యం అందించారు.
129 వాగ్దానాల్లో రెండేళ్లలోనే 107 అమలు..
ఎన్నికల ముందు ఇచ్చిన 129 వాగ్దానాల్లో 107 వాగ్దానాలను పూర్తిగా అమలు చేశారు. మేనిఫెస్టోలోని హామీలను 94.5 శాతం కేవలం 24 నెలల కాలంలోనే పూర్తి చేయగలిగారంటే.. సీఎం వైయస్ జగన్‌కు ప్రజాసేవ, వారి అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి నిదర్శనం. ఈ రెండేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో రూ.95,528.50 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. మరో రూ.36,197 కోట్లను పరోక్షంగా మొత్తం రూ.1.31 లక్షల కోట్ల పైచిలుకు ప్రజలకు నేరుగా అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. కులం, మతం, ప్రాంతం, పార్టీ, చివరకు రాజకీయాలు కూడా చూడకుండా.. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావు లేదు, వివక్షకు చోటు లేదు. కేవలం అర్హత మాత్రమే.
కేజీ నుంచి డాక్టర్, ఇంజనీర్.. ఆపై చదువులు ఉచితంగానే..
వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణతో కడుపులో పెరుగుతున్న బిడ్డ దగ్గర నుంచి మొదలై.. వైయస్‌ఆర్ పెన్షన్ కానుకతో పండు ముసలి వరకు సీఎం వైయస్ జగన్ తలపెట్టిన పథకాలు నిరంతరాయంగా అందుతున్నాయి. ఆఖరకు బడికెళ్లే విద్యార్థులు మధ్యాహ్నం తినే భోజనం మెనూను దగ్గరుండి మరీ తయారు చేయించారు సీఎం వైయస్ జగన్. ‘మనబడి నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతూ.. పేదవాడికి అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించేందుకు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రీప్రైమరీ మొదలు డాక్టర్, ఇంజనీర్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు సీఎం వైయస్ జగన్.
ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవం..
పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే తలంపుతో మహానేత వైయస్‌ఆర్ ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీకి ఆయన తనయుడు వైయస్ జగన్ పునర్జీవం పోశారు. రూ.1000 వైద్యం ఖర్చు దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించడంతో పాటు శస్త్ర చికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో నగదుసాయాన్ని కూడా చేస్తున్నారు. ప్రమాదాలకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడే వారిని ఆస్పత్రులకు చేర్చిందుకు 1088 నూతన అంబులెన్స్‌లను విజయవాడ నడిబొడ్డున జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. 24 నెలల కాలంలోనే 16 నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారు.
కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం..
అనుకోని విపత్తు వచ్చిపడినా.. ఆ మహమ్మారి కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవాడి ప్రాణానికి అండగా నిలిచి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడయ్యారు. నేడు కరోనా చికిత్స పొందుతున్న బాధితుల్లో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందుతున్నవారే ఉన్నారు. ఇప్పుడిప్పుడే యావత్ దేశాన్ని వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. అంతటితో ఆగకుండా.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు రోడ్డునపడకుండా మేనమామలా వారికి తోడుగా నిలుస్తూ.. ప్రతి చిన్నారి పేరు మీద రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు.
ఈ రెండేళ్ల కాలం అందుకు నిదర్శనం..
మొత్తానికి సమస్యలేవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా.. చెక్కుచెదరని ఆత్మస్థైర్యం సీఎం వైయస్ జగన్ సొంతం. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి, ఆ దిశలోనే, ఆ లక్ష్యసాధనే శ్వాసగా, ధ్యాసగా పనిచేసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన పనితీరులో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది. ప్రజాబలం ఉంది. అందుకే ఆయన సంకల్పం, బలమైన ఆకాంక్ష నిజమై తీరుతాయి. ప్రజల గుండెల్లో తనకో చోటు ఉండాలన్న తపన ఆయన్ను రాజకీయ నాయకుల్లో ఓ విశిష్ట వ్యక్తిగా నిలుపుతోంది. తన కృషితో, పట్టుదలతో ముందడుగులు వేస్తున్న సీఎం వైయస్ జగన్.. రాబోయే రోజుల్లో సాధించబోయేవన్నీ ప్రజలకందే అమృత ఫలాలే.. గడిచిన ఈ రెండేళ్ల కాలం అందుకు నిదర్శనం.