టీడీపీది రాజ‌కీయ ఆక్రోశం

20 Aug, 2019 12:49 IST

విశాఖ‌:  వ‌ర‌ద‌ల‌పై టీడీపీది రాజ‌కీయ ఆక్రోశమేన‌ని,  కావాల‌నే ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లాల‌ని చూస్తుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ప్రాణ‌న‌ష్టం, ఆస్తినష్టం క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. న‌ష్ట‌పోయిన బాధితుల‌కు త్వ‌ర‌లోనే ప‌రిహారం అందిస్తామ‌ని పేర్కొన్నారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడారు.
 
వారం రోజులుగా గోదావ‌రి, కృష్ణా న‌దులకు వ‌ర‌ద వ‌చ్చాయ‌ని చెప్పారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆస్తిన‌ష్టం, ప్రాణ‌న‌ష్టం క‌లుగ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. పున‌రావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఆదుకున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసింద‌న్నారు. వ‌ర‌ద ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షించార‌ని తెలిపారు. బాదితుల‌కు అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించామ‌ని, పంట‌లు దెబ్బ‌తిన్న రైతుల‌కు త్వ‌ర‌లోనే న‌ష్ట‌ప‌రిహారం అందిస్తామ‌ని చెప్పారు. వ‌ర‌ద బాధితుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదులు రాలేద‌న్నారు. టీడీపీ నేత‌లు కావాల‌నే ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  చంద్ర‌బాబుకు ఎంత‌సేప‌టికీ ఆయ‌న ఇల్లే గుర్తుకు వ‌స్తుంద‌ని విమ‌ర్శించారు. త్వ‌ర‌లోనే  బాధితులంద‌రినీ ఆదుకుంటామ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఆదేశాలు ఇచ్చార‌ని తెలిపారు. వ‌ర‌ద‌లు వ‌చ్చి వారం రోజులు అయితే చంద్ర‌బాబు ఇప్పుడు వ‌చ్చి ప‌రిశీలిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేం వైఫ‌ల్యం చెందామ‌ని టీడీపీ అంటోంద‌ని, అదే జ‌రిగి ఉంటే గ్రామాల‌కు గ్రామాలు కొట్టుకుపోయేవ‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో శ్రీ‌శైలం ప‌వ‌ర్ ప్లాంటే మునిగే ప‌రిస్థితి చూశామ‌న్నారు. టీడీపీది అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక మాట‌..లేన‌ప్పుడు మ‌రో మాట అని ధ్వ‌జ‌మెత్తారు.  వ‌ర‌ద ప‌రిస్థితి తెలుసుకునేందుకు డ్రోన్ విజివ‌ల్స్ తీస్తే దానికి వ‌క్ర‌భాష్యం చెబుతున్నార‌ని, చంద్ర‌బాబు దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వ‌ర‌ద‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం త‌ప్పా అని నిల‌దీశారు. టీడీపీ నేత‌లు దిగ‌జారుడు రాజ‌కీయాలు మానుకోవాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ హిత‌వు ప‌లికారు. అన్‌రెస్ట్ క్రియేట్ చేసేందుకు టీడీపీ నేత‌లు త‌ప‌న ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అప్పుడు ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు రాలేదు
చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు రాలేద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. ప‌రిశ్ర‌మ‌లు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయ‌ని ఇప్పుడు త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌న్నారు.  డిప్లామాటిక్ అవుట్ రీచ్ స‌ద‌స్సుకు 30 దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. ఎవ‌రెన్ని చేసినా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంకిత‌భావం ఉన్న వ్య‌క్తి అని ఉద్ఘాటించారు.