రెండేళ్లలో పోలవరం నిర్మిస్తాం..
తాడేపల్లి: టెండరింగ్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టిందని, వందల కోట్ల ప్రజాధనం ఆదా అయితే హర్షించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని, రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని, ఇదే జరిగితే టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌తో దాదాపు రూ.800 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నేతల ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి ఆలోచన నిజమైందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రివర్స్ టెండరింగ్ పిలువగా మొన్న రూ.58 కోట్లు, నిన్న రూ.780 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదా అయ్యాయని చెప్పారు. గత రెండు నెలలుగా రకరకాలుగా మాట్లాడారు. వరదల కారణంగా రెండు నెలల పాటు పనులు నిలిపివేస్తే..పోలవరం ఆగిపోయిందని రకరకాలుగా ప్రచారం చేశారన్నారు. ఇన్ని కోట్లు, అన్ని కోట్లు నష్టమని ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కలల స్వప్నమైన పోలవరాన్ని ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. పారదర్శకతతో తీసుకొచ్చిన మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ విజయవంతం కావడం శుభపరిణామమన్నారు. అప్పుడే టీడీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. పారదర్శకతతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే..ఎక్కడ తమ బంఢారం బయటపడుతుందని, దోచుకున్నది బయటపడుతుందన్న భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో మూడేళ్ల క్రితం పిలిచిన పనుల్లో ఒక్కటైనా పూర్తి చేశారా అని నిలదీశారు. దేశంలోనే ఇప్పటిదాకా ఎక్కడ లేని విధంగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని చెప్పారు. ఎక్కడైనా ప్రభుత్వం రూ.10 తగ్గించి, పారదర్శకంగా పనులు చేపడితే మెచ్చుకోవాల్సి పోయి..విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాక్స్ సంస్థకు పోలవరం నిర్మించే అర్హత లేదని టీడీపీ నేతలు అంటున్నారని, అదే గత ప్రభుత్వంలో ఇదే మ్యాక్స్ సంస్థకు 4.45 శాతానికి ఎక్సెస్‌కు అప్పగించలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి సంబంధించి మెఘా 12.5 శాతం తక్కువకు పనులు చేపట్టేందుకు ముందుకు వస్తే తప్పుపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవన్నీ జీర్జించుకోలేక ప్రభుత్వంపై బుదర జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. పోలవరాన్ని మీరు చెప్పినదానికంటే ముందే పూర్తి చేస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారా అని సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి పనిపై కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని తెలిపారు. గత పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే పారదర్శకంగా పనులు చేపట్టి ఉంటే రాష్ట్రానికి వేల కోట్ల ప్రజాధనం మిగిలేదన్నారు. దోచుకున్న డబ్బు పెద్దబాబు, చిన్నబాబు జేబుల్లోకి వెళ్లాయా అని ప్రశ్నించారు. నవంబర్ నుంచి పోలవరం నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక్క టెండర్‌లో రూ.782 కోట్లు ఆదా అయ్యాయంటే సామాన్య విషయం కాదన్నారు. ఇవాళ దేవినేని ఉమా కూర్చొని మాట్లాడుతున్న స్థలం ఇరిగేషన్ శాఖకు సంబంధించిందన్నారు. ఒక్క సైట్‌ను కేవలం రూ.1000 చొప్పున లీజుకు తీసుకొని ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉమాకు దమ్ముంటే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో 4.4 శాతం అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, మా ప్రభుత్వం 12.6 శాతం తక్కువకు కోట్ చేసిన మెగాకు పనులు అప్పగించామన్నారు. ఇదే మెగా సంస్థకు గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రాజెక్టు పనులు అప్పగించిందని గుర్తు చేశారు. ఇదే రివర్స్ టెండరింగ్‌లో నవయుగ కంపెనీ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తమ బండారం బయటపడుతుందని టీడీపీ భయపడుతుందని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిరహితంగా మార్చబోతున్నారని, టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి విజ్ఞప్తి చేశారు.