ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

తాడేపల్లి: ప్రజల అవస్థలను తొలగిస్తూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేయడం పట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ ఆపరేటర్లు బుధవారం ధర్నాలు చేపట్టారు. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించారని ఆపరేటర్లు మండిపడ్డారు. కేవలం మాజీ సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఎండియూ ఆపరేటర్లు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టగా, వారి ఆందోళనకు మాజీ ఎంపీ మార్గాని భరత్ మద్దతు తెలిపారు. కర్నూలులో తలపెట్టిన నిరసనలో వైయస్ఆర్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎండియు వాహనదారులపై కూటమి ప్రభుత్వం కుట్రలు మానుకోవాలని, మంత్రులు తమని రేషన్ దొంగలు గా చూడడం సరైనది కాదని ఆపరేటర్లు ధ్వజమెత్తారు. ఎండియు వాహనదారులను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.