నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’  

30 Mar, 2026 11:29 IST

శ్రీ‌కాకుళం: మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్‌ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  

శ్రీ‌కాకుళం జిల్లా అభివృద్ధికి వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం
 రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైయ‌స్‌ జగన్‌ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో  వైఎస్‌ జగన్‌ తన పాలనలో  సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్‌ 19న శంకుస్థాపన చేశారు.

రైతుల అంగీకారంతో 327.75 ఎక‌రాల సేక‌ర‌ణ‌
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.

కూట‌మి నేత‌లు క‌మీష‌న్ల కోసం ప‌నుల నిలిపివేత‌
చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్‌ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్‌లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.