45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి

17 Jul, 2025 11:22 IST

తాడేప‌ల్లి: పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేస్తేనే గోదావరి మిగులు జలాలు ఇతర నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)కు మళ్లించడానికి అవకాశం ఉంటుందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు రాజీపడ్డారని గుర్తు చేశారు. దీని కారణంగా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘‘గోదావరికి ప్రాణహిత, ఇంద్రావతి ప్రధాన ఉప నదులు. 

ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు ప్రాణహిత జలాలను గరిష్ఠ స్థాయిలో వాడుకు­నేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. తాజాగా ఇంద్రావతి జలా­లను గరిష్ఠంగా వినియోగించుకోవ­డా­నికి ఛత్తీస్‌గఢ్‌ బోద్‌ఘాట్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్టును చేపట్టింది. దీనికి రూ.50 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో తొలుత పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలి’’ అని  రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ సూచించారు. అందుకు భూ సేకరణ, నిర్వాసి­తులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని పేర్కొ­న్నారు. 


కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.15 వేల కోట్లను సమీకరించి.. భూ సేకరణ, నిర్వాసితు­లకు పునరా­వాసం కల్పించి పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతికి అడ్డుకట్ట వేస్తే.. పోల­వరంలో మిగులు, వరద జలాల లభ్యత ఏ స్థాయి­లో ఉంటుందన్నది అంచనా వేయా­లన్నారు. మిగులు, వరద జలాల లభ్యత ఉంటుందని తేల్చిన తర్వాత పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని వైయ‌స్‌ జగన్‌ సూచించారు. నీళ్లు లేకుండా ఆ ప్రాజెక్టును చేపడితే రూ.80 వేల కోట్లు వృథా అవుతాయ­న్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని పోల­వరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.