'ఆర్బీకేలు` అందరికీ ఆదర్శం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) వ్యవస్థ దేశానికే ఆదర్శమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఇంటి ముంగిటే అందించడం దేశంలోనే సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. ఇలా అనేక మంది మేధావులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్‌బీకే సేవలను కొనియాడుతున్నారు.
ఆర్బీకేలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పటికే రైతులు ఈ కేంద్రాల నుంచి లక్షలాది ఆర్డర్లు పెడుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలు తమ గ్రామానికి తెప్పించుకుంటున్నారు. ఇలా జరగడమంటే రైతుకు చాలా వ్యయప్రయాసలు తప్పినట్టు. నాణ్యమైన ఉత్పాదకాలను 72 గంటల్లోగా రాబట్టడమే వ్యవసాయంలో కీలకం. అందుకే ఆర్బీకేల వ్యవస్థ ఆదర్శనీయం.
ఆర్బీకేల్లో 1.10లక్షల టన్నుల నిల్వలు..
సీజన్‌కు ముందుగానే ఆర్‌బీకేల్లో 1.10లక్షల టన్నుల ఎరువుల నిల్వలను అందు బాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ జతిన్ చోప్రాకు వివరించారు. దీంతో రైతులు ఎమ్మార్పీ ధరలకే గ్రామాల్లో ఎరువులు పొందేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఏ ఒక్క డీలర్.. ఎమ్మార్పీకి మించి అమ్మకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎరువుల నాణ్యత, లభ్యతను పరిశీలించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసామని వివరించారు. కాగా, జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన 1.56లక్షల టన్నుల యూరియా, 63వేల టన్నుల డీఏపీ, 1.20లక్షల టన్నుల కాంప్లెక్స్, 26వేల టన్నుల ఎంవోపీ ఎరువులు ఇంకా చేరలేదని కమిషనర్ వివరించగా, ఆగస్టులో వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని జతిన్‌చోప్రా హామీ ఇచ్చారు.
రైతుభరోసా కేంద్రాల్లో ఇక బ్యాంకింగ్ సేవలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతుభరోసా కేంద్రాలు మినీ బ్యాంకులుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ, అనుబంధశాఖలకు చెందిన అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు చేరనున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 5000 జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల విలీనంతో కొత్త బ్యాంకులు ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. బ్యాంక్ బ్రాంచ్ స్థానంలో వివిధ బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రామాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్‌బీకేల్లోని ఈ సేవలు అందేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో 877 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి.
వివిధ బ్యాంకులకు సంబంధించి 804 మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరి ద్వారా ఆర్‌బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు అందించడానికి లీడ్ డి్రస్టిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్ కరస్పాండెంట్లను ఆర్‌బీకేలతో మ్యాపింగ్ చేయడాన్ని పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఎల్‌డీఎం దగ్గరి నుంచి మార్గదర్శకాలుపంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో నగదు తీసుకోవాలన్నా.. నగదు జమ చేయాలన్నా.. నగదు బదిలీ చేయాలన్నా దూరప్రాంతంలోని బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఇక నుంచి ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
రూ.20 వేల వరకు అవకాశం
ఆర్‌బీకేల ద్వారా నగదు ఉపసంహరణ (విత్‌డ్రా), నగదు జమ (డిపాజిట్)తో పాటు నగదు బదిలీ కూడా చేసుకునే అవకాశం సోమవారం నుంచే అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటే ఆర్‌బీకేల నుంచి బిజినెస్ కరస్పాండెంటు ద్వారా రూ.20 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.20 వేల వరకు నగదు జమ చేయవచ్చు. నగదు ట్రాన్స్‌ఫర్ మాత్రం రూ.10 వేల వరకు చేసుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ల పని వేళలు త్వరలో నిర్ణయించనున్నారు. వారికి బ్యాంకులు ఇచ్చిన స్వైపింగ్ మిషన్‌లు, ట్యాబ్‌ల ద్వారా వారు ఆన్‌లైన్‌లోనే బ్యాంకింగ్ సేవలు అందించనున్నారు.
కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ
మా రాష్ట్రంలో రైతు వేదికలు కట్టి రైతులకు శిక్షణ ఇస్తున్నాం. కానీ.. ఆర్బీకేల స్థాయిలో మా దగ్గర సేవలందించడం లేదు. ఇక్కడి రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘వన్‌స్టాప్ షాప్’ కింద ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఓ చానల్ సైతం నడుపుతున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీ ద్వారా రైతులు స్వయంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు. కియోస్క్ టెక్నాలజీ ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే పంపిణీ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. దారి మధ్యలో అత్తోట, నంది వెలుగు గ్రామాల్లోని పొలాల దగ్గర ఆగి రైతులతో మాట్లాడా. వాళ్లు ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఆర్బీకేలను, వాటి ద్వారా రైతులకు అందుతున్న సేవలను కళ్లారా చూశా.. ఆర్బీకేలు చాలా బాగున్నాయ్. ఈ వినూత్న ప్రయోగం ద్వారా అందిస్తున్న సేవలతో రైతులు పూర్తిగా ప్రభుత్వంతో ఉన్నారని నా పరిశీలన లో అర్థమైంది.