పింఛన్ల పండుగ
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ ఇవాళ ఉదయం నుంచే ప్రారంభమైంది. వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు. ఉద్యమంలా ఈ కార్యక్రమం కొనసాగుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో మరో 90,167 మంది అవ్వా తాతలకు ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో 89,324 మంది రెగ్యులర్ పింఛన్లు, 843 మంది హెల్త్ పింఛన్లు అందుకోనున్నారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. వీటితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మంగళవారం 61.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరుగుతోంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందించనున్నారు. ఇందుకోసం రూ.1,496.07 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా సొంత ఊరికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,87,442 మందికి కూడా ఈ నెల పింఛన్లను బకాయిలతో కలిపి అందచేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.