యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’
విజయవాడ : దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్‌నెస్ సరిగా ఉండటం లేదు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం. టోర్ణమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నాం’ అని రోజా తెలిపారు.
’100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని రోజా కోరారు.
శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ...
‘రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక ట్రెండ్‌ను సృష్టించారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు.
ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు చేరువయ్యేందుకు చేపట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు క్రీడల్లో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది.
గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించ నున్నారు. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది.
15ఏళ్లు పైబడిన వయసున్న బాలబాలికలు అందరిని పోటీలలో భాగస్వాముల్ని చేసేలా 'ఓపెన్ మీట్'ను పోటీలు చేపడుతున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు.సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
2.99 లక్షల మ్యాచ్‌లు..
తొలి దశ పోటీలలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడి విజేతలుగా నిలిచిన వారు తర్వాత మండల స్థాయిలో పోటీపడతారు. 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు.
వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉంటుంది. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా వేస్తున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు పోటీల్లో పాల్గొననున్నారు.