మాట నిలబెట్టుకుంటున్న సీఎం

6 Jun, 2019 12:50 IST

తాడేపల్లి: వైయస్‌ కుటుంబం ఇచ్చిన మాట తప్పదు. మాట తప్పని, మడమ తిప్పని కుటుంబంగా పేరుగాంచింది. సుమారు 14 నెలల పాటు పాదయాత్ర చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. వారి బాధలను విన్నారు. కష్టాలను కళ్లారా చూశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి ఆ బాధలు, ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తానని పాదయాత్ర సమయంలో ప్రజలకు వాగ్దానం చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్న కష్టాలు నేటికీ వైయస్‌ జగన్‌ మదిలో ఉన్నాయి. 2019 ఎన్నికల ఫలితాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మన కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలు ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో అఖండ మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించారు. 

30వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రాజన్న బిడ్డ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన జననేత ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని హామీ ఇచ్చారు. ఆరు నెలల సమయం కూడా కాదు.. బాధ్యతలు చేపట్టిన ఆరు రోజుల్లోనే ప్రజల ముఖ్యమంత్రి అని పేరుతెచ్చుకున్నారు. ఆయా శాఖలతో సమీక్షా సమావేశాలు జరిపిన సీఎం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వ్యవహరించాలని ఆదేశించారు. ఏ కష్టం వచ్చిన ప్రభుత్వం ఉందనే ధైర్యం కల్పించేలా ఉండాలని సూచిస్తున్నారు. 
 
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను... అంటూ ప్రమాణం చేసిన జననేత ప్రమాణస్వీకార వేదికపై నుంచే అవ్వాతాతల ఆశీస్సులు కోరుతూ పెన్షన్‌ రూ. 2,250 పెంచుతూ మొదటి సంతకం చేశారు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల ప్రకారం.. ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామ వలంటీర్లను నియమిస్తూ 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతి వరకు గ్రామ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేసి మరో లక్షా 60 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 

పాదయాత్ర ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకొక్కటిగా అమలు చేస్తున్నారు. శాఖల వారీగా సమీక్షా సమావేశంలో మొదట ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని, సర్కార్‌ బడులలో నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి శనివారం నో బ్యాగ్‌ డేగా వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన కార్మికులకు రూ. వెయ్యి ఉన్న వేతనాన్ని రూ. 3 వేలు పెంచారు.

గత ప్రభుత్వ హయాంలో చాలీచాలని జీతాలతో కాలం వెల్లదీస్తూ.. నెలల తరబడి వేతనాలకు నోచుకోక ఇబ్బందులు పడిన ఆశావర్కర్లకు రూ. 3 వేల గౌరవ వేతనాన్ని వైయస్‌ జగన్‌ ఏకంగా రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు అన్న వచ్చాడు.. వరం ఇచ్చాడు అంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేపట్టారు. 

వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేస్తానన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

రైతును రాజును చేస్తానన్న మాటను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలబెట్టుకుంటున్నారు. పాదయాత్రలో,  మేనిఫెస్టోలో, పలు సభల్లో రైతులకు పెట్టుబడి సాయం రూ. 12,500 ఇస్తానని హామీ ఇచ్చారు వైయస్‌ జగన్‌. ఇచ్చిన మాటకు కట్టుబడి అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందేలా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.