కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
అమరావతి: కేంద్రం మంజూరు చేసిన సంఖ్య మేర ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఉపాధి కూలీల పొట్టకొట్టింది. నోటిఫై చేసిన రోజువారీ కూలి కూడా ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్మాణాత్మక బలహీనతలకు తోడు నిధుల దుర్వినియోగమేనని ఎస్‌బీఐ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
⇒ 2024–25లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో 64.2 లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు 46.9 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపింది. అంటే, 17.3 లక్షల కూలీల కుటుంబాలకు నష్టం వాటిల్లింది.
⇒ దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే చెల్లించింది. ఒక్కో కూలీకి రూ.44 మేర చూస్తే 46.9 లక్షల కుటుంబాలకు తక్కువ చెల్లించింది.
⇒ ఓపక్క కేంద్రం మంజూరు చేసిన మేర ఉపాధి కల్పించకుండా 17.3 లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చిన బాబు సర్కారు మరోపక్క నోటిఫై చేసిన రోజువారీ వేతనం ఇవ్వకుండా కష్టార్జితాన్ని దోపిడీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
⇒ ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26) రోజువారీ ఉపాధి హామీ కూలిని రూ.307గా నోటిఫై చేశారు. డిసెంబర్ 29 వరకు డేటాను విశ్లేషిస్తే ఒక్కో కూలీకి రూ.268 మాత్రమే చెల్లించారు. నిర్దేశిత మొత్తానికి ఇది రూ.39 తక్కువ. దీనివల్ల 41 లక్షల కుటుంబాల శ్రమదోపిడీ చేసినట్లైంది.