లిక్కర్ మాఫియా డాన్ 'చంద్రబాబే’
అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు.
టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి...
సూత్రధారి, లబ్ధిదారు బాబే...
రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు
2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు.
మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్ లిక్కర్‌లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్ హౌస్, హై ఓల్టేజ్ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది.
మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్‌పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.
టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది.
చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది.
లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే...
2019–24 మధ్య వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది.
చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైయస్ఆర్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది.
చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.
విక్రయాలు పెంచిందెవరు?
మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైయస్ జగన్ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం.
వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం
తేల్చిచెప్పిన కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది.
బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టమవుతోంది.
అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైయస్ఆర్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..
⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా?
⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?
⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?
వైయస్ఆర్‌సీపీ హయాంలో..
⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది.
⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది.
⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది.
⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది.
⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది.
⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.