నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023–24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా, ఆంధ్రప్రదేశ్‌లో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే 90.5 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వార్షికాదాయ పరిమితిని పెంచారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.1 శాతం కటుంబాలకు, పట్టణాల్లో 85.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు సర్వే పేర్కొంది.