సీఎం వైయస్ జగన్ మానవత్వం..
అమలాపురం : బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు.
చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు.
ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం వైయస్ జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు.
దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు
అనంతపురం : సీఎం వైయస్ జగన్ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం వైయస్ జగన్ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు.
స్పందించిన సీఎం బాధితుడికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి సోమవారం బాధితుడికి అందించారు.