వరద బాధితులకు అండగా వైఎస్ జగన్

23 Nov, 2015 11:34 IST
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జననేత... అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చేరుకున్నారు. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారిని వైఎస్ జగన్‌ పరామర్శించారు. కుక్కల దొడ్డి గ్రామంలో రైతులతో మాట్లాడారు.  దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తాన్నారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు.


 శెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ కాలనీలో ఇటీవల గోడకూలి మృతి చెందిన ....బాలుడు హర్షవర్దన్(4) తల్లిదండ్రులు తిరుమల, కృష్ణవేణి దంపతులను  వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అలాగే మధ్యాహ్నం ఎస్.కొత్తపల్లి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధిత రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటారు. వైఎస్సార్ జిల్లాలో  పర్యటన పూర్తయిన అనంతరం  రోడ్డు మార్గాన వైఎస్ జగన్ నాయుడుపేట, నెల్లూరుకు బయలుదేరి వెళతారు. అక్కడ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను, బాధితులను పరామర్శిస్తారు. 

ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత గా వాళ్లకు అండదండలు అందించేందుకు వైఎస్ జగన్ ఎప్పుడు ముందు ఉంటారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయని తెలిసినప్పుడు పార్టీ శ్రేణుల్ని సహాయ చర్యల్లో నిమగ్నం చేశారు. రెండు రోజుల పాటు వరద ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.