బడ్జెట్ విప్పి చూడ తప్పులుండు..!
10 Mar, 2016 23:22 IST
() బడ్జెట్ లో అంకెల గారడీ
() మొత్తం పద్దులన్నీ అభూత కల్పనలు
() పొంతన లేని పాయింట్లు
హైదరాబాద్) వార్షిక బడ్జెట్ మొత్తం అభూత కల్పనలతో నిండిపోయింది. వివిధ కీలక శాఖలకు చేయవలసిన కేటాయింపుల్లో కోతలు పెట్టి, దుబారా ఖర్చులకు ఊతం ఇస్తున్నట్లుగా లెక్కలు చూపించారు. బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప వృద్ది మాత్రం పెరగటం లేదు.
వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయని బడ్జెట్ లో చూపించారు. కానీ వ్యవసాయ వృద్ది పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇది ఎంత వరకు సాధ్యం. అంటే ఉత్పత్తులు తగ్గినప్పుడు రాబడి తగ్గటం సహజం. అటువంటప్పుడు వృద్ది ఎలా సాధ్యం అవుతుంది. వ్యవసాయదారులకు చేయాల్సిన సాయం గురించి స్పష్టమైన వివరణ లేనే లేదు.
రుణమాఫీ కి కేటాయించిన నిధుల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మూడున్నర వేల కోట్ల రూపాయిలు కేటాయించి చాలా చేశాం అన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు మొత్తం రూ. 87 వేల కోట్ల పైగా అప్పులు పేరుకొని ఉంటే దానికి అపరాధ రుసుంతో అయిన వడ్డీ రూ. 24 వేల కోట్ల రూపాయిలకు చేరింది. మరి అటువంటప్పుడు బడ్జెట్ లో రూ. మూడున్నర వేల కోట్లు అంటే వాటితో ఏం చేసుకోవాలి. మొత్తం వడ్డీలో అయిదో వంతు కూడా లేని పరిస్తితుల్లో రుణమాఫీ ఎలా సాధ్యం అవుతుంది.
ముఖ్యంగా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక తీరుగా ఉంటే చేస్తున్న కేటాయింపులు మరో విధంగా ఉన్నాయి. బీసీలు, కాపులకు చేసిన కేటాయింపులు చాలినంతగా లేవని ఆయా వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లేనివన్నీ ఉన్నట్లుగా చూపేందుకే బడ్జెట్ తాపత్రయ పడింది తప్పితే ఏమాత్రం వాస్తవాలు ప్రతిబింబింప చేయలేకపోయింది.