విజయమ్మకు నల్లగొండ బ్రహ్మరథం

12 Nov, 2012 11:00 IST
 
నల్లగొండ: దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని నల్లగొండ  ప్రజలు చూపెట్టారు. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా  సూర్యాపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వై.యస్.విజయమ్మకు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరిన విజయమ్మకు జిల్లా సరిహద్దులోని కొత్తగూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో నిలబడి విజయమ్మ కోసం ఎదురు చూశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఆమె చేయి ఊపుతూ అభివాదం చేశారు. చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి తదితర చోట్ల పెద్ద సంఖ్యలో విజయమ్మను చూడటానికి జనం ఎగబడ్డారు.

వెల్లువెత్తిన జనం

పార్టీ నేతలు, సభ నిర్వాహకులకు ఊహించిన దానికంటే జనం భారీగా హాజరయ్యారు. సభలో స్థానిక నాయకులు ప్రసంగిస్తున్న సమయంలోనే విజయమ్మ సాయంత్రం 5 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. తమకందరికీ కనిపించాలని సభాప్రాంగణంలో ఒక వైపు నుంచి కేకలు వేయటంతో విజయమ్మ వేదికంతా కలియ తిరుగుతూ సభా ప్రాంగణంలో అన్ని వైపులా ప్రజలకు అభివాదం చేసి ఉత్సాహం నింపారు. ఆమె ప్రసంగిస్తున్నంత సేపూ సభికుల నుంచి మంచి స్పందన కనిపించింది. వైయస్ఆర్ పేరునూ, వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి పేరును ప్రస్తావించిన ప్రతి సందర్భంలో సభలో పెద్ద పెట్టున నినాదాలు వినిపించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరును ఆమె ఎండగట్టినప్పుడు, చంద్రబాబు వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడు కూడా సభకు హాజరైన జనం నుంచి స్పందన వచ్చింది. విజయమ్మ ప్రసంగం సాగున్నంత సేపూ బాణాసంచా పేలుళ్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. జైజగన్ నినాదాలతో దద్దరిల్లింది. విజయమ్మ సభ విజయవంతం కావటం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీకి బాగా ఉపయోగపడే అంశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.