రెండు పార్టీలలో కలకలం
ఒకే రోజు రెండు పార్టీలు... రెండు దెబ్బలతో విలవిలలాడిపోయాయి. సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ పార్టీనీ, పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీకీ గుడ్‌బై చెప్పేశారు.
ఇటీవలి కాలంలో దెబ్బ మీద దెబ్బ తింటున్న తెలుదేశం పార్టీ చెంగల నిర్ణయంతో కంగు తింది. అక్టోబరు 15వ తేదీన తాను వైయస్ఆర్ సీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మే ఉప ఎన్నికలలో పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీనికి సొంత పార్టీ నేతలే కారణమని చెంగల ధ్వజమెత్తారు. పదమూడేళ్ళపాటు ఎంతో నమ్మకంగా పనిచేసిన తనకు తెలుగుదేశం పార్టీలో అవమానమే బహుమతిగా లభించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో వైయస్ జగన్‌మోహనరెడ్డిపై చెంగల ప్రశంసల వర్షం కురిపించారు. ఇటాలియన్ మహిళను ఎదిరించిన ఒకే ఒక ధీరుడు ఆయనని కితాబిచ్చారు.
మరోవంక, సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆశించారు. ఇటీవలి కాలంలో ఆయన స్వరం మారింది. అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరతారని ఊహాగానాలు వినిపించాయి. శనివారం నాడు నల్గొండ జిల్లా భువనగిరిలో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న వైయస్ఆర్ సీపీలో చేరతానని చెప్పారు. వైయస్ హయాంలోనే అందరూ లబ్ధిపొందారని తెలిపారు. కిరణకుమార్‌కు పాలనాదక్షత లేదని ఆయన ధ్వజమెత్తారు.