రాజన్న బిడ్డకు అభిమానజనం బ్రహ్మరథం

18 Feb, 2013 11:09 IST
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : మహానేత రాజన్న బిడ్డను చూసేందుకు అభిమానజనం ప్రభంజనమైంది. మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మిర్యాలగూడ నుంచి ఈదులగూడెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకు ఇరుపక్కలా ప్రజలు బారులు‌ తీరారు. బహిరంగ సభ జరిగిన రాజీవ్‌చౌక్ వద్ద ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. 'జై జగన్, జై వై‌యస్‌ఆర్‌' అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన శ్రీమతి షర్మిల వెంకటాద్రిపాలెం చేరుకునే సరికి భారీ సంఖ్యలో మహిళలు ఎదురు వచ్చి కలిశారు. దారి పొడవునా మహిళలు, ఇంజనీరింగ్ విద్యార్థులు‌ శ్రీమతి షర్మిలతో కలిసి నడవడానికి పోటీపడ్డారు. మధ్యాహ్నం దుర్గానగర్‌లో మొదలైన పాదయాత్ర జనంతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. సాగర్ రోడ్డు, హనుమా‌న్‌పేటలో మహిళలు రోడ్డుకు అడ్డుగా నిలిచి మరీ శ్రీమతి షర్మిలను కలుసుకున్నాక కానీ వెనుదిరగలేదు. శకుంతల థియేటర్ సెంట‌ర్, బస్టాండు సర్కి‌ల్, గణే‌ష్ మార్కె‌ట్, రాజీ‌వ్‌చౌక్‌లో ఎటు వైపు చూసినా జనమే జనం.

మిర్యాలగూడ ప్రజల నుంచి అఖండ స్వాగతం పొందిన శ్రీమతి షర్మిల అదే ఉత్సాహంతో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ వైఫల్యాన్ని, కిరణ్ సర్కారు చేతగానితనాన్ని, చంద్రబాబు‌ నిస్సిగ్గు శైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అకాల వర్షానికి పత్తి తడిచి నష్టం జరిగిందని దామరచర్ల మండలానికి చెందిన పత్తిరైతులు గోడు వెళ్లబోసుకున్నారు. తడిచిపోయిన పత్తిని తీసుకువచ్చి శ్రీమతి షర్మిలకు చూపించారు. 

మిర్యాలగూడ బహిరంగ సభకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా కన్వీన‌ర్ బీరవోలు సోమిరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.‌ పార్టీ సీఈసీ సభ్యురాలు పాదూరి కరుణ మన ఆడబిడ్డకు కట్నంగా మిర్యాలగూడ సీటు గెలిపించి ఇవ్వాలని సభకు హాజరైన వారిని కోరారు. ఇదే వేదికపై జెడ్పీ మాజీ సీఈవో, సూర్యాపేటకు చెందిన పి.వెంకటయ్య పార్టీలో చేరారు.

‌ఈ పాదయాత్రలో స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎర్నేని వెంకటరత్నం బాబు, జిల్లా ప్రచార కార్యదర్శి కేఎల్ఎ‌న్ ప్రసా‌ద్, పార్టీ నియోజకవర్గ నాయకులు గడ్డం స్ప్రూధ‌ర్‌రెడ్డి, ఎం.డి. ఖాసిం, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అలక శ్రవ‌ణ్‌రెడ్డి, మైనారిటీ సెల్ కన్వీన‌ర్ ఎం‌.డి. సలీం, ఎస్సీ సెల్ కన్వీన‌ర్ ఇరుగు సునీ‌ల్ కుమా‌ర్, మహిళా విభాగం కన్వీన‌ర్ సూరేపల్లి సత్యకుమారి, విద్యార్థి విభాగం కన్వీన‌ర్ పర్వతం వేణు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కుంభం శ్రీనివాసరెడ్డి, పిట్ట‌ రాంరెడ్డి, ఇంజం నర్సింరెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్, పార్టీ నాయకులు చింత బాబు మాదిగ, కమతం వెంకటయ్య, కాటంరెడ్డి రాంరెడ్డి, పడిగెపాటి విక్రాంత్‌రెడ్డి, కేమిశెట్టి భీమరాజు పాల్గొన్నారు.