పండగపూట పస్తులే..!

16 Oct, 2015 14:28 IST
ధరల కట్టడిలో విఫలమైన ప్రభుత్వం..!
మంటెత్తిస్తున్న పప్పుల ధరలు..!

పండగవేళ పప్పుధరలు మంటెత్తిస్తున్నాయి. దీంతో, సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎంతసేపు చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో రాజధానిలో చేయబోయే పండగ గురించి ఆలోచిస్తున్నారే గానీ, ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా పప్పుధాన్యాల ధరలు ఆకాశన్నంటాయి. పండగ పూట పిండివంటల సంగతి దేవుడెరుగు కనీసం పప్పన్నం కూడా తినలేని పరిస్థితి దాపురించింది. పైపైకి ఎగబాతున్న ధరలతో పేదప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జేబులు చిల్లులు చేసుకున్నా రెండు ముద్దలకు కూడ సరిపడా పప్పు ధాన్యాలు రావడం లేదు.

చోద్యం చూస్తోన్న ప్రభుత్వం..!
నెలరోజుల వ్యవధిలో రెట్టింపైన ధరలు సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కిలో చికెన్ తో  పోలిస్తే పప్పుధాన్యాలు రెండింతల ధర పలుకుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐనా చంద్రబాబు ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందామన్న పాలసీయే తప్ప...ప్రజలకు మేలు చేసే పాలన సాగించడం లేదు. శరీరంలో ప్రధాన పాత్ర వహించే పప్పుల సరఫరాపై దృష్టిసారించి, సామాన్యులకు అందుబాటులో ఉంచడంలో పచ్చసర్కార్ ఘోరంగా విఫలమైంది. 

ధరలు దిగకపోతే పస్తులే..!
మార్కెట్లో ముచ్చెమటలు పట్టిస్తున్న పప్పుధరలు నెలరోజుల్లో... కిలో కందిపప్పు రూ. 140 నుంచి రూ.200కి పెరిగింది. రూ.135 ఉన్న మినప్పప్పు  ప్రస్తుతం రూ.185 పలుకుతోంది. రూ.110  ఉన్న ఎండుమిర్చీ ఇప్పుడు రూ. 140కి చేరింది. శరీరానికి మెండుగా మాంసకృత్తులను అందించే పప్పుధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడంపై మండిపడుతున్నారు. ధరలను కట్టడిచేయకపోతే పండగపూట పస్తులు ఉండక తప్పదని వాపోతున్నారు.