పచ్చపాలన పైత్యం..శాఖల్లో వింత రోగం..!

28 Oct, 2015 17:03 IST
రాష్ట్రంలో పచ్చప్రభుత్వం పరిపాలన ఘనకీర్తిని చాటుకుంటోంది. ప్రజలను ఎలుకలు, పందికొక్కులతో కరిపించడం, రైతుల పంటపొలాలు తగలబెట్టడం సహా అనేక విషయాల్లో పచ్చచొక్కాల పైశాచికానందం గురించే చర్చించుకుంటున్నారు. చంద్రబాబు, మంత్రుల పనితీరు చూడతరమా..!
 

వ్యవసాయశాఖ..
రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం, భూములివ్వని రైతులను బెదిరింపులకు గురిచేస్తూ పంటపొలాలు తగలబెట్టడం. రుణమాఫీ చేయకుండా రైతుల ప్రాణాలను గద్దల్లా తన్నుకుపోవడం లాంటి కార్యక్రమాలతో దేశంలోనే తనపాటి వ్యవసాయ శాఖ లేదని చాటుకుంటోంది టీడీపీ ప్రభుత్వం.  

నీటి పారుదల శాఖ..
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి చేసేది లేదు. కొత్త ప్రాజెక్ట్ లు కట్టేది లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కట్టించిన ప్రాజెక్ట్ లను తమవిగా చెప్పుకోవడం. లంచాలు, కమీషన్ల కోసం అక్రమంగా ప్రాజెక్ట్ లను పుట్టించడం. ఇది చంద్రబాబు నీటిపారుదల శాఖ స్పెషల్. చెంబెడు నీళ్లు పోసి అనుసంధానం చేశామని చెప్పుకోవడమైనా, చంద్రబాబు, కరువు కవలలుగా మారి రైతుల ప్రాణాలు తీయడమైనా, చుక్కనీరు ఇవ్వకుండా ప్రజల కళ్లలో కన్నీళ్లు పుట్టించడమైనా ఒక్క తెలుగుదేశానికి మాత్రమే సాధ్యమని నిరూపిస్తున్నారు.  

కార్మిక శాఖ...
పెట్టుబడుల పేరుతో దేశాలు తిరుగుతాం. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ పెట్టకుండానే  పైసలు పోసి ప్రపంచ ర్యాంకులు ఇప్పించుకుంటాం. ఇక ఇప్పటికే  రాష్ట్రంలో ఉన్న అనేక పరిశ్రమలను మూసివేయించాం. కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశాం. ఇలాంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని కార్మికమంత్రి తన పరిపాలన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు.

విద్యాశాఖ..
యూనివర్సిటీలు, కాలేజీల్లో ర్యాగింగ్ లను ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రాణాలు తీయించడం. నిందితులను కాపాడడమే తమ అభిమతమని విద్యాశాఖ గంటా భజాయిస్తోంది. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఆక్రెడిట్  ఒక్క టీడీపీకే దక్కుతుందని చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతిని గంగలో కలిపేశాం. ఇక ఇంటికో ఉద్యోగం పీకేస్తున్నాం.  బాబు వచ్చాడు జాబులు పోయాయని చెప్పుకునేలా తమ పాలన ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. 

వైద్య, ఆరోగ్యశాఖ..
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తాము సరికొత్త వైద్యం అందిస్తున్నాం. ప్రజలు ఆస్పత్రికి రావాలంటేనే భయపడేలా, ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు గాల్లో కలిపేలా అధునాతన వైద్యం అందిస్తున్నామంటోంది వైద్య,ఆరోగ్య శాఖ.  ప్రభుత్వాసుపత్రుల్లో రోగులను ఎలుకలు, పందికొక్కులతో కొరికి చంపించడం తమకు మాత్రమే చెల్లిందని చెప్పుకుంటోంది .. అంతేకాదు పేదల వరప్రదాయినిగా ఉన్న ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ కు చేతుల్లో పెట్టి నిరుపేదలపై తమకున్న ప్రేమ ఏపాటిదో చాటుకుంటున్నారు.

పౌరసరఫరాల శాఖ..
సామాన్య ప్రజానీకానికి నిత్యవసల వస్తుల ధరల మంటలు పుట్టిస్తాం. పప్పు అన్నం కాదు కదా పచ్చడి మెతుకులకు కూడా నోచుకోకుండా చేస్తామంటోంది పౌరసరఫరాల శాఖ. తాము బంగారు పల్లాల్లో పంచభక్ష పరమాన్నం భోంచేస్తాం. మీకు మాత్రం పస్తులుంచబెడతామని పౌరసరఫరాల శాఖ అంటోంది. కందిపప్పు కాకపుట్టించినా, ఉల్లి ఏడిపించినా, కూరగాయల ధరలు కొండెక్కినా ఇలా ఎందెందు చూసిన పచ్చమార్క్ ఉంటుందంటున్నారు. 

హోంశాఖ...
పోలీసులను  ప్రజల మీదికి ఉసిగొల్పి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతాం. అన్యాయంపై నిలదీసిన విద్యార్థులను ఈడ్చిపారేస్తాం. నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. తమ అవినీతి పాలనకు అడ్డొస్తే లాఠీలు విరిగేలా కుళ్లపొడుస్తామని హోంశాఖ తన బుద్దిని బయటపెట్టుకుంటోంది.  ఇలా ప్రతిశాఖలో పచ్చసర్కార్ తమదైన మార్క్ రాజకీయాలు చేస్తూ ప్రజలపై బుసకొడుతోంది. ప్రజలను అవస్థలకు గురిచేయడమే ధ్యేయంగా  అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు అండ్ కోను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.