నేరం నాది కాదు, నిధుల బాధ్యత నాకు లేదు బాబు

22 Aug, 2018 16:02 IST

అన్నీ కలిసొస్తే అంతా నా ప్రతిభ...అడ్డం తిరిగితే ఫలితం నీ ఖర్మ .... ఇది చంద్రబాబు సిద్ధాంతం. రాష్ట్రానికి ర్యాంకులొచ్చాయని చెప్పుకునేటప్పుడు అంతా తన ప్రతిభే అని చెప్పుకుంటాడు చంద్రబాబు. పరిపాలనా లోపాలు బైటపడ్డప్పుడు మాత్రం అధికారులదే ఆ తప్పంతా అని నెపాన్ని వాళ్లపైకి నెట్టేస్తాడు. 
కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వచ్చేసాయి. ఇంక వచ్చేందుకేమీ లేవు అన్నారు ముఖ్యమంత్రి గారు. అంతేనా అన్ని రాష్ట్రాల కంటే మనకే ఎక్కువిచ్చారని కూడా శెలవిచ్చారు. నిన్నటిదాకా మోదీ మొండిచెయ్య చూపారు, అన్యాయం చేసారు అన్నారు. ఇవ్వాళ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులు, మంత్రులదే తప్ప నాది కాదు అని చేతులు దులిపేసారు. కేంద్ర శాఖలో సమన్వయం చేసుకూంటూ నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ మత్రులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ లో స్పష్టం చేసారు బాబుగారు. 
నిధులు ఎన్నెన్ని ఎంత కోతలు పడ్డాయో చెప్పి అవన్నీ వచ్చేలా చూడండి అంటూ ఆదేశించారు. పనిలో పనిగా ప్రజల్లో సంతృప్త స్థాయిని, రాష్ట్ర వృద్ధి రేటును పెంచేయాలని హుకుం జారీ చేసారు. పని చేసేవాళ్లకు పోస్టులు చేయనివాళ్లను చైతన్యపరచడం అవసరం అని అభిప్రాయపడ్డారు. సిఎమ్ టెలికాన్ఫరెన్స్ లు ఎందుకూ పనికిరాకుండా ఉయ్యాన్ని ఆ పార్టీ నేతలు లోలోపలే గొణుక్కుంటున్నారు. జెసి అయితే పబ్లిక్ గా చంద్రబాబు ముందే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసాడు కూడా. అయినా బాబుగారి చెవికి ఇవి ఎక్కుతాయా? 
మొత్తానికి నాలుగేళ్లుగా నిధులు రాకపోవడానికి తనకూ ఏ సంబంధం లేదని ప్రకటించేశారు ముఖ్యమంత్రిగారు. కేవలం అధికారుల, ఆయా శాఖా మంత్రుల అలక్ష్యం, చేతగానితనం వల్లే కేంద్రం నిధులు విడుదల జాప్యం అవుతోందని రూఢీ చేసారు. సమన్వయ లోపాన్ని సరి చేసుకుని అధికారులు కేంద్రం నించి నిధులు తెచ్చుకోవాలి తప్ప ఇకపై ఎవ్వరూ కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ముఖ్యమంత్రిగార్ని అడగొద్దు అన్నది ఈ టెలీకాన్ఫరెన్స్ సారాంశం. ఈ సందేశం అధికారులకే కాదు మీడియాకి, తెలుగు ప్రజలకీ కూడా అన్నమాట.