డబ్బు, అధికారమే గెలిచింది

28 Aug, 2017 15:32 IST
– ప్రలోభాలతో ప్రజలను భయభ్రాంతులను చేసిన టీడీపీ
– నంద్యాలలో చంద్రబాబు అధికార దుర్వినియోగం 
– మంత్రులు, ఎమ్మెల్యేలను పంపి ఓటర్లకు బెదిరింపులు
-విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిన వైనం 

ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే హవా కొనసాగుతుందని మరోసారి నిజమైంది. డబ్బు, అధికారం ఉంటే ప్రజలను ఏ విధంగానైనా  భయాందోళనకు గురి చేసి విజయం సాధిస్తామని నంద్యాల ఎన్నిక ద్వారా చంద్రబాబు మరోసారి నిరూపించారు. ప్రలోభాలు, బెదిరింపులతో టీడీపీ విజయం సాధించింది తప్ప ....ప్రజల అభిమానంతోనో, లేక  చంద్రబాబు మీద నమ్మకంతోనో ప్రజలు ఓటేసారనుకుంటే పొరపాటే. ఓటేసిన ప్రతి నంద్యాల ఓటరుకీ అది తెలుసు. ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపుల పర్వానికి తెరలేపారు. ఓటుకు 5 వేలిస్తా.., నేనిచ్చిన పింఛన్లు తీసుకోవద్దని బెదిరించిపోయారు. కాదు కాదు.. పార్టీ నాయకులకు దారి చూపించి పోయారు. ముఖ్యమంత్రినైన నేనే ఓటర్లను బెదిరించాను.. మీరు కూడా నా దారిలో నడిచి ప్రజలను బెదిరించి.. డబ్బులతో ప్రలోభ పెట్టి విజయం సాధించుకు రండి అని దిశానిర్దేశం చేశారు. జనరల్‌ ఎన్నికల్లో పది నియోజకవర్గాల కోసం పెట్టిన ఖర్చును ఒకే ఒక్క నంద్యాల కోసమే టీడీపీ ఖర్చు చేసింది.

అభివృద్ధి పేరుతో విధ్వంసం
‘మేం అభివృద్ధి మొదలు పెట్టాం. కొనసాగాలంటే మీరు టీడీపీనే గెలిపించాలి. టీడీపీ అభ్యర్థి ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది’ ఇదీ.. చంద్రబాబు చేయించిన విష ప్రచారం. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఇంకెవరు పనిచేస్తారు. 2014లో వారిని ప్రజలు గెలిపించింది అందుకే కదా. ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టకపోయుంటే ఆ మాత్రం అభివృద్ధి కూడా జరగకపోయేదని ఎవరూ కాదనలేని వాస్తవం. ఒకే ఒక్క ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలో అన్ని పనులు పక్కన పెట్టి మంత్రివర్గం మొత్తాన్ని, వంద మంది ఎమ్మెల్యేలను నంద్యాల్లో మోహరించింది అధికార పార్టీ. మూడేళ్లుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కనపెట్టి కేవలం నెల రోజుల్లో హడావుడిగా జీవోలు తీసుకొచ్చి దాదాపు 1500 కోట్లు అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. ఏళ్లుగా ట్రాఫిక్‌ సమస్యతో నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా...  నంద్యాల ఎన్నికలు రావడంతోనే రాత్రికి రాత్రే ఇళ్లు కూలగొట్టడం.., 13 వేల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం వంటి ప్రలోభాలతో ఓటర్లను బుట్టలో పడేశారు. ప్రజలను కులాల వారీగా విభజించి కుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఓట్లు అభ్యర్థించిన ఘనత చంద్రబాబుది. 

కార్యకర్తల కృషి అభినందనీయం
గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఒకింత నంద్యాల ఓటమితో నిరుత్సాహానికి గురై ఉండొచ్చుగాక.. అధికార పార్టీ గుండెల్లో వణుకు పుట్టించడంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, జగన్‌ అభిమానుల కృషి అనిర్వచనీయం. ఎంతోమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి నంద్యాల ప్రచారంలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇది నిజంగా శుభపరిణామం. పార్టీకి ఆయువు పట్టులాంటి కార్యకర్తల కృషి ఫలితంగానే.... టీడీపీ డబ్బును మంచినీళ్ల కంటే దారుణంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అపజయాలను స్పోర్టీవ్‌గా తీసుకునేవాడికి పరాజయం కూడా విజయానికి మెట్టులాంటిదే. ఆ స్ఫూర్తి వైయస్సార్సీపీకి మెండుగా ఉంది.