కళ్లుండి చూడలేక..చెవులుండి వినక
23 Jul, 2018 14:35 IST
దృతరాష్ట్రుడికి వారసులైతే ఎట్లా?
పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి తల్లడిల్లిపోతూ...తలకిందులైపోతుంటే..జగన్ ఎక్కడ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు అమరావతిలో కూర్చుని ప్రశ్నించారు. నిజంగా ఈ నాలుగేళ్ల కాలంలో అవిశ్వాసం పెట్టడానికి దారిచూపింది...వైయస్ జగన్ కాదా? నిజాన్ని కనలేని, వినలేని మీకు ’ప్రత్యేకహోదా’ ప్రాధాన్యతను అరటిపండు వలిచిచెప్పినట్టుగా, అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు విపక్షనాయకుడు వినిపించలేదు. కళ్లు తెరిపించాలని ప్రయత్నించలేదు. ఆందోళనలు, నిరాహారదీక్షలు, బంద్‌లు నిర్వహించలేదు. పార్లమెంటులోనే ప్రత్యేకహోదాపై కేంద్రవైఖరికి నిరసనగా పార్లమెంటులో అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఇమ్మని నోటీసులు ఇవ్వలేదు. అందుకు అవకాశం రాకపోతే..వైసీపీ ఎంపీలు రాజీనామా చేయలేదా? ఢిల్లీలోనే అమరణ నిరాహారదీక్షకు కూర్చోలేదా?
ఇంతగా ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగా వుంచిన వైఎస్‌జగన్...ఎక్కడ? ఎక్కడ? అని కలవరపడిపోయిన చంద్రబాబుగారు, ఆయన అంతేవాసులు...ప్రజాప్రయోజనాలకు సంబంధించి విపక్షనాయకుడు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిసారి అధికారపక్షం ఎలా అడ్డుకుందో? ఎలా ఎకసెక్కాలతో సభను పక్కదారి పటించిందో ఐదుకోట్లమంది ప్రజలు చూడలేదా? వినలేదా?
ఎల్లకాలం ఒకేరకంగా వుండదని, ప్రజలెప్పుడూ మోసపోతూనే వుండరన్నదానికి నిన్న జనసేన అధ్యక్షుడి రాజధాని ప్రజాసమావేశమే సాక్ష్యం. జగన్ అసెంబ్లీలో మాట్లాడకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయడంపై విరుచుకపడాలని ప్రయత్ని స్తే, సభలోని జనమే..ఆయన్ను ఎక్కడ మాట్లాడించారంటూ? పవన్‌గారినీ నిలదీయలేదా? అయినా మాట్లాడాల్సిందే నంటూ తనదైన గబ్బర్‌సింగ్ డైలాగులు పవన్ కొట్టలేదా?