ఇక్కడిలా...అక్కడలా! ఎందుకిలా?
11 Oct, 2012 06:33 IST
సోనియా కాంగ్రెస్ రెండు నాల్కల రాజకీయ డ్రామా
ద్వంద్వ వైఖరులు, రెండునాల్కలు, పొసగని వాదనలు, కాంగ్రెస్ పార్టీకే చెల్లు! సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే వైయస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై మోపిన కేసులు పూర్తిగా కుట్రపూరితమేనని తేటతెల్లం కాక మానదు. సోనియాతో విభేదించి బయటకు వచ్చిన నేరానికి గాను జగన్మోహన్‌రెడ్డిని కేసులతో వెంటాడి, వేటాడడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వేధింపుల రాజకీయం తాజా వాద్రా వ్యవహారంతో బట్టబయలవుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు అనుచిత, అక్రమ లబ్ధి చేకూర్చేందుకు హర్యానా ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ దిగ్గజమైన డిఎల్ఎఫ్ (ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్) కు ఏజెంటులాగా వ్యవహరించిందని ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు రుజువులుగా ఆయన పలు డాక్యుమెంట్లను కూడా విడుదల చేశారు.
ఒక హాస్పిటల్ కోసం ఉద్దేశించిన 30 ఎకరాల భూమిని సైతం హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్‌కు సెజ్ నిమిత్తం కేటాయించిందని ప్రతిఫలంగా డిఎల‌్ఎఫ్ రాబర్ట్ వాద్రాకు హామీ లేని 'రుణం' అందించిందనీ, తన ప్రాజెక్టులలో వాటా ఇచ్చిందని దీని ద్వారా వాద్రాకు రూ.500 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని, వాద్రా డిఎల్ఎఫ్‌లో 50 శాతం వాటా పొంది ఏడాది గడవగానే దానిని అదే కంపెనీకి విక్రయించారని కేజ్రీవాల్ వివరించారు. రూ.1,700 కోట్లు విలువజేసే 350 ఎకరాల సెజ‌్ కాంట్రాక్టు కోసం జరిగిన అంతర్జాతీయ బిడ్డింగ్‌లో మరో రెండు కంపెనీలు (యూనిటెక్, కంట్రీహైట్స్) కూడా పాల్గొన్నా వాటికి సరిపడా అనుభవం లేదన్న సాకుతో దానిని డిఎల్ఎఫ్‌కు అప్పంగించారని, ఇదంతా క్విడ్ ప్రో కో (పరస్పర లబ్ధి) కిందకే వస్తుందన్నది ఆయన వాదన.
హర్యానా ప్రభుత్వం ద్వారా నిబంధనలకు నీళ్లొదిలి డిఎల్ఎఫ్‌కు లబ్ధి చేకూర్చినందుకు గాను సోనియా అల్లుడు వాద్రాకు సదరు కంపెనీ ముడుపుల రూపంలో కోట్లాది రూపాయలు ముట్టజెప్పుకుందన్నది ఆయన ఆరోపణల సారాంశం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ వద్ద నమోదైన సమాచారం ప్రకారం వాద్రాకు చెందిన రియల్ ఎర్త్ ఎస్టేట్స్కు డిఎల్ఎఫ్ రూ.5 కోట్ల రుణం హామీ లేకుండా ఇచ్చింది. అంతేకాదు, వాద్రా కంపెనీ మరో కంపనీ స్కైలైట్ హాస్పిటాలిటీకి డిఎల్ఎఫ్ 2008-09లో రూ.58 కోట్లు విలువైన భూమిని కొనుగోలు చేసేందుకు రూ.50 కోట్లను అడ్వాన్స్‌గా ఇచ్చింది.
వాద్రాకు మంత్రుల వకాల్తా!
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దీనిపై స్పందిస్తూ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలపై దర్యాప్తు కుదరని తేల్చిపారేశారు. యుపిఎ చైర్‌పర్సన్ హోదాలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా) ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉన్న సోనియాగాంధీకి అల్లుడైన వాద్రా అవినీతి వ్యవహారం ప్రైవేటు వ్యవహారమా! దానిని సమర్థించడానికి చిదంబరం, వీరప్ప మొయిలీ, సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్‌శర్మ వంటి కేంద్రమంత్రులు కట్టగట్టుకుని నిర్లజ్జగా వకాల్తా పుచ్చుకున్న తీరు విస్మయానికి గురిచేయక మానదు.
నకారాత్మక ధోరణిలోని అవినీతి ఆరోపణలు దేశం పరువును దిగజార్చుతాయనీ సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అక్టోబర్ 10 నాటి సిబిఐ, ఎసిబిల సమావేశంలో వాపోయారు. 'వాద్రాగేట్' పై విచారణ అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. మరో వైపు క్విడ్ ప్రో కో పేరుతోనే జగన్మోహన్‌రెడ్డిని కేసులతో వేధిస్తున్నతీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్ రావుతో ఒక లేఖ రాయించి, హై కోర్టు ఆదేశాల పేరుతో ఆగమేఘాలపై సిబిఐ దర్యాప్తునకు దిగి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. శంకర్‌రావు లేఖ రాయగా, టిడిపి నాయకులు అందులో ఇంప్లీడ్ అయ్యారు. శంకర్‌రావు పిటిషన్‌లోని అంశాలు కూడా అంతకు ముందు యెల్లో మీడియాలోనివే. ఇద్దరికీ టార్గెట్ ఒక్కరే. కాంగ్రెస్, టిడిపిల కుమ్మక్కుకు ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా?
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన నేపథ్యంలో గుండె పగిలి కన్నమూసిన అభిమానుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తానంటూ నల్లకాలువ సభలో జగన్మోహన్‌రెడ్డి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తే, అది కిట్టని వ్యతిరేకవర్గం కుట్రలు చేసింది. అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారంటూ వేధింపులకు గురి చేసింది.ఈ మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఓదార్పు యాత్రను కొనసాగించిన జగన్‌కు లభించిన అశేష ప్రజాదరణ చూసి కన్నుకుట్టిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం సిబిఐని తురుపుముక్కలా ప్రయోగించడానికి కక్ష కట్టి తెరవెనుక రాజకీయానికి దిగింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే దర్యాప్తు అని చెబుతున్నప్పటికీ హైకోర్టులో జరిగిందేమిటో తెలిసిందే.
ప్రాథమిక విచారణ నివేదికను జగన్మోహన్‌రెడ్డి న్యాయవాదులకు ఇవ్వాలన్న సుప్రీం సూచనలకు భిన్నంగా - 'చూసి' ... 'సీల్' చేసేశామని చెప్పి నాటి చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత రిటైర్ అయిన కక్రూను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించారు.
మరోవైపు హైకోర్టు ఆదేశాలు జారీ అయన 48 గంటలలోపే 30 బృందాలతో సిబిఐ విరుచుకుపడింది. హడావుడి దాడులకు పూనుకుంది. 2 జీ, కోల్ గేట‌్ కుంభకోణాలలోనూ ఇంత దూకుడు లేదు! అంతేకాదు, కోర్టుకు హాజరు కానున్న జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ ప్రశ్నించడానికి పిలిచి, అరెస్టు చేసి కోర్టు గౌరవాన్ని కూడా భంగపరిచింది. లీకులతో సిబిఐ అధికారులు అనైతిక చర్యలకూ పాల్పడ్డారు. తెర వెనుక 'పెద్దల' ఆదేశాల మేరకు భయభ్రాంతులకు గురిచేసే రీతిలో ప్రవర్తిస్తూ, కనీస మానవ హక్కులకు కూడా జగన్మోహన్‌రెడ్డి నోచుకోకుండా చేశారు. ఉప ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వ దాష్టీకానికి గుణపాఠం చేబుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తమ ఆదరాభిమానాలను ఓట్ల రూపంలో ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వైఖరి మారలేదు. టిడిపి ధోరణిలో మార్పు లేదు.
జగన్‌కు బెయిల్ కూడా రాకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చే ఒక రోజు ముందు ఇడితో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం వాద్రా విషయంలో మాత్రం ' ప్రైవేటు వ్యక్తుల మధ్య లావాదేవీల' వాదాన్ని తెర మీదికి తెచ్చింది. ప్రజాకర్షణ కలిగిన రాజకీయ నాయకుడు కూడా అయిన జగన్మోహన్‌రెడ్డికి మాత్రం ఈ వాదం ఎందుకు వర్తించదు? జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట‌్ వంటివన్నీ ప్రైవేటు లావాదేవీలే కదా! అక్కడ క్విడ్ ప్రో కో వర్తించినప్పుడు, వాద్రాకు కూడా అదే తర్కం ఎందుకు వర్తింపజేయరు?
అంతేకాదు, వివాదాస్పద జీఓలను విడుదల చేసిన తతిమ్మా మంత్రులంతా (ఒక్క మోపిదేవి మినహా) ఇంకా ప్రభుత్వంలోనే భేషుగ్గా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కేసులో వారికి న్యాయసహాయం కూడా చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.
'క్విడ్ ప్రో కో' నిజమేనా?
'క్విడ్ ప్రో కో' నిజమే అయితే ఆ జీఓలు జారీ చేసిన మంత్రులు మాత్రం దోషులు కాకుండా, ప్రైవేటు వ్యక్తులలో ఒకరైన జగన్ మోహన్‌రెడ్డి మాత్రం ఎ1 ఎలా అవుతారు? పైగా జైలు నుండి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఒకే ఒక నెపం చూపి సిబిఐ బెయిల్‌ను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. జగన్మోహన్‌రెడ్డికి వర్తింపజేసిన న్యాయాన్నే వాద్రాకు కూడా వర్తింపజేస్తే కచ్చితంగా కేజ్రీవాల్ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. కానీ కాంగ్రెస్ ప్రతిస్పందన అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దీనిని బట్టి జగన‌్మోహన్‌రెడ్డిపై దర్యాప్తు అంతా కేవలం కాంగ్రెస్ కుట్ర మాత్రమేనని తేలుతోంది.
జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని సాక్షాత్తు కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందంతా టార్గెట్ జగన్ ఆపరేషన్! ప్రభుత్వ నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధమని తేలితే అప్పుడు దొడ్డిదారి పెట్టుబడులను క్విడ్ ప్రో కో గా వ్యవహరించవచ్చు. కానీ జగన్ విషయంలో సిబిఐ ప్రభుత్వ నిర్ణయాల జోలికి పోనే లేదు. కేవలం జగన్ నిర్వహణలోని కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారికెవరికైనా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయో లేదో చూసి వారిపై కేసులు మోపుతోంది. ప్రాజెక్టులు రాని వారుంటే వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని విడ్డూరపు కేసులు పెడుతోంది.
ఇన్వెస్టర్లను వేధించడంతో పాటు క్విడ్ ప్రో కో ఆరోపణలతో జగన్‌ను టార్గెట్ చేయడం సిబిఐ ధ్యేయంగా మారింది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ సంస్థలకు విశాఖ, మహబూబ‌్‌నగర్ సెజ‌్‌లలో భూములు కేటాయించారనీ, దీని ద్వారా వాటికి రూ. 16 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందనీ, దరిమిలా అవి జగన్మోహన్‌రెడ్డి సంస్థలలో రూ. 29.5 కోట్లు పెట్టుబడి పెట్టాయనీ సిబిఐ తన మొదటి చార్జిషీట్‌లో పేర్కొంది. 16 కోట్ల లబ్ధికి 29 కోట్ల పెట్టుబడులన్న సిబిఐ వాదనలో పస ఎంతో తెలుస్తూనే ఉంది. జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చిన అంశాన్ని సిబిఐ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది.
క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలు రావడం ఎక్కడైనా ఉందా? క్విడ్ ప్రో కో ఆరోపణలను పరిశీలిస్తే ఎక్కడా ప్రభుత్వం నష్టపోయినట్లు కనిపించదు. ఇంత వరకూ సిబిఐ ఎక్కడా దీనికి రుజువులు చూపలేదు. అయినప్పటికీ మూడేసి చార్జిషీట్లు వేసింది. వాన్‌పిక్ వ్యవహారంలో నాలుగో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇంకా వేస్తామని కోర్టుకు చెప్పింది.
కాంగ్రెస్‌లో ఉన్నా, కాంగ్రెస్‌తో కలసి సాగినా ఆరోపణలపై సిబిఐ కానీ ప్రభుత్వం కానీ స్పందించదన్నమాట.
బాబు జోలికి వెళ్లని సిబిఐ!
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఐఎంజి వ్యవహారంలో ఆరోపణలు వచ్చినా సిబిఐ ఇంతదాకా కదలలేదు. అంతేకాదు, ఎమ్మార్ టౌన్‌షిప్ విషయంలోనూ బాబు పాత్రను సిబిఐ పట్టించుకోనే లేదు. ఎమ్మార‌్‌కు ఎకరా రూ. 29 లక్షలకే 535 ఎకరాలు అప్పగించిన బాబు నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది.
నిజానికి అక్కడ అంతకు ముందు మూడేళ్ల కిందటే ఎకరాకు కోటి పలికింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ కుట్రను బయటపెట్టింది కూడా. అయినప్పటికీ సిబిఐ దానిని పట్టించుకోలేదు. 2005 తర్వాతి విల్లాల అమ్మకాలపైనే సిబిఐ విచారణ జరుపుతూ వచ్చింది. జరిగిన నష్టం రూ.2500 కోట్లంటూ లీకులిచ్చి ఆఖరికి రూ.215 కోట్లు మాత్రమేనని తేల్చారు.
ఐఎంజికి రూ.8,500 కోట్ల విలువ కలిగిన భూములను రూ.4 కోట్లకే కట్టబెట్టిన చంద్రబాబుపై దర్యాప్తు జరపడానికి సిబిఐ వద్ద సిబ్బంది లేరట. 2006 లోనే రాష్ట్రప్రభుత్వం ఐఎంజి భూముల కేటాయింపుపై దర్యాప్తునకు ఆదేశించినా సిబిఐ కుంటిసాకులు చెబుతూ ఇంతదాకా దర్యాప్తు ప్రారంభించలేదు. కనుక దర్యాప్తు ప్రారంభించేలా ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఎబికె.ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి 2012 మార్చిలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో చేసేది లేక ఎట్టకేలకు దిగివచ్చిన సిబిఐ 2012 సెప్టెంబర్ 24 నాడు ఐఎంజి కేసు దర్యాప్తుకు సంసిద్ధతను ప్రకటించింది.
ఒక అనామక (ఐఎంజి భారత) కంపెనీకి ఎకరా రూ. 5 కోట్ల భూమిని రూ. 50 వేలకే కట్టబెడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు 2004 ఫిబ్రవరి 9 న జీవో జారీ చేశారు. దీనికి రిజిస్ర్టేషన్ ఫీజు కూడా చెల్లించనక్కర్లేకుండా రాయితీలు కూడా ఇచ్చారు. కేబినెట‌్‌కు తెలియకుండానే గుట్టు చప్పుడు కాకుండా కథ నడిపారు. ఫ్లోరిడాకు చెందిన ఐఎంజికి, ఐఎంజి భారతకీ ఎలాంటి సంబంధమూ లేదని తర్వాత బయటపడిన నిజం. ఇంత భారీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి సిబిఐకి సిబ్బంది లేకపోయింది!
ఇదంతా టిడిపితో కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయానికీ, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్‌కు, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వప్రమాణాలకూ తిరుగులేని రుజువు. జగన్మోహన్‌రెడ్డి విషయంలో 'క్విడ్ ప్రో కో' ఆరోపణలన్నీ కట్టుకథలు కాగా, 'వాద్రాగేట‌్' వ్యవహారం ఇందుకు పూర్తిగా భిన్నం. అక్కడ సోనియాగాంధీ అల్లుడు వాద్రా, డిఎల‌్ఎఫ్, హర్యానా సర్కార్ లాలూచీ నిర్వాకాలు ఆధారాలతో స్పష్టంగానే కనిపిస్తున్నా అదంతా ప్రైవేటు వ్యవహారమేనని ప్రభుత్వం బొంకుతోంది. వాద్రా విషయంలో ప్రభుత్వానికి భారీ నష్టం కలిగినట్లు తేలినా, అక్కడి హైకోర్టు తప్పుబట్టినా కాంగ్రెస్ పార్టీ బరితెగించి, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.