ఆలోచన రేకెత్తిస్తున్న ప్రసంగాలు

18 Nov, 2015 17:16 IST

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు కోరుకొంటున్న మార్పు వెల్లడవుతోంది. ప్రభుత్వాలు.. వాటి పరిపాలనల మీద ప్రజల్లో ఆలోచన బలపడుతోంది. అలనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పరిపాలన, సంక్షేమ పథకాలు.. ఆ తర్వాత ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు తెన్నుల మీద చర్చించుకొంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాలా సూటిగా చెబుతున్న అంశాలు ప్రజల్లో ఆలోచన కల్గిస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన ను, ఇప్పటి పాలనతోనూ పోలుస్తూ  వైఎస్ జగన్ ప్రసంగాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల్ని ఆకట్టుకొన్న రెండు పథకాల్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజుల రీయింబర్స్ మెంట్ పథకాల్ని ఆయన ప్రతీ గ్రామంలో ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామల్లోనూ ఆరోగ్య శ్రీ, ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ పథకాలు కళ్ల ముందు కనిపిస్తాయి. బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ప్రతీ చోట ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్  పథకాల లబ్ది దారులు కనిపిస్తారు. విప్లవాత్మక మైన ఈ పథకాలు తెలుగు నాట ప్రతీ ఇంట్లో కనిపిస్తాయి.

అయితే ఇంతటి ప్రజారంజక పథకాల్ని కూడా సక్రమంగా అమలు చేయటం లేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. గత ఏడాది ఫీజుల రీఇంబర్స్ మెంట్ పథకానికి రూ. 1,500 కోట్ల రూపాయిలు బకాయి పెట్టారని గుర్తుచేశారు. ఇంతటి స్థాయిలో బకాయిలు పెడితే బలహీన వర్గాల పిల్లల చదువులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్సార్ ప్రవేశ పెడితే ఇప్పటి దాకా అవే అంబులెన్స్ లు తిప్పుతున్నారని, వాటిని రిపేరు కూడా చేయించటం లేదని జగన్ అనటంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ పథకాల్ని ప్రస్తావిస్తుండటంతో ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. అప్పటి పరిపాలనలో జరిగిన మంచి పనుల్ని ఆయన గుర్తు చేసుకొంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచితే కేసీయార్ పాలనలో 16వందల ఎకరాలు మాత్రమే పంచి పెట్టారు. ఈ సంగతి వైఎస్ జగన్ గుర్తు చేశారు.

బలహీన వర్గాల కోసం వైఎస్సార్ హయంలో 48 లక్షల ఇళ్లు కట్టిస్తే 18 నెలల కాలంలో కేసీయార్ 3,4 వందల ఇళ్లు మాత్రమే కట్టించారని లేవనెత్తినప్పుడు ప్రజల్లో లోతుగా ఆలోచన చెలరేగింది. ప్రజల మనస్సులో నిలిచిపోయిన నేత వైఎస్సార్ మాత్రమే అన్న జగన్ మాటను ప్రజలంతా హర్షాతిరేకాలతో అంగీకరించారు. రాజన్న బాటలో నడుస్తున్న పార్టీ కి ఓటేయాలన్న జగన్ వినతి ని స్వీకరించారు.