హైకోర్టు జోక్యం చేసుకొన్నా పట్టదా.. !

23 Mar, 2016 20:51 IST


() గిరిజన సలహా మండలి ఏర్పాటు  చేయరా

() చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుటిల నీతి ఏమిటి

() వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుల మీద హైకోర్టు స్పందన

హైదరాబాద్) గిరిజన సలహా మండలి ఏర్పాటులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అలసత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సలహా మండలిలో నియమించటం ఇష్టం లేకనే చంద్రబాబు జాప్యం చేస్తున్న సంగతి సుస్పష్టం. ఈ విషయం మీద తాజాగా హైకోర్టు జోక్యం చేసుకొంది.

సలహా మండలి అవసరం

గిరిజనుల భద్రత, సంక్షేమానికి రాజ్యాంగం పెద్ద పీట వేసింది. గిరిజనులకు సంక్రమించిన సహజ సిద్ధమైన హక్కుల్ని కాపాడేందుకు, గిరిజనులకు సంబంధించిన విధి విధానాల్ని ఖరారు చేసేటప్పుడు వారి ప్రాతినిధ్యం పాటించాలని రాజ్యాంగ పెద్దలు తలపోశారు. ఇందు కోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యత అప్పగించారు. గవర్నర్ కు సలహా ఇచ్చేందుకు గిరిజన సలహా మండలి ఉండాలని నిర్దేశించారు. అంటే గిరిజనులకు సంబంధించి ప్రభుత్వం ఏదైన విధాన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆయా అంశాల మీద గవర్నర్ కు  ఈ మండలి సలహాలు ఇస్తుంటుంది.

ప్రాతినిధ్యం మీద ప్రభుత్వం పేచీ

అయితే గిరిజన సలహా మండలిలో రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ముఖ్యంగా గిరిజన ఎమ్మెల్యేల నుంచి ఎంపిక చేయాల్సి ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో ఆరుగురు వైఎస్సార్సీపీ నుంచే ఎన్నికయ్యారు. ఒకే ఒక్క పోలవరం టీడీపీ ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ ఎంపీ బాగా వేధిస్తున్నారు. టీడీపీ అధిష్టానం ఎంపీ కే వత్తాసు పలుకుతుండటంతో ఆయన అసంత్రప్తి తో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద గిరిజన ఎమ్మెల్యేలలో 90 శాతం మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కావటంతో సహజంగానే సలహా మండలిలో అధికులు వైఎస్సార్సీపీ సభ్యులు అవుతారు. అది ఇష్టంలేని చంద్రబాబు ఏకంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేందుకు బరి తెగించారు. సలహా మండలి ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

చివరకు కోర్టులకే నివేదన

రెండు సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవటంపై వైఎస్సార్సీపీ అనేక సార్లు వినతులు ఇచ్చింది. ప్రభుత్వం మొండి వైఖరి అనుసరిస్తుండటంతో గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. చివరకు  హైకోర్టుని ఆశ్రయించింది. పార్టీ గిరిజన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పాముల పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, సర్వేశ్వర రావు, కళావతి, వంతల రాజేశ్వరి హైకోర్టు లో పిటీషన్ వేశారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు ..ప్రతివాదులైన గవర్నర్ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి లకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం వస్తుందో లేక, దీని మీద కూడా కొత్త నాటకాలకు తెర తీస్తుందా అన్నది వేచి చూడాల్సిన అంశం.  


ఇదే వార్తాశం ఇంగ్లీష్ లో:  http://goo.gl/LPrqb8