ఎదురు చూపులు ఫలించిన శుభవేళ!
పదహారు నెలలు ఆత్రుతగా ఎదురు చూసిన వారి కలలు ఫలించిన వేళ... జైలు నుంచి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట అడుగుపెట్టిన ఆనంద క్షణాన... కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కళ్లు ఆనంద బాష్పాలతో తొణికిసలాడాయి. 485 రోజుల ఎడబాటు తరువాత లోటస్‌పాండ్‌లోని నివాసానికి చేరుకున్న తనయుడిని చూసి తల్లి శ్రీమతి విజయమ్మ చలించిపోయారు. నాన్న కోసం అనుక్షణం తల్లడిల్లిన రెండు పసి హృదయాలు ఉద్వేగానికి లోనయ్యాయి. దుఃఖం- సంతోషం సమ్మిళితమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన శ్రీ జగన్మోహన్‌రెడ్డి తనయలు హర్ష, వర్ష తండ్రిని అమాంతంగా వాటేసుకున్నారు. ఆయన సతీమణి శ్రీమతి భారతి ఉద్వేగానికి లోనయ్యారు. అన్న ఇంటికి రావడంతో శ్రీమతి షర్మిల ఆనందానికి అవధులు చెరిగిపోయాయి. చంచల్‌గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన శ్రీ జగన్ మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఆయనకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణుల నుంచి అపూర్వమై స్వాగతం లభించింది.
2012 మే 27వ తేదీన సిబిఐ పిలుపు మేరకు వరుసగా మూడవ రోజు విచారణ కోసం లోటస్‌పాండ్‌లోని ఇంటి నుంచి ఆ రోజు ఉదయం 9.30 గంటలకు భారీ భద్రత మధ్య బయలుదేరి వెళ్లిన శ్రీ జగన్‌ను అటు నుంచి అటే అరెస్టు చేసి తీసుకుపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీ జగన్ కోసం ఆయన కుటుంబం ఎదురుతెన్నులు చూస్తూనే ఉంది. కష్టాల కడలిని దాటుకుని జైలు నుంచి వచ్చిన శ్రీ జగన్‌కు ఆత్మీయులు ఎదురేగి ఇంటిలోకి తీసుకు వెళ్లారు.
చంచల్‌గూడ జైలు నుంచి లోటస్‌పాండ్ నివాసం వరకూ ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అభిమానుల స్వాగత ర్యాలీతో వచ్చిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇంటి లోపల అడుగు పెడుతున్న క్షణంలో అక్కడే ఉన్న అందరూ ఒక్కసారిగా ఉద్విగ్నతకు గురయ్యారు. తల్లి, భార్య, పిల్లలు, సోదరి.. శ్రీ జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. గుమ్మడికాయతో దిష్టి తీసి, హారతి పట్టారు. ‘వైయస్ఆర్ అమర్ రహే... జై జగన్’ అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటుతుండగా శ్రీ జగన్ ఇంటిలోకి అడుగు పెట్టారు.
ఆ వెంటనే హాలులో ఉన్న తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలు చల్లి శ్రీ జగన్ వినమ్రంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత తల్లి శ్రీమతి విజయమ్మ తన కుమారుడిని ముద్దాడారు. శ్రీ జగన్ కూడా మాతృమూర్తిని ఆప్యాయంగా ముద్దాడారు. ఇల్లంతా పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు, బంధువులతో కిక్కిరిసిపోయింది. అందరినీ శ్రీ జగన్ చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల అయిన సందర్భంగా ఇల్లంతా పూలతో అలంకరించారు. దీనితో పండుగ వాతావరణం నెలకొన్నది. శ్రీ జగన్ నివాసం బయట ఉదయం నుంచే కార్యకర్తలు, మీడియా కోలాహలం ఎక్కువగా కనిపించింది. చంచల్‌గూడ జైలు నుంచి శ్రీ జగన్ బయటకు అడుగు పెట్టారనే వార్త తెలిసినప్పటి నుంచీ ప్రజలు ఆయన ఇంటి వద్ద బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేశారు. శ్రీ జగన్ నివాసానికి చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు.