పోలవరం లొసుగులపై ఆరా

19 Jul, 2018 16:01 IST

కొద్ది రోజుల క్రితం పోలవరాన్ని సందర్శించి, సమావేశంలో మాట్లాడి వెళ్లిన గడ్కరీ చెప్పినట్టు పోలవరం వ్యవహరాంలో మతలబుల గురించి కేంద్ర జలసంఘం ఆరాలు మొదలెట్టింది. అంచనా వ్యయం పెరుగుదలకు టిడిపి ప్రభుత్వం చేసిన జిమ్మిక్కులపై సూటిగా ప్రశ్నలు వేసింది. రాష్ట్ర జలవనరుల శాఖా అధికారుల వివరణలు కోరింది. గడ్కరీ లేవనెత్తిన అంశాల విషయంలో పూర్తి స్పష్టమైన సమాధానం కావాలని కోరింది.

జలాశయంలో ముంపుకు గురయ్యే భూమి విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. 2005లో 57 వేల ఎరాల ముంపు భూమి అని చెప్పి, గత ఏడాది అది 1.5లక్షల ఎకరాలు అని ఎలా మార్చారు అని ప్రశ్నించారు సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్. జలాశయం నీటిమట్టం లో మార్పు లేదు, నీటి నిల్వ సామర్థ్యంలోనూ మార్పులు చేయలేదు, మరి అలాంటప్పుడు ముంపుకు గురయ్యే భూమి విస్తీర్ణం రెండింతలు ఎలా అయ్యిందని అడిగారు అధికారులు. టోపోగ్రాఫికల్ సర్వేకి, క్షేత్ర స్థాయి సర్వేకి మధ్య చాలా తేడా ఉందని, అందువల్లే ముంపు ప్రాంతం పెరిగిందని సమాధానం ఇచ్చారు.

 టోపోగ్రాఫికల్ సర్వే ప్రామాణికం కాదా?

భూమి సర్వే రెండు రకాలుగా ఉంటుంది. టోపోగ్రాఫికల్ సర్వే, కెడస్ట్రల్ సర్వే. భూమి నైసర్గిక చిత్రం, సహజ వనరులు, నదులు, చెరువులు, కొండలు, రోడ్లు, రైలు మార్గాలు అన్నిటితో కలిపి రూపొందించేది టోపోగ్రాఫికల్ సర్వే. దీన్ని సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహిస్తుంది. కెడస్ట్రల్ సర్వే అంటే వ్యక్తికి సంబంధించిన భూమి సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్యాన్ని నిర్థారించడం. ఇది రాష్ట్ర సర్వే శాఖ నిర్వహిస్తుంది. ఇక పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించిన భూమిలో అధికశాతం ప్రభుత్వానిదే అని నివేదికలు చెబుతున్నాయి. పై రెండు విధాల సర్వేల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికి అది చాలా కొద్దిశాతం అయిఉండాలి. కానీ ప్రభుత్వ భూములు, సర్వేలో ప్రభుత్వ భూములుగా పరిగణలో ఉన్నవి మూడేళ్ల కాలంలో ప్రైవేటు భూములుగా ఎలా మారిపోతాయి? అంటే ముంపు ప్రాంతాల ప్రభుత్వ భూములను రాష్ట్రం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుందా? లేక సర్వేలలోనే భారీ లోపాలు జరిగాయా? ముంపు భూమి విస్తీర్ణం రెట్టింపు అయ్యేంతగా వ్యత్యాసం ఎందుకు వస్తుంది? దీన్ని కేంద్ర జలవనరుల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది.

 2013 భూసేకరణ చట్టం వంక

2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం పెరిగిపోయిందని. అందువల్లే పోలవరం అంచనా వ్యయం పెరిగిందని చంద్రబాబు పదేపదే ఘోషిస్తున్నారు. భూసేకరణకే 33వేల కోట్లు అని చెప్పుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాలు ముంపుకు గురి అవుతాయనేది ఓ అంచనా. ఈ క్రమంలో 2లక్షల మంది ప్రజలు నిర్వాసితులు కావొచ్చు అంటున్నారు. అయితే గత ఏడాది చివరి నాటికి మొదటి విడతలో 3446 కుటుంబాల నిర్వాసితులకు మాత్రమే పునరావాసం కల్పించారు. అది కూడా 20102011 భూసేకరణ చట్టం ప్రకారమే ఈ పునరావాస ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ తెగలకు 5 ఎకరాల భూమి వారికి భూమి పరిహారంగా ఇస్తామన్నారు. 5 ఎకరాలకంటే ఎక్కువ ఉన్న భూమికి నగదు రూపంలో పరిహారం ఇస్తామన్నారు. ఇతరులకు సాగులో లేని భూమికి 1.15లక్షలు, సేద్యపు భూమికి 1.30 లక్షలు చొప్పున ఇచ్చారు. నగదు పరిహారం కింద 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి 1.7లక్షలు గిరిజనేతర కుటుంబ సభ్యుడికి 1.5 లక్షలు ఇచ్చారు. అయితే ఈ పరిహారం అందరికీ అందలేదు. తొలి విడత నిర్వాసితులైన వారిలో గ్రామానికి కనీసం 10 కుటుంబాలకు కూడా ఇస్తామన్న భూమి ఇవ్వలేదని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులంతా అడివై ఆధారపడి బతికేవారే. వారిని ముంపు ప్రాంతాల నుంచి తరలించాక, వారికి జీవనోపాధి కరువైంది. రైతులుగా ఉన్నవారంతా కూలీలయ్యారు. పునరావాసం, భూసేకరణకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతోందని బాబు చెబుతున్న లెక్కలకు, బాధితులకు ఇస్తున్న సొమ్ముకూ పొంతన ఉండటం లేదు.

ప్రభుత్వ భూమిని, చెరువులను, చివరకు నడకదారిని కూడా ప్రైవేటు వ్యక్తులదే అని చూపుతూ పరిహారాలు ఇచ్చిన వైనాన్ని ప్రతిపక్షం, పత్రికలు బైటపెట్టాయి. నిర్వాసితులకు ఇంతవరకూ పరిహారం సరిగ్గా అందలేదని, వారికి పునరావాసం కల్పనలోనూ తీవ్ర నిర్లక్ష్యం ఉందని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ లొసుగులు అన్నీ బైటపడితే చంద్రబాబు పోలవరం అంచనా వ్యయం పెరుగుదల వెనకున్న బండారం అంతా బట్టబయలౌతుంది.