రాష్ట్రంలో గనులశాఖపై ఈనాడు తప్పుడు రాతలు
- మైనింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు
- ఎక్కువ మందికి మైనింగ్ లో అవకాశాలు కల్పించేందుకు'ఈ-ఆక్షన్' విధానం
- పారదర్శకత, వేగంగా లీజుల జారీకి చర్యలు
- ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా కొత్త విధానం
- రాష్ట్రంలో ఎక్కువ లీజుల్లో మైనింగ్ ఆపరేషన్స్ జరగాలన్నదే లక్ష్యం
- అందుకోసం స్పెషల్ డ్రైవ్ ల నిర్వహణ
- దీనివల్ల అదనంగా 1700 నాన్ వర్కింగ్ లీజుల్లో మైనింగ్ ప్రారంభం
- ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు చేయూత
- మైనింగ్ రంగంలో యువతకు పెద్ద ఎత్తన ఉపాధి
- ప్రభుత్వానికి మైనింగ్ నుంచి రెవెన్యూ పెరుగుతుంది
- గనులశాఖ అత్యుత్తమ విధానాలకు జాతీయ స్థాయి గుర్తింపు
- 2022లో రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ ఇన్సెంటీవ్ గా రూ.3.60 కోట్లు
- జాతీయ కాంక్లేవ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి పురస్కారాలు
- - గనుల అన్వేషణ, వేలం, మైనింగ్ నిర్వహణపై ప్రశంసలు
- - 2014-19 వరకు అక్రమ మైనింగ్ పై అయిదేళ్ళలో నమోదైన కేసులు: 424
- 2019-23 వరకు అంటే నాలుగేళ్ళలోనే నమోదైన కేసులు: 786
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ: రూ.1950 కోట్లు
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం: రూ.4756 కోట్లు
- రాష్ట్రంలో మైనింగ్ పై ఈనాడు వక్రీకరణ రాతలు
- అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవడం ఈనాడు దృష్టిలో నేరం?
- తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయడం వేధింపులా?
- అక్రమార్కులపై జరిమానాలు విధిస్తే భయపెట్టే వ్యూహమని అంటారా?
- ప్రభుత్వ రెవెన్యూను కొల్లగొడుతున్నా... గనులశాఖ పట్టించుకోకుండా ఉండాలా?
- విజిలెన్స్ స్వ్కాడ్ లతో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం
- టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణం చర్యలు
- చివరికి సీనరేజీపైనా తప్పుడు కథనాలు
- - అత్యంత పారదర్శకంగా సీనరేజీ టెండర్లు
- మైనింగ్ ఆదాయాన్ని పెంచుకునేందుకే పలు రాష్ట్రాల్లో ఈ విధానం
- ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది
- సీనరేజీ వసూళ్ళలో 15శాతం అధికంగా రెవెన్యూ
- గనులశాఖ నుంచే కాంట్రాక్టర్ కు రవాణా ఫారాలు
- హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్ తో కూడిన రవాణా ఫారాలు
- సీనరేజీ వసూళ్ళపై గనులశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ
- ఇసుక విధానంపైనా ఈనాడు విషం చిమ్ముతోంది
- - ఉచిత ఇసుక విధానంలో అక్రమాలకు ఈ ప్రభుత్వం చెక్ పెట్టింది
- యధేచ్ఛగా దోచుకున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపింది
- అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని అమలు చేస్తోంది.
- గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి రూ.100 కోట్లు జరిమానా
- ఏడాదికి రూ.1000 కోట్లు దక్కుతోందని తప్పుడు రాతలు
- సిలికాశాండ్ పై 'ఈనాడు' అసత్య కథనం
- లీజుదారులకు ఆన్లైన్ లో మాత్రమే అనుమతులు
- లీజుదారులు తమకు ఇష్టమైన సంస్థలకు సిలికాశాండ్ అమ్ముకోవచ్చు
- ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా కొనుగోలు చేసుకోవచ్చు
- గనులశాఖపై ఈనాడు నీచమైన పదజాలంతో ఆరోపణలు
- ఈనాడు దిగజారుడుతనంకు ఈ రాతలే నిదర్శనం
- కనీసం అధికారుల హోదా ఏమిటో కూడా తెలియని అజ్ఞానం ఈనాడుది
- విజి వెంకటరెడ్డి, గనులశాఖ సంచాలకులు
అమరావతి: గనులశాఖపై ఈనాడు దినపత్రిక 'పేరుకే పెద్ద... గనుల్లో గద్ద!' అనే శీర్షికన ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవాలు... అభూతకల్పనలతో.... ప్రభుత్వంపై బురదల్లాలనే ప్రయత్నంలో భాగంగా ప్రచురించినదేనని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి ఖనిజాధారిత ఆదాయాన్ని ఆర్జించి పెడుతూ... పారిశ్రామిక ప్రగతికి ఇతోదికంగా సహకరిస్తున్న గనులశాఖను 'మున్సిపాలిటీ పట్టించుకోని మురుగు కాలువ'గా ఈనాడు పత్రిక అభివర్ణించడం ఆ పత్రిక దివాలాగోరుతనంకు నిదర్శనం. ప్రభుత్వశాఖను ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో పోల్చడం ఈనాడు పత్రిక దిగజారుడుతనంకు అద్దం పడుతోంది. అనుచరులు, బినామీలతో, ఆక్టోపస్ లా గనులను ఆక్రమిస్తున్నారంటూ తీవ్రమైన పదజాలంతో ఈనాడు రాసిన రాతలు ఈ ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషాన్ని చాటుతున్నాయి. గనులశాఖ మంత్రిపై అబద్దపు ఆరోపణలు చేస్తూ, అభూతకల్పనలతో ఈనాడు పత్రిక అచ్చేసిన కథనం పూర్తి అవాస్తవాలతో కూడిన తప్పుడు కథనం. రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత గనులశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అత్యంత పారదర్శక విధానాలను రూపొందించి అమలు చేస్తున్నారు. గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో మైనింగ్ రంగంలో రాష్ట్రం కొత్త రికార్డులను సాధించింది. జాతీయస్థాయిలో దేశ జిడిపిలో మైనింగ్ రెవెన్యూ వాటా 1శాతం ఉండగా, రాష్ట్ర జిడిపిలో మైనింగ్ రెవెన్యూ వాటా 2.58 శాతం ఉండటమే దీనికి నిదర్శనం.
2) ఒకవైపు మైనింగ్ రంగంలో పారదర్శకతను అమలు చేస్తూ, మరోవైపు అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం మైనింగ్ లో ప్రగతిపథంలో పయనిస్తోంది. గత ఏడాది మేజర్ మినరల్స్ కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణలో గనులశాఖ అధికారులు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించింది. 2022లో ఢిల్లీలో జరిగిన జాతీయ కాంక్లేర్ లో రెండేళ్ళకు గానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ కింద 3.60 కోట్ల రూపాయల ఇన్సెంటీవ్ ను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి పురస్కారంను అందుకుంది.
2014-19 మైనింగ్ రెవెన్యూ:
2014-15 లో మైనింగ్ రెవెన్యూ రూ.966 కోట్లు.
2015-16 లో మైనింగ్ రెవెన్యూ రూ.1396 కోట్లు , నమోదైన విజిలెన్స్ కేసులు: 9953
2016-17 లో మైనింగ్ రెవెన్యూ రూ.1702 కోట్లు , నమోదైన విజిలెన్స్ కేసులు: 9703
2017-18 లో మైనింగ్ రెవెన్యూ రూ. 2147, నమోదైన విజిలెన్స్ కేసులు: 8128
2018-19 లో మైనింగ్ రెవెన్యూ రూ.2463 , నమోదైన విజిలెన్స్ కేసులు: 7622
2019-23 మైనింగ్ రెవెన్యూ:
2019-20 లో మైనింగ్ రెవెన్యూ రూ.2072 , నమోదైన విజిలెన్స్ కేసులు: 9354
2020-21 లో మైనింగ్ రెవెన్యూ రూ.2339 , నమోదైన విజిలెన్స్ కేసులు: 10736
2021-22 లో మైనింగ్ రెవెన్యూ రూ.3765 , నమోదైన విజిలెన్స్ కేసులు: 9361
2022-23 లో మైనింగ్ రెవెన్యూ రూ.4756 , నమోదైన విజిలెన్స్ కేసులు: 14855
మైనింగ్ లో సంస్కరణలు
3) రాష్ట్రంలో గనులశాఖలో సీఎం శ్రీ వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ప్రభుత్వం మైనింగ్ రంగంలో అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడం, ఔత్సాహికులు మైనింగ్ రంగంలో ప్రవేశించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో First- Come- First - Serve అనే విధానం ద్వారా మైనింగ్ లీజుల జారీ జరిగేవి. అయితే ఈ విధానంలోని ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానంలో లీజుల కోసం చేసుకున్న దరఖాస్తులు చాలాకాలంగా పెండింగ్ లో ఉండి పోతున్నాయి. లీజులు పొంది కూడా చాలామంది మైనింగ్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4988 లీజులు ఉండగా, వాటిలో కేవలం 2826 మాత్రమే వర్కింగ్ లీజులుగా ఉన్నాయి. మరో 2162 నాన్ వర్కింగ్ లీజులు ఉన్నాయి. వీటిపై దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం వల్ల అదనంగా 1700 లీజులు వర్కింగ్ లోకి వచ్చాయి. అంటే మొత్తం 4526 లీజుల్లో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
4) లీజులు పొంది కూడా చాలామంది క్వారీయింగ్ చేయకపోవడం, కొత్తవారు మైనింగ్ లోకి రాకుండా లిటిగేషన్స్ సృష్టించడం వల్ల ఔత్సాహికులు మైనింగ్ రంగంకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ విధానంపై గౌరవ సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు 17.08.2015న కేంద్ర గనులశాఖ రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు మైనింగ్ రంగంలో e-auction (ఈ-ఆక్షన్) అనే విధానంను అమలులోకి తెచ్చాయి. దీనిని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తూ సీఎం శ్రీ వైయస్ జగన్ గారు మైనింగ్ రంగంలో లోపాలు సవరిస్తూ... పారదర్శకతకు పెద్దపీట వేస్తూ మంచి మార్పులకు శ్రీకారం చుట్టారు.
5) ఈ-ఆక్షన్ ఈ విధానం ద్వారా క్వారీలకు వేగంగా, పారదర్శకంగా లీజులు మంజూరవుతాయి. , రెవెన్యూ విభాగం నుంచి NOC లు పొందేందుకు గనులశాఖ తోడ్పాటును అందిస్తుంది. సర్వే చేసిన స్కెచ్ తో పాటు వేలానికి ప్రతిపాదించిన ప్రాంతం DGPS సర్వేను కూడా గనులశాఖ అందిస్తుంది. ఈ-ఆక్షన్ తరువాత ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన వెంటనే దరఖాస్తుదారులకు LOI లభిస్తుంది. ఫైల్ ప్రాసెసింగ్ ను మరింత సరళతరంగా ఉంటుంది. మైనింగ్ రంగంలో ఔత్సాహికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున మైనింగ్ ఆధారిత పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే రాష్ట్రానికి మైనింగ్ నుంచి ఎక్కువ రెవెన్యూ లభిస్తుంది.
6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరుల మైనింగ్ పై ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల్లోనూ గనులశాఖ రోడ్ షోలు నిర్వహించింది. ఎపిలో ఈ ఏడాది దాదాపు 1200 ఏరియాలు అంటే సుమారు 6 వేల హెక్టార్ లలోని చిన్నతరహా ఖనిజ నిల్వలకు ఈ - ఆక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఖనిజ సంపదను వెలికితీయడం ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించవచ్చు.
7) దీనిపైన కూడా ఈనాడు దినపత్రిక తన తప్పుడు కథనంలో విషం చిమ్మడం బాధాకరం. తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యతం అనే విధానమే మెరుగైనదిగా చిత్రీకరిస్తూ తన కథనంలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. సుప్రీంకోర్ట్ నిర్ధేశించిన అంశాలపైన కూడా ఈనాడు పత్రిక విరుద్దమైన రాతలు రాయడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో దేవాదాయ, వక్ఫ్, అటవీభూముల్లో మైనింగ్ లీజులకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ లీజులు మంజూరు చేస్తున్నారంటూ ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాసింది. ఎక్కడ మైనింగ్ లీజులు ఇచ్చారో బయటపెట్టాలని కోరుతున్నాం. తన అసత్యకథనాలకు అధికారపార్టీ నేత లీజులు పొందేందుకు ప్రయత్నించారంటూ ఊహాత్మక కథనాన్ని ప్రచురించింది.
ఇసుక విధానంపై మొదటి నుంచి ఈనాడు అక్కసు
8) గతంలో ఉచిత ఇసుక విధానం ముసుగులో వేలకోట్ల రూపాయల ప్రజాధనంను ఇసుక మాఫియా కొల్లగొట్టింది. దానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన ఇసుక విధానంను అమలులోకి తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో, కొరత లేకుండా ఇసుకను అందిస్తోంది. దానిపైన కూడా ఈనాడు పత్రిక ప్రారంభం నుంచి తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. గతంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ ఇప్పుడు జరగకపోవడంను ఈనాడు పత్రిక జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఏకంగా ఇసుకలో ఏటా రూ.1000 కోట్లు దోచేస్తున్నారంటూ బరితెగించిన అబద్దాలను తన పత్రికలో వండి వారుస్తోంది.
9) ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం కారణంగా ఏడాదికి రూ.760 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా లభిస్తోంది. టన్ను ఇసుకను రూ.475 కి విక్రయిస్తున్నారు. దీనిలో రూ.375 ప్రభుత్వానికి రాయల్టీగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు అమ్మేందుకు వీలు లేదు. ఇసుక రీచ్ లు, డిపోల నుంచి సమంజసంగా నిర్ణయించిన రేట్లకే రవాణా వాహనాలకు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా ఎంత చెల్లించాలో ప్రభుత్వమే ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తోంది. అలాగే ఎవరైనా వినియోగదారుడు తాము సొంతగా సమకూర్చుకున్న వాహనం ద్వారా కూడా ఇసుకను తీసుకువెళ్ళేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది.
10) కేంద్రప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా?
క్వార్డ్జ్ మైనింగ్ పై 'ఈనాడు' రాతలు పూర్తి అవాస్తవం
11) రాష్ట్రంలో క్వార్డ్జ్ మైనింగ్ లో ఎక్కడా అక్రమాలు జరగడం లేదు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్వ్కాడ్ లను ఏర్పాటు చేసింది. మైనింగ్ పై ఎక్కడ ఆరోపణలు వచ్చినా ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే అన్ని చోట్ల చెక్ పోస్ట్ లు కూడా ఏర్పాటు చేసి మైనింగ్ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం. ఇంత పకడ్భందీ చర్యలు తీసుకుంటూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున క్వార్జ్ట్ అక్రమ మైనింగ్, రవాణా సాధ్యమా? ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే క్వార్డ్జ్ కు పర్మిట్ తప్పనిసరి. అక్రమ మైనింగ్ చేసే క్వార్డ్జ్ కు ఏ విధంగా పర్మిట్ లభిస్తుంది? అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఇటీవలే అయిదు స్వ్కాడ్రన్ బృందాలతో తనిఖీలు నిర్వహించాం.
మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం
12) రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా అక్రమార్కులపై తీసుకుంటున్న చర్యలను వక్రీకరిస్తూ 'ఈనాడు' పత్రిక తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలని లక్ష్యంగా చేసుకుంటోందంటూ రాజకీయాలను అంటకట్టేందుకు ఈనాడు ప్రతిక ప్రయత్నిస్తోంది. మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం అనేది గనులశాఖ అధికారుల ప్రధాన విధుల్లో భాగమని, దీనిని కూడా రాజకీయ కోణంతో చూస్తూ, అసత్యాలతో కూడిన వార్తాకథనాన్ని ప్రచురించడం బాధాకరం.
13) 'దారికి రాని విపక్ష నాయకులకు వేధింపులు' అంటూ ఈనాడు పత్రిక రాసిన రాతలు పూర్తి అవాస్తవాలు. అక్రమ మైనింగ్ పై గనులశాఖ చర్యలు తీసుకోవడం నేరమా ? తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని వేధింపుల కింద ఈనాడు పత్రిక చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. ఈనాడు ప్రతిక రాసిన కథనం ప్రకారం రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే గనులశాఖ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండాలా, అలా తీసుకుంటే దానికి రాజకీయ దురుద్దేశాలను అంటగడతారా?
14) 13 జిల్లా విజిలెన్స్ స్వ్కాడ్ లతో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ 1800 5994599 ద్వారా మైనింగ్ అక్రమాలపై వచ్చే అన్ని ఫిర్యాదులపైనా అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. 2014-19 వరకు అక్రమ మైనింగ్ పై అయిదేళ్ళలో కేవలం 424 కేసులు నమోదు అయితే, 2019-23 వరకు అంటే నాలుగేళ్ళలోనే 786 కేసులు నమోదు అయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ రూ.1950 కోట్లు కాగా, సీఎం శ్రీ వైయస్ జగన్ మైనింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం రూ.4756 కోట్లకు పెరిగింది.
సిలికాశాండ్ పైనా తప్పుడు ఆరోపణలు
15) రాష్ట్రంలో సిలికాశాండ్ మైనింగ్ లో చెన్నై మైనింగ్ వ్యాపారి సన్నిహితులకు చెందిన మినరల్ డీలర్ లైసెన్స్ ల ద్వారానే వ్యాపారం చేయాలని హుకుం జారీ చేశారంటూ ఈనాడు చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలు. సిలికాశాండ్ కు సంబంధించి లీజుదారులకు అనుమతులు ఇచ్చే సందర్భంలో నిబంధనల ప్రకారం ఆన్లైన్ లోనే సీనరేజీ, డిఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్ మొత్తాల చెల్లింపును గనుల శాఖ స్వీకరిస్తుంది. అలాగే అన్ని అనుమతులు ఉన్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్ లైన్ లోనే జారీ చేస్తుంది. లీజుదారులు తాము మైనింగ్ చేసిన మెటీరియల్ ను మార్కెట్ కండీషన్స్ కు అనుగుణంగా ఎవరికైనా బహిరంగ మార్కెట్ లో విక్రయించుకోవచ్చు. ఇందులో గనులశాఖకు ఎటువంటి ప్రమేయం ఉండదు. ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికాశాండ్ లీజులను పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్ కొనుగోలు కూడా చేయవచ్చు. అందుకు నిబంధనల ప్రకారం అవసరమైన సహకారంను గనులశాఖ నుంచి అందిస్తాం.
16) సిలికాశాండ్ మైనింగ్ పై గనులశాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తోంది. 2019 లో 73 లీజులను గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలకు సంబంధించి 61 లీజులకు గానూ రూ.279 కోట్లు జరిమానాగా విధిస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిల్లో 52 మంది లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నారు. వాటిని రివిజన్ అథారిటీ సమీక్షించి వాటిని పరిష్కరించింది.
17) సిలికాశాండ్ మైనింగ్, రవాణాలపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది. ఇంటర్నల్ బృందాలు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తనిఖీలు, జిల్లా విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్ ను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. సిలికాశాండ్ మైనింగ్ లో హుకుం అంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కల్పించేలా ఈనాడు పత్రికలో తప్పుడు కథనాన్ని ప్రచురించడంను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే, దీనిలో అక్రమాలు, పెద్దల పాత్ర అంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలను వండి వార్చడంను మానుకోవాలి.
సీనరేజీపై మరోసారి 'ఈనాడు' తప్పుడు కథనం
18) రాష్ట్రంలో మైనింగ్ రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న సీనరేజీ విధానంపై 'ఈనాడు' పత్రిక అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. గతంలో గనులశాఖ అధికారులే లీజుదారుల నుంచి కొనుగోలుదారులకు రవాణా చేసే ఖనిజానికి సంబంధించి సీనరేజీని వసూలు చేసేవారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో సీనరేజీ వసూళ్ళను శాస్త్రీయంగా లెక్కించి, ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాం. మన రాష్ట్రంలోనూ ఈ విధానంను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేసిన సూచనలతో గనులశాఖ అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానంను అధ్యయనం చేసింది. ఆ తరువాతే ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీనరేజీ వసూళ్ళని ప్రైవేటు కాంట్రాక్టర్ లకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు.
19) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ - 2017 కి అనుగుణంగానే టెండర్లను పిలిచి సాంకేతికంగా, ఆర్థికంగా అర్హత ఉన్న వారికే సీనరేజీ వసూళ్ళ కాంట్రాక్ట్ ను ఇవ్వడం జరిగింది. సీనరేజీని సైతం ఆయా జిల్లాల్లో అత్యధికంగా వసూలైన సీనరేజీ మొత్తంపై పదిశాతంను అదనంగా కలిపి రిజర్వు ధరను నిర్ణయించడం జరిగింది. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి స్థిరమైన మైనింగ్ రెవెన్యూ వస్తుంది, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాధ్యం వంటి పరిణామాలతో మైనర్ మినరల్స్ మైనింగ్ లో ఏర్పడే పరిణామాలతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రెవెన్యూ లభిస్తుంది. మినరల్స్ ఉత్పత్తి తగ్గినా ఆ భారాన్ని కాంట్రాక్టర్ మాత్రమే భరించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విధానం వల్ల ఏడాదికి సగటున 15 శాతం మైనింగ్ రెవెన్యూ ప్రభుత్వానికి పెరుగుతుంది.
20) సీనరేజీ కోసం ఇచ్చే రవాణాఫారాల్లో హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్ తో కూడిన అన్ని భద్రతా ప్రమాణాలతో గనులశాఖ ముద్రించి, ఆయా జిల్లాల కాంట్రాక్టర్లు సమర్పించిన ఇండెంట్ కు అనుగుణంగా వారికి అందిస్తుంది. వీటికి నకళ్ళు తయారు చేయడం కుదరదు, క్యూఆర్ కోడ్ తో వెంటనే నకిలీ రవాణా ఫారాలను సులభంగానే గుర్తించవచ్చు.
21) లీజుదారుడు ఉత్పత్తి చేసిన ఖనిజాన్ని వెండర్ కు రవాణా చేసే సందర్భంలో కాంట్రాక్టర్ జారీ చేసే రవాణా ఫారాల్లో ఒక కాపీ ఖచ్చితగా గనులశాఖ అధికారులకు సమర్పిస్తారు. ప్రతినెలా గనులశాఖ సహాయ సంచాలకులు, ఉప సంచాలకుల పర్యవేక్షణలో సదరు రవాణా ఫారాలను పరిశీలించి వాటి ద్వారా ఎంత ఖనిజం విక్రయించారో నిర్ధారిస్తారు. ఆ తరువాత సదరు వివరాలతో సంబంధిత క్వారీలకు వెళ్ళి, మైనింగ్ ప్లాన్ ను బట్టి ఎంత మినరల్స్ ఉత్పత్తి చేశారో తనిఖీ చేస్తారు. రవాణా ఫారం, క్వారీ రికార్డుల్లో ఉత్పత్తి వివరాలు సరిపోకపోతే వెంటనే ఆ విషయం బయటపడుతుంది. అలాగే ప్రతిజిల్లాలోనూ ఒక విజిలెన్స్ స్క్వాడ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఈ బృందాలు కూడా క్వారీల్లో తనిఖీలు జరుపుతాయి. ఇంత పకడ్భందీగా ఈ విధానంను అమలు చేస్తున్నాం. దీనిపైన కూడా ఈనాడు పత్రిక అక్కసు వెళ్ళ గక్కడం దారుణం.
22) టెండర్లలో కోట్ చేసిన ధరకన్నా ఎక్కవ మొత్తాన్ని సీనరేజీ రూపంలో వసూలు చేస్తే, సదరు అదనపు మొత్తానికి డిఎంఎఫ్, మెరిట్, ఐటి, జిఎస్టీ తదితరాలను కాంట్రాక్టర్ నుంచి గనులశాఖ కట్టించుకుంటుంది. రవాణాఫారం, క్వారీ మైనింగ్ ప్లాన్ లను గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించినప్పుడు మినరల్ మైనింగ్ ఎంత జరిగిందనేది నిర్ధారణ అవుతుంది. దానిని బట్టి అదనంగా జరిగితే దానికి చెల్లించాల్సిన దానిని వసూలు చేస్తాం, ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కూడా తయారు చేశాం.
23) పబ్లిక్ డోమైన్ లో టెండర్ల లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని విస్తృతంగా ప్రచారం చేశాం. సీనరేజీ కాంట్రాక్టర్ ఎంపికలోనూ అన్ని నిబంధనలను పాటిస్తూ, సాంకేతిక, ఆర్థిక అర్హత సాధించిన వారినే పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం. నిబంధనలకు విరుద్దంగా ఎవరికైనా నామినేషన్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చామా? అర్హత ఉన్న ఎవరైనా సరే టెండర్లలో పాల్గొనవచ్చు. గతంలో ఈనాడు పత్రిక ఇదే అంశంపై రాసిన తప్పుడు కథనానికి వివరణ ఇచ్చిన సందర్భంలోనూ ఈనాడు యాజమాన్యం కూడా ఈ టెండర్లలో పాల్గొనాలని ఆహ్వానించాం.
24) గతంలో మైన్స్ సెక్రటరీ, గనులశాఖ సంచాలకులు ఒక్కరే ఉండేవారు. మైనింగ్ రంగంపై మరింత దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఈ రెండు పోస్ట్ లను వేర్వేరు అధికారులను నియమించింది. ఇది ప్రభుత్వ పరిపాలనా విధానాల్లో భాగం. దీనిని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో మైనింగ్ నుంచి వచ్చే రెవెన్యూ గణనీయంగా పెరిగింది. ఇది కూడా ఈనాడు దృష్టిలో తప్పుగానే కనిపిస్తోంది. అంతేకాదు కేంద్రసర్వీసుల నుంచి రాష్ట్రంకు వచ్చి పనిచేస్తున్న అధికారుల హోదా కూడా సరిగ్గా గుర్తించలేని స్థితిలో ఈనాడు పత్రిక ఉంది. కేంద్ర సర్వీసుల్లో 2021 ఆగస్టులోనే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ హోదా పొందిన అధికారిని నౌకాదళంలో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ హోదాగా తన కథనంలో పేర్కొనడం ఈనాడు పత్రిక రాతల్లోని వాస్తవికత, వారి అవగాహన ఎంతో అర్థమవుతోంది. గనులశాఖపై ఇటువంటి ఆరోపణలతో కూడిన కథనాన్ని ప్రచురించే సందర్భంలో కనీసం వాటిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవడం అనేది పత్రికగా ఈనాడు కనీస బాధ్యత. దానిని కూడా విస్మరించి నిసిగ్గుగా... తప్పుడు ఆరోపణలు... అభూతకల్పనలు... వక్రీకరణ కథనాలతో ఈనాడు పత్రిక ద్వేషపూరిత రాతలకు తెగబడుతోంది. దీనిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.
జారీచేసిన వారు:
విజి వెంకటరెడ్డి,
రాష్ట్ర గనులశాఖ సంచాలకులు