ఈ జిత్తులు ఎవరివి??
నక్క జిత్తుల నారా కుయుక్తులు 2019 ఎన్నికల్లోనూ విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలూ చేస్తున్నారో లేక్కే లేదు. ఓట్లు తొలగింపు, దొంగ ఓట్ల పథకాలు బట్టబయటవ్వడంతో కొత్త ఎత్తులు వేసిన చంద్రబాబు జనసేన, ప్రజాశాంతి పార్టీలను పావులుగా చేసుకుని కుట్రల క్రీడలకు తెరతీసాడు. పవన్ కళ్యాణ్ తో రహస్య పొత్తు పెట్టుకుని తన అభ్యర్థులకు అడ్డం లేకుండా చేసుకుంటున్నాడు. ప్రజా శాంతి ద్వారా క్రైస్తవుల ఓట్లు చీల్చడమే కాకుండా, ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే కన్నింగ్ ఐడియాలు వేస్తున్నాడు. సుమారు 15 కు పైగా నియోజకవర్గాల్లో కే.ఏ.పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లులాగే ఉన్నాయి. చిన్నమార్పు తప్ప దాదాపుగా ఒకేలా ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఉండటంతో ఓటర్లు తికమక పడే ప్రమాదం ఉంది. వైఎస్సార్ సీపీ గుర్తును పోలి ఉండేలా హెలికాఫ్టర్ గుర్తును ప్రజాశాంతి పార్టీకి ఎంపిక చేసాడు చంద్రబాబు. దాంతోపాటే కండువాలు కూడా అచ్చం వైఎస్సార్ కాంగ్రెస్ ను పోలి ఉన్నాయి. ఒకేలా ఉన్న ఈ రెండు పార్టీల గుర్తులను, కండువాలను చూసి ప్రజలు గందరగోళానికి గురౌతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీకి చెందినవారో గుర్తించేది ఎలా అంటూ ఆగ్రహిస్తున్నారు.
ఓట్ల కోసం దొడ్డదారిన...
అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ చేసే ఎన్నికల జిమ్ముక్కులు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించారు చంద్రబాబు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము ఖర్చు పెట్టారు. అధికారిక వెబ్ సైట్ కోసం పని చేయిస్తున్నట్టు చెబుతూ ప్రత్యర్థి పార్టీ ఓటర్ల జాబితాను సేకరించారు. ప్రణాళిక వేసి మరీ నియోజక వర్గాల వారీగా, కుల సమీకరణాలు చూసుకుంటూ ఓట్ల తొలగింపు చేసారు. దాంతో పాటే దొంగ ఓట్లను సృష్టించారు. ఈ రెండు విషయాలనూ ప్రతిపక్ష పార్టీ ఈసీ, గవర్నర్ లకు ఫిర్యాదు చేసి ప్రజల ముందు పెట్టడంతో మరో దొడ్డిదారి పద్ధతులను ఎంచుకున్నారు దేశం నేతలు. పవన్ తో ప్యాకేజ్ కదుర్చుకుని టిడిపి అభ్యర్థులకు పోటీ లేకుండా చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాపు అభ్యర్థులున్న చోట పవన్ కళ్యాణ్ కాపులను నిలబెట్టి ఓట్లు చీల్చే పథకం వేసారు. అదే టీడీపీ కమ్మ అభ్యర్థులున్న చోట పవన్ పోటీ చేయడం లేదు. అక్కడ పొత్తు అని చూపుతూ సత్తాలేని వామపక్ష అభ్యర్థులను నిలబెట్టాడు. చంద్రబాబుకు ప్రయోజనం కలిగేలా, వైఎస్సార్ కాంగ్రెస్ పడే ఓట్లు చీలేలా వేసిన దుర్మార్గపు ఎత్తుగడ ఇది. ఇక క్రైస్తవుల ఓట్లను చీల్చేందుకు పాల్ ను రంగంలోకి దింపాడు చంద్రబాబు. ఐటీ గ్రిడ్ ను అడ్డు పెట్టుకుని ఓటుకు వేల రూపాయిలు ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంచుతూ ఓట్లను బహిరంగంగా కొనే ప్రయత్నమూ చేసాడు. చినబాబు పోటీ చేస్తున్న మంగళగిరిలో సొమ్ములిస్తూ పట్టుబడ్డవారిపై పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ వందల కోట్లు పంపిణీ అవుతూ పట్టుబడుతున్నాయి. ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు తరలిస్తున్న కోట్ల రూపాయిల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక సర్వేలన్నీ ప్రతిపక్షానికే అనుకూలంగా ఉండటంతో దొంగ సర్వేలను ప్రకటించడానికి కూడా వెనుకాడటం లేదు చంద్రబాబు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలని తెలుగుదేశం అధినేత చేస్తున్న ప్రయత్నాలు తెలుగు ప్రజలను విస్తుపోయేలా చేస్తున్నాయి. అధికారం కోసం ఇంత బరితెగింపా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్.
కాసిన్ని ఓట్ల కోసం కూడా కక్కుర్తే...
ఒక ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నా వదలద్దంటూ టీడీపీ అధినాయకత్వం బూత్ లెవెల్ నేతలను ఆదేశిస్తోంది. ప్రతిపక్షానికి సానుకూలంగా ఉన్నారని తెలిస్తే వారిని భయపెట్టో, బుజ్జగించో అధికార పార్టీకి ఓట్లు వేసేలా చేయాలని సూచనలిస్తోంది. ఓటమి భయంతో వణికిపోతున్నముఖ్యమంత్రి కాసిన్ని ఓట్లు కనిపించినా వదలద్దంటూ వెంపర్లాడటం చూసి సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోతున్నాట్టు తెలుస్తోంది. ఇన్ని జిత్తులు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా గెలుపు విషయంలో ఆంధ్ర ప్రజల వైఖరి బాబుకు తేటతెల్లంగా తెలిసిపోతోంది. 2019 బాబు టక్కుటమార విద్యలకు ప్రజలు పులిస్టాప్ పెట్టబోతున్నారనే సందేశం ఇస్తోంది.