డబ్బాబాబు

8 Nov, 2018 12:47 IST

అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను అని వేమన ఏనాడో చెప్పాడు. చంద్రబాబు లాంటి డాబు బాబులు, డబ్బా బాబులు తెలుగు నేలమీద ఇలాంటి విన్యాసాలు చేస్తారని ఆయన ఆనాడే ఊహించినట్టున్నాడు. కేబినెట్ మీటింగ్ పెట్టుకుని కావాల్సినన్ని ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేసుకున్నారు ముఖ్యమంత్రిగారు. అన్నీ ఆయన చేతిలో పనులాయే!

కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, దొనకొండ ఇండస్ట్రియల్ హబ్, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్, రాయపట్నం పోర్ట, విశాఖలో మెట్రో రైలు....అబ్బో చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయం లేకుండా చేసేయాలని నిర్ణయాలు తీసేసుకుంటోందిట. ఓ పక్క కేంద్రం మొన్నటి తిత్లీ తుఫానుకు అడిగినంత నిధులు అందించలేదని అసహనం చూపిస్తూ, మరోపక్క వేల కోట్ల ప్రాజెక్టులను చిటికెన వేళ్ల మీద కట్టేయబోతున్నాం అని కలరింగులిస్తోంది. పన్లో పనిగా కేంద్రానికి బాబుగారు లేఖాస్త్రాలు కూడా సంధించేస్తారట. విభజన హామీలు, కడప స్టీలు ప్లాంటు, తిత్లీ సహాయం ఇలా వీటన్నిటిమీదా తమ అసంతృప్తినంతా ఆ ఉత్తరంలో పొందుపరిచి పంపిస్తారట. ఓహో ఓ పక్క కేంద్రంపై యుద్ధం అంటూ దీక్షలుచేస్తారు. మరోపక్క కేంద్రం సాయం లేకుండా మేమే అన్నీ చేస్తాం అని జబ్బలు చరుచుకుంటారు. మరోపక్క బీద ఏడుపులతో లేఖలు రాస్తామంటారు. నాలుకకు మడతలు, చీలికలు ఎన్నున్నాయో కూడా అర్థంకాని చంద్రబాబు తీరులో ఇదేం విడ్డూరం కాదనుకోండి.

కేబినెట్ నిర్ణయాల గురించి విన్న ప్రజలందరూ 'చెప్పడానికెన్నైనా చెప్పొచ్చు. చేసిచూపినప్పుడే అసలైన విజయం' అని విసుక్కుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇలా చేస్తానని మాటిచ్చినవేవీ ఇంతవరకూ పూర్తికాలేదు. పోలవరం మొదలు హంద్రీనీవా దాకా, రైతురుణమాఫీ మొదలు రాజధానిదాకా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఇక విభజన హామీలైతే కేంద్రంతో ముడిపెట్టి చేతులెత్తేసాడు. పోలవరాన్ని ఏప్రిల్లో పూర్తి చేస్తా, రాజధానిని తెల్లారికల్లా నిర్మించేస్తా, మెట్రోరైలుకు పట్టాలేస్తా, కడప స్టీలు ప్లాంట్ కు పునాదులేస్తా అంటూ బాబు చెప్పే మాటలను నమ్మడానికి తెలుగు ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరు. ఈయనేసిన పునాదిరాళ్లు సమాధిరాళ్లుగా మారి పిచ్చిమొక్కలు మొలచిన తీరును ఎవ్వరూ మరిచిపోరు.