పక్కా కమర్షియల్ రాజధాని

28 Sep, 2015 15:23 IST
లక్ష ఎకరాలకు విస్తరిస్తున్న రాజధాని
అధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
సామాన్యుడికి అందనంత దూరంలో రాజధాని

విజయవాడ: ఆంధ్రప్రదేశ్  కొత్త రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 33వేల ఎకరాల భూముల్ని రైతుల నుంచి ప్రభుత్వం లాక్కొన్న విషయం తెలిసిందే. మరో 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. దీనిపై 15 రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో లక్ష ఎకరాల కలకు రాజధాని వేదిక కాబోతోంది.

అంతా కంపెనీల మయం
రాజధాని ప్రాంతంలో తీసుకొన్న భూములన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.వీటిని గంపగుత్తగా అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అప్పగించే యోచనలో ఉన్నారు. దీని ద్వారా కంపెనీలకు భూముల్ని కేటాయిస్తారు. మొత్తం లక్ష ఎకరాల భూముల్ని తమకు నచ్చిన సంస్థలకు ఇచ్చుకొంటూ పోతారన్న మాట.

పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఈ ప్రాంతాన్ని మొత్తంగా జోన్లుగా విభజించాలని యోచిస్తున్నారు. వాణిజ్యం, వినోదం, ఐటీ, పర్యాటకం అనే జోన్లు గా విభజించి కంపెనీలకు అప్పగించాలని భావిస్తున్నారు. కంపెనీలకు పూర్తి స్వేచ్చ ఇచ్చేట్లుగా చట్టంలో మార్పులు తీసుకు రానున్నారు. అవసరమైతే ఆయా కంపెనీలు ఈ భూములు అమ్ముకొనే వెసులుబాటు కల్పిస్తారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

రైతులకు శాపం
ఇంత జరుగుతున్నప్పటికీ రైతుల సంగతి ఏమిటనే దాని మీద స్పష్టత కనిపించటం లేదు. నిరంతరం కొనసాగే ఇన్ క్లూజివ్ డెవలప్ మెంట్ అనే దానిలో మూల వనరులు ఇచ్చిన వారికి భాగస్వామ్యం అన్న ఆదర్శం కాగితాలకే పరిమితం అన్న మాట వినిపిస్తోంది. అటువంటప్పుడు రైతులకు ఇస్తామంటున్న వెయ్యి గజాల స్థలం నిలిచి ఉంటుందా అన్నదీ సందేహమే.