చంద్రబాబు వృథా ప్రయాసలు

17 Jun, 2015 16:02 IST
పక్కదారి పట్టించే ఎత్తుగడలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) పక్కా ఆధారాలతో ముందుకు సాగుతుండడంతో ఈ కేసును పక్కదారి పట్టించి ఎలాగైనా తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు దారులు వెతుకుతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. 
  • రోజంతా ఉన్నతాధికారులతో భేటీలు. రహస్య మంతనాలు.  అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలతోనూ సమాలోచనలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ ఇతర అధికారులతో విడతల వారీగా చర్చలు జరిపారు.
  • ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్పై నమోదైన కేసుల వివరాలపై సుదర్ఘీంగా మంతనాలు జరిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేస్తే మనమూ నోటీసులు జారీ చేస్తామన్న వదంతులు సృష్టిస్తే అవతలివారు వెనక్కి తగ్గుతారని ఆలోచించారు.
  • కేసులకు కేసులతోనే సమాధానమంటూ మైండ్గేమ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రితో సమావేశానంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని, ఏపీలో కేసీఆర్పై నమోదైన కేసులపై సిట్ ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్కు తాము నోటీసులిస్తామని రకరకాల ప్రకటనలు గుప్పించారు.
  • కేసీఆర్కు నోటీసులిప్పిస్తామన్న వదంతులు సృష్టిస్తే చంద్రబాబుకు నోటీసులివ్వకుండా ఆగిపోతారన్న భావనతో విపరీతమైన ప్రచారం చేశారు.
  • చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదంటూనే నోటీసులిస్తే సంక్షోభం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. 
  • హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు భద్రత లేదన్న ఆరోపణలకు పదునుపెట్టారు. హైదరాబాద్లో ఆంధ్రులకు రక్షణ లేదని, ఆంధ్రప్రదేశ్ పోలీసులను హైదరాబాద్లో నియోగించడం ద్వారా వారి భద్రతను తామే పర్యవేక్షిస్తామన్న వాదనను తెరపైకి తెచ్చారు.